Tigers : చీతాలొచ్చాయ్‌.. పులులు వెళ్తాయేమో!

కొన్ని దశాబ్దాల క్రితం భారత్‌లో చీతాలు అంతరించిపోయినట్లే ఇప్పుడు కంబోడియాలో పులులు కన్పించడం లేదు. వాటి సంతతి పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చదివేయండి.

Published : 27 Mar 2023 15:08 IST

మన దేశంలో చీతాలు(Cheetah) అంతరించిపోయినట్లు 1952లో ప్రభుత్వం(Government) ప్రకటించింది. వన్యప్రాణుల సంరక్షకుల కృషి, కేంద్ర ప్రభుత్వ చొరవ ఫలితంగా గతేడాది నమీబియా నుంచి 8 చీతాలను భారత్‌(India)కు రప్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra modi) వాటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్కు(Kuno national park)లోకి విడిచిపెట్టారు. రెండో విడతలో దక్షిణాఫ్రికా(South africa) నుంచి మరో 12 చీతాలను తీసుకొచ్చారు. అన్నీ అనుకూలిస్తే ఇదే తరహాలో మరికొన్ని రోజుల్లో భారత్‌(India) నుంచి కొన్ని పులులు కంబోడియా వెళ్లనున్నాయి. మన పులులను పరాయి దేశానికి ఎందుకు పంపించనున్నారో తెలుసుకోండి.

అన్నీ అనుకూలిస్తేనే పయనం!

కట్టుదిట్టమైన సంరక్షణ చర్యలు తీసుకోని ఫలితంగా కంబోడియాలో పులులు అంతరించిపోయాయి. చివరిగా 2007లో అక్కడి కెమెరాల్లో పులి కన్పించింది. 2016లో తమ దేశంలో పులులు పూర్తిగా అంతరించిపోయాయని ఆ దేశం ప్రకటించింది. దాంతో అక్కడి వన్యప్రాణి సంరక్షణ అధికారులు కొన్ని మగ, ఆడపులులను తమ దేశానికి పంపించాల్సిందిగా భారత్‌ సహా ఇతర దేశాలను కోరారు. దాంతో గతేడాదిలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందం జరిగింది. భారత్‌లో ఒక చోట నుంచి మరోచోటకు పులులను తరలించిన దాఖలాలున్నాయి. కానీ వేరే దేశానికి ఎప్పుడూ వాటిని పంపించలేదు. కంబోడియాలో పులుల జీవనానికి కావాల్సిన అనుకూలతలను వివిధ దశల్లో అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని జాతీయ పులుల సంరక్షణ అథారిటీ సభ్యుడు ఎస్పీ యాదవ్‌ ఇటీవల వెల్లడించారు.

ఎందుకు అంతరించిపోయాయి?

సాధారణంగా పులులు స్వేచ్ఛగా సంచరించడానికి ఎక్కువ భూమి అవసరమౌతుంది. ఆహారం నిమిత్తం వాటి వేటకు కావాల్సినన్ని జంతువులు కూడా ఉండాలి. కంబోడియాలో అడవులను నరికివేసి మనుషులు అక్కడ ఇళ్లను నిర్మించుకున్నారు. దాంతో మనుషుల వేటకు ఆస్కారం ఏర్పడింది. పులి శరీరంలోని ప్రతి భాగం విలువైంది. దాని మీసాలు మొదలుకొని, గోర్ల వరకు అన్నింటికీ డిమాండ్‌ ఉండటంతో వాటిని చంపడం పరిపాటిగా మారింది. చాలా దేశాల్లో పులి చర్మం ఇంట్లో ఉండటం ఒక గొప్ప గౌరవంగా భావిస్తారు. ఇలాంటి చర్యల ఫలితంగా కంబోడియాలో పులులు కన్పించకుండా పోయాయి.

వర్షారణ్యం ఎంపిక

ప్రకృతిలో ఒక జాతి అంతరిస్తే అనేక నష్టాలుంటాయి. ఆ లోటు కంబోడియా ప్రభుత్వానికి తెలిసింది. అందుకే తిరిగి పులులను ప్రవేశపెట్టేందుకు కార్డమామ్‌ వర్షారణ్యాన్ని ఎంపిక చేసింది. దీని వైశాల్యం బాగా విస్తృతంగా ఉంటుంది. గడ్డినేలలు, చిత్తడి భూముల కలయిక ఈ ప్రాంతంలో కన్పిస్తుంది. ఇక్కడే కార్డమామ్‌ నేషనల్‌ పార్క్‌, టాటాయ్‌ వన్యప్రాణుల అభయారణ్యం, ఎఫ్‌నమ్‌ సామ్కోస్‌ వన్యప్రాణుల అభయారణ్యం ఉన్నాయి. దాంతో పులులకు కావాల్సినంత భద్రత ఇక్కడ లభించనుంది. స్థానికులు కూడా పులుల సంతతి పెంచే కార్యక్రమానికి సహకరించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ పులుల పునఃప్రవేశం కార్యరూపం దాల్చితే కంబోడియా పర్యాటక ఆదాయం మెరుగుపడనుంది. ఇతర జాతుల సంతతి కూడా పెరగనుంది.

ఆసియాలోనే లక్ష పులులు!

ఒక శతాబ్దం క్రితం కేవలం ఆసియాలోనే లక్ష పులులుండేవట. విచ్చలవిడిగా కొనసాగిన వేట, అటవీ ప్రాంతాలను మనుషుల ఆవాసాలుగా మలుచుకోవడంతో వాటి సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కలిపి కూడా 4500 పులులు మాత్రమే ఉంటాయని ‘వరల్డ్ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌’ అనే సంస్థ చెబుతోంది. సాధారణంగా ఒక్కో పులి 8-10 సంవత్సరాలు మాత్రమే జీవిస్తుంది. వివిధ కారణాల వల్ల కాస్పియన్‌ టైగర్‌, బాలి టైగర్‌ వంటి జాతులు అంతరించిపోయాయి.

భారత్ చర్యలు భేష్‌

భారత్‌లో పులుల సంరక్షణ నిమిత్తం 1973లో ‘ప్రాజెక్ట్‌ టైగర్‌’ చేపట్టారు. పులుల సంచారానికి కావాల్సినంత భూభాగం కేటాయించడం, వాటిని మానవులు వేటాడకుండా చర్యలు తీసుకోవడం, పులుల సంతతి అభివృద్ధి అయ్యే పరిస్థితులు కల్పించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. తొలినాళ్లలో 9 టైగర్‌ రిజర్వ్‌లను ఏర్పాటు చేసి 18,278 చదరపు కిలోమీటర్లను పులుల సంచారానికి  కేటాయించారు. ప్రస్తుతం దేశంలో 53 టైగర్‌ రిజర్వ్‌లున్నాయి. అవి 75,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని కవర్‌ చేస్తున్నాయి. అంటే దేశం మొత్తంలో 2.4%శాతం భూమిని పులుల సంచారం కోసం కేటాయించినట్లయింది. ఈ చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పులుల్లో 70 శాతం భారత్‌లోనే ఉన్నాయి. ఏటా 6 శాతం పెరుగుదల మన వద్ద కన్పిస్తోంది. 2010లో పులుల సంతతి కలిగిన ఇండియా, బంగ్లాదేశ్‌, భూటాన్‌, చైనా, కంబోడియా, ఇండోనేసియా, లావోస్‌, మలేసియా, మయన్మార్‌, నేపాల్‌, రష్యా, థాయిలాండ్‌, వియత్నాం దేశాలు 2022 కల్లా వాటిని రెట్టింపు చేయాలని లక్ష్యం పెట్టుకున్నాయి. అనూహ్యంగా భారత్‌ 2018 నాటికే ఆ ఘనత సాధించింది. ప్రస్తుతం దేశంలో దాదాపు 3వేల పులులున్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.

-ఇంటర్నెట్ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని