Section 230: పదాలు 26.. కానీ ఆ సంస్థలను కాపాడుతున్నాయ్‌!

గత కొన్నేళ్లుగా వెబ్‌ సంస్థలు, సామాజిక మాధ్యమాలకు అండగా నిలుస్తున్న సెక్షన్‌ 230 (Section 230) పై అమెరికా (USA) సుప్రీంకోర్టు (Supreme Court) విచారణ చేపట్టనుంది. దీని కోసం 9 మంది న్యాయమూర్తులతో ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు.

Published : 26 Feb 2023 01:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం : ఇంటర్నెట్‌కు, ప్రత్యేకించి సామాజిక వేదికలైన ఫేస్‌బుక్‌, గూగుల్‌, ట్విటర్... తదితర సంస్థలకు అండగా నిలుస్తున్న సెక్షన్‌ 230పై అమెరికా సుప్రీంకోర్టులో తొమ్మిది మంది న్యాయమూర్తుల బెంచ్‌ విచారణ చేపట్టనుంది. ఈ సెక్షన్‌ను ఇంటర్నెట్‌లో భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కుకు రక్షణగా సైబర్‌ నిపుణులు పేర్కొంటారు. ఈ సెక్షన్‌లో 26 పదాలున్నా వెబ్‌ ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేయడంతో కేసు విచారణ సంచలనంగా మారింది.

సెక్షన్‌ 230 అంటే?

సెక్షన్‌ 230ను 1996లో అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం ఆన్‌లైన్‌ పబ్లిషర్ లేదా సామాజిక మాధ్యమాల యజమానులు తమ సైట్లలో ప్రచురితమయ్యే యూజర్ల కంటెంట్‌కు బాధ్యత వహించరు. ఈ పోస్టుల వల్ల ఎవరైనా ఇబ్బందులు పడితే ఆ పోస్టు చేసిన వారిపై మాత్రమే కోర్టులో కేసు వేయవచ్చు. ఆయా సంస్థలపైన కేసు వేసే హక్కు ఉండదు.  ఈ సెక్షన్‌తో ప్రముఖ వెబ్‌ సంస్థలు భారీ సంస్థలుగా అవతరించాయి. ఒక వేళ ఈ సెక్షన్‌ లేకపోయింటే ఇప్పటికే కొన్ని లక్షల కేసులు వాటి యజమాన్యాలపై నమోదయివుండేవి. 

గొన్జాలిజ్‌ vs గూగుల్‌

ఈ వారంలో ఈ కేసు విచారణకు రానుంది. 2015లో అమెరికాకు చెందిన గొన్జాలిజ్‌ పారిస్‌కు వెళ్లి.. ఆ సమయంలో ఐసిస్‌ ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయింది.  దీంతో ఆమె కుటుంబసభ్యులు యూట్యూబ్‌లో కొన్ని వీడియోలు ఐసిస్‌కు అనుకూలంగా ఉన్నాయని ఈ ఛానల్‌ ద్వారా అనేకమందిని ఆకర్షించారని కేసు పెట్టారు. ఛానల్‌ అల్గారిథం ద్వారా ఉగ్రవాదులు తమ సందేశాలతో అనేకమంది అమాయకులను తమ సంస్థ వైపు మళ్లిస్తున్నారని ఆరోపించారు. యూట్యూబ్‌ యజమాని గూగుల్‌ కావడంతో వారిపై కేసు పెట్టారు. 

ఏం జరుగుతుందో? 

సెక్షన్ 230 సౌలభ్యంతో అనేక వెబ్‌సైట్లు తమ యూజర్లు పెట్టే కంటెంట్‌కు ఎలాంటి బాధ్యత వహించడం లేదు. కానీ భవిష్యత్‌లో ఉగ్రవాదం, సెక్స్‌, హింస ... తదితర నేరపూరిత కంటెంట్‌ను అప్‌లోడ్‌ చేయకుండా అడ్డుకునేందుకు వీలైన సాఫ్ట్‌వేర్‌ను వెబ్‌ సంస్థలు రూపొందించాలని పలు సంఘాలు కోరుతున్నాయి.  అమెరికాతో పోలిస్తే ప్రపంచంలో అనేక దేశాలు ఇలాంటి సమాచారాన్ని నిరోధించేందుకు చట్టాలు చేశాయి. ఇంటర్నెట్‌ ఆవిర్భవించిన అమెరికాలో మాత్రం ఇంటర్నెట్‌ స్వాతంత్య్రం అన్న పేరుతో వెనకబడివుండటం సరి కాదన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా త్వరలో తొమ్మిదిమంది న్యాయమూర్తుల ధర్మాసనం ఏం ఆదేశాలు వెలువరించనుందో అన్న దానిపై ఇంటర్నెట్‌ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని