Puri Jagannath Temple: ఆ రత్న భాండాగారంలో ఏమున్నాయ్..? ఎందుకు తెరవడం లేదు?

పూరీ జగన్నాథ క్షేత్రంలో (Puri Jagannath Temple) ఉన్న రత్న భాండాగారం తాళాలు మాయమైన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇందుకు సంబంధించిన నివేదికను (Missing Keys) బహిర్గతం చేయడంతోపాటు డూప్లికేట్‌ తాళాలతో గదిని తెరవాలని విపక్ష పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Published : 28 Apr 2023 16:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒడిశాలోని పూరీ జగన్నాథ క్షేత్రంలో (Puri Jagannath Temple) ఉన్న రత్న భాండాగారంపై (Ratna Bhandar) ఏళ్లుగా చర్చ నడుస్తోన్న విషయం తెలిసిందే. గతంలో రాజులు, భక్తులు సమర్పించిన అనేక బంగారు, వజ్ర, రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయని.. వీటి విలువ వెలకట్టలేనిదని అంచనా. అటువంటి ఆభరణాల భద్రతపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమైన తరుణంలో దానిని తెరిచేందుకు కొన్నేళ్ల క్రితం ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలోనే భాండాగారంలోని కీలక విభాగ తాళాలు మాయం (Missing Keys) కావడం తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన జస్టిస్‌ రఘుబీర్‌ దాస్‌ కమిషన్‌.. నవంబర్‌ 2018లోనే ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. తాజాగా దీనిపై స్పందన తెలియజేయాలంటూ ఒడిశా హైకోర్టు.. ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తాళాలు ఎలా మాయమయ్యాయని.. డూప్లికేట్‌ తాళాలతో వాటిని తెరవాల్సిందేనని విపక్ష పార్టీలు పట్టుబడుతున్నాయి.

భాండాగారం ఎలా ఉంది..?

పూరీ జగన్నాథ ఆలయం కింది భాగంలో ఈ రత్న భాండాగారం (Ratna Bhandar) ఉంది. ఇందులో రెండు భాగాలున్నాయి. 12వ శతాబ్దంలో రాజులు సమర్పించిన అనేక వజ్ర, రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయి. ఆలయంలో (Puri Jagannath Temple) రోజువారీ పూజలు నిర్వహించేందుకు అవసరమైన నగలు నిధి పైభాగంలో ఉంటాయి. మిగతా ఆభరణాలు ఖజానా కింది భాగంలో భద్రపరుస్తారు. లోపలి భాగంలో వెలకట్టలేనంత అపార సంపద ఉందని భావిస్తుంటారు. అయితే.. దీని తాళాలు మాత్రం కొన్నేళ్లుగా కనిపించకుండా పోయాయి. దీంతో.. ఆ ఆభరణాలు భద్రంగా ఉన్నాయా? లేదా? అన్నదానిపై భక్తుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో.. హైకోర్టు ఆదేశాల మేరకు భాండాగారం తలుపులు తెరిచేందుకు 2018 ఏప్రిల్‌ 4న నిపుణుల బృందం పరిశీలనకు వెళ్లింది. అయితే, రహస్య గది తాళం చెవి లేకపోవడంతో లోపలకు వెళ్లలేకపోయింది. కిటికీ ద్వారా వెలుపల నుంచి పరిశీలించిన బృందం.. పైకప్పుల పెచ్చులు ఊడటం, గోడల్లో తేమ ఉండడాన్ని గమనించారు. వెంటనే మరమ్మతులు చేయకపోతే భాండాగారానికి ముప్పు ఉందని హెచ్చరించారు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఆ గదికి సంబంధించిన డూప్లికేట్‌ తాళం లభ్యమైందని ప్రభుత్వం వెల్లడించింది.

అంచనా వేయలేకపోయిన నిపుణులు..

భాండాగారంలో భారీ మొత్తంలో బంగారం, వజ్రాలు, నగలు కొన్ని వస్త్రాల్లో చుట్టి చెక్కపెట్టెల్లో ఉన్నాయని ఆలయ మాజీ నిర్వాహకులు రబీంద్ర నారాయణ్‌ మిశ్రా వెల్లడించారు. 1978లో ఓసారి ఆ గదిని పరిశీలించిన బృందంలో మిశ్రా కూడా ఒకరు. ఆ సమయంలో విలువైన నగల వివరాలన్నింటిని పొందుపరిచారు. తమిళనాడు, గుజరాత్‌లకు చెందిన కంసాలీలను రప్పించినప్పటికీ.. ఆ ఆభరణాల విలువను మాత్రం లెక్కకట్టలేకపోయారు. తిరిగి 1985లో ఆ రత్న భాండాగారాన్ని తెరిచి చూసినప్పటికీ కొత్త జాబితాను మాత్రం రూపొందించలేదు.

ఆభరణాలు ఇవే..

జగన్నాథుడి సన్నిధిలో విలువైన ఆభరణాలకు సంబంధించి ఒడిశా అసెంబ్లీలోనూ చర్చ జరిగింది. 2021లో అప్పటి న్యాయశాఖ మంత్రి ప్రతాప్‌ జెనా మాట్లాడుతూ.. 1978లో రూపొందించిన జాబితా ప్రకారం, 12,831 భరీల బంగారం (ఒక భరీ సుమారు 12 గ్రాములతో సమానం), 22,153 భరీల వెండితోపాటు అత్యంత విలువైన రాళ్లతో కూడిన బంగారు ఆభరణాలు, ఇతర నగలు ఉన్నాయి. ఎంతో విలువైన రాళ్లతో కూడిన 22,153 భరీల వెండి కూడా నిపుణులు గుర్తించారు. వీటితోపాటు వెండి ఉపకరణాలు ఉన్నాయి. అయితే, పలు కారణాల వల్ల 14 బంగారు, వెండి ఆభరణాలను కొలవలేకపోయినందున వాటిని ఈ జాబితాలో పొందుపరచలేదని చెప్పారు.

హైకోర్టు ఆదేశంతో మళ్లీ తెరపైకి..

ఈ రత్న భాండాగారానికి సంబంధించి రఘుబీర్‌ దాస్‌ కమిషన్‌ నివేదికకు సంబంధించి స్పందనను జులై 10లోగా తెలియజేయాలంటూ ఇటీవల ఒడిశా హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచిన భాజపా, కాంగ్రెస్‌లు.. ఆలయంలోని ఆ రత్న భాండాగారాన్ని తెరవాలని పట్టుబడుతున్నాయి. ఐదేళ్ల క్రితమే ప్రభుత్వానికి ఆ నివేదిక చేరినప్పటికీ ప్రభుత్వం దాన్ని కోల్డ్‌ స్టోరేజ్‌లో పెట్టేసిందని భాజపా ప్రతినిధి పీతాంబర్‌ ఆచార్య విమర్శించారు. డూప్లికేట్‌ తాళాలు లభ్యమైనప్పటికీ గదిని తెరవడానికి ప్రభుత్వం ఎందుకు సంకోచిస్తోందని ప్రశ్నించారు. పారదర్శకత పాటిస్తే వెంటనే ఆ నివేదికను బహిరంగపరచాలని కాంగ్రెస్ సీనియర్‌ నేత బిజయ్‌ పట్నాయక్‌ డిమాండ్‌ చేశారు. దీనిపై స్పందించిన అధికార బీజేడీ.. 38 ఏళ్లుగా (1985) ఆ రత్న భాండాగారాన్ని తెరవలేదని.. దీనిని విపక్ష పార్టీలు రాజకీయం చేయొద్దని ఓ ప్రకటన విడుదల చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని