Biscuits : రోజంతా బిస్కెట్లు తింటున్నారా.. ఆరోగ్యం గురించి కాస్త ఆలోచించండి!

నోటికి రుచిగా ఉంటాయని కొందరు అదే పనిగా బిస్కెట్లు  (Biscuits) తింటుంటారు. అలా అధిక మొత్తంలో బిస్కెట్లు తీసుకోవడం వల్ల వచ్చే ఇబ్బందులేంటో తెలుసుకోండి. 

Published : 19 Jun 2023 01:03 IST

చాయ్‌-బిస్కెట్‌.. ఈ రెండూ లేనిదే కొందరికి ఉదయం ఉండదు. పరగడుపున టీ తాగితే ఎసిడిటీ వస్తుందనే ఉద్దేశంతో చాలా మంది రెండు బిస్కట్లను  (Biscuits) జత చేసుకొని లాగించేస్తుంటారు. కొందరు ఈ అలవాటును రోజంతా కొనసాగిస్తుంటారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల నిమిత్తం బయట తిరుగుతూ టీ (Tea), కాఫీ (coffee) తాగిన ప్రతిసారి బిస్కెట్లను పొట్టలోకి పంపిస్తుంటారు. అలా రోజుకు తాము ఎన్ని బిస్కెట్లు తింటున్నాం. అవి ఏయే పదార్థాలతో తయారు చేశారనే విషయాన్ని పట్టించుకోరు. ఫలితంగా దీర్ఘకాలంలో కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు.

అధిక క్యాలరీలు

సాధారణంగా బిస్కెట్లు ఎక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయి. వాటిలో హైడ్రోజనేటెడ్‌ కొవ్వుల శాతం కూడా ఎక్కువే. ఒక సాధారణ బిస్కెట్‌ 40 క్యాలరీల శక్తినిస్తుంది. అదే క్రీమ్‌ బిస్కెట్‌ అయితే రకాన్ని బట్టి 100 నుంచి 150 క్యాలరీల శక్తినిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి బిస్కెట్లను ఒకటి తిని ఆపేయడం కొందరికి కుదరని పని. ఇక ఎక్కువగా శుద్ధి చేసిన పిండితోనే (మైదా) బిస్కెట్లు తయారు చేస్తుంటారు. అది శరీరంలోకి చేరగానే ఇన్సులిన్‌పై ప్రభావం చూపుతుంది. బరువు పెరగడానికి కూడా కారణమవుతుంది. 

షుగర్‌ ఫ్రీ అయినా సరే..

రుచికరమైన, ప్రత్యేకమైన బిస్కెట్లను తయారు చేసేందుకు కొందరు ఎమల్సిఫైర్స్‌ వంటి రసాయనాలు వాడుతుంటారు. ఎక్కువకాలం నిల్వ ఉండేందుకు ప్రిజర్వేటివ్స్‌, ఆకర్షణీయంగా కనిపించేందుకు రంగులు కలుపుతారు. బిస్కెట్లలో చక్కెర, ఉప్పు శాతం ఎక్కువగానే ఉంటుంది. అందుకే అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయంతో బాధపడేవారు వాటికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తుంటారు. మధుమేహుల కోసం ఇప్పుడు మార్కెట్లో షుగర్‌ ఫ్రీ బిస్కెట్లు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో కృత్రిమ తీపిని జోడించేందుకు అస్పార్టేం, సుక్రలోజ్‌ కలుపుతారు. అవి కూడా జీవక్రియకు అంతరాయం కలిగిస్తాయి.

బిస్కెట్లకు బదులుగా..

కొన్ని కంపెనీలు ‘హోల్ వీట్‌’, ‘ఫైబర్‌ రిచ్‌’, ‘ఓట్‌ మీల్‌ బేస్డ్‌’ పదార్థాలతో తమ బిస్కెట్లను తయారు చేశామని ప్రచారం చేస్తుంటాయి. అయితే వాటిలో ఉన్న శాతం ఎంతో కొనే ముందే గమనించాలి. పైపై మెరుగులు చూసి ఆరోగ్యకరమైన ఉత్పత్తులు మాత్రమే కొంటున్నామని అనుకోవద్దు. బిస్కెట్లకు బదులుగా డ్రై ఫ్రూట్స్‌, నట్స్‌, మఖానా, శనగలు తీసుకోవడం మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. వీటి ద్వారా రుచితోపాటు శరీరానికి కావాల్సిన మంచి కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు అందుతాయని చెబుతున్నారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని