China : సామాజిక మాధ్యమాలపై డ్రాగన్‌ నిఘా.. చీమ చిటుక్కుమన్నా తెలిసిపోతుందట!

చైనాలో (china) ఇంటర్నెట్‌ (Internet) వినియోగం సహా మొత్తం సామాజిక మాధ్యమాలను (social media) డ్రాగన్‌ ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకుంది. దాంతో రాజకీయ విమర్శలు, తప్పుడు సమాచార వ్యాప్తి, ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు ఇలా ఏవి కనిపించినా వెంటనే వాటిని తొలగిస్తోంది.  

Published : 05 Jun 2023 16:28 IST

చైనా సైబర్‌స్పేస్‌ రెగ్యులేటర్‌(సీఏసీ) రెండు నెలల పాటు సామాజిక మాధ్యమాలపై  (social media) నిఘా పెట్టి 14 లక్షల పోస్టులను డిలీట్‌ చేసింది. సుమారు 67 వేల ఖాతాలను తొలగించింది. సోషల్‌ మీడియాను ఆసరా చేసుకొని తప్పుడు సమాచార వ్యాప్తి, అక్రమ లాభార్జన, అధికారుల పేరుతో నకిలీ ఖాతా తెరవడం వంటి పనులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు సీఏసీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్‌, సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్న పౌరులను డ్రాగన్‌ ప్రభుత్వం ఎలా కట్టడి చేస్తోందో తెలుసుకోండి.

గ్రేట్‌ ఫైర్‌ వాల్‌

చైనా ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ‘గ్రేట్‌ ఫైర్‌ వాల్‌’ అనే అధునాతన వ్యవస్థను వినియోగిస్తోంది. విదేశీ వెబ్‌సైట్‌లు, సామాజిక మాధ్యమాలను ఆ దేశ పౌరులు వినియోగించకుండా ఈ వ్యవస్థ కట్టడి చేస్తుంది. ఈ ఫైర్‌వాల్‌ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో అందుబాటులో ఉన్న ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ వంటి వాటిని సైతం బ్లాక్‌ చేయగలదు. ఇక ఇంటర్నెట్లో దొరికే సమాచారం మొత్తాన్ని చైనా నెటిజన్లు పొందకుండా ఇది వడపోస్తుంది.

స్వదేశీ సామాజిక మాధ్యమాలు

తమ దేశ పౌరులు కేవలం విదేశీ సామాజిక మాధ్యమాలపై ఆధారపడకుండా సొంత సామాజిక మాధ్యమాలను చైనా అభివృద్ధి చేసింది. వీ చాట్‌, వీబో, క్యూక్యూ ప్లాట్‌ఫామ్స్‌ ఆ కోవకు చెందినవే. అయితే వీటిపై ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. ఎవరైనా హద్దుమీరితే వెంటనే ప్రభుత్వానికి సమాచారం వెళ్తుంది. 

సెన్సార్‌, కంటెంట్‌ కంట్రోల్‌

ఆన్‌లైన్‌లో లభ్యమయ్యే కంటెంట్‌ను సెన్సార్ చేయడానికి, పర్యవేక్షించడానికి చైనా ప్రభుత్వం పెద్ద సంఖ్యలో కంటెంట్ మోడరేటర్‌లను ఉపయోగిస్తుంది. వీరు అభ్యంతకరంగా కనిపించిన పోస్టులను వెంటనే తొలగిస్తారు. ఆటోమేటెడ్ సిస్టమ్‌ల సహాయంతోనూ కంటెంట్‌ సెన్సార్‌ జరుగుతుంది. ప్రభుత్వాన్ని విమర్శించే రాజకీయ పోస్టులు, మార్గదర్శకాలను ఉల్లంఘించిన పోస్టులను తక్షణమే గుర్తించి బ్లాక్‌ చేస్తారు. ఇలా తొలగించే వాటిలో మానవహక్కులు, టిబెట్‌, తైవాన్‌, తియానన్మెన్‌ స్క్వేర్ అంశాలు, అధికారుల నిర్ణయాలను సవాల్‌ చేసే పోస్టులు కూడా ఉంటాయి.

అసలు పేరు ఉంటేనే..

సామాజిక మాధ్యమాల్లో ముసుగు తొడుక్కొని చెలరేగిపోయే వారు చాలా మంది ఉంటారు. అసలు పేరు కాకుండా నకిలీ పేరుతో ఖాతాలు తెరిచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటారు. అలాంటి వారికి చెక్‌ పెట్టేందుకు అసలు పేరుతోనే సామాజిక మాధ్యమ ఖాతా ఉండాలనే నిబంధన పెట్టారు. పైగా ఖాతా తెరవాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరి. దాంతో మితిమీరి ప్రవర్తించే వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసినట్లయింది. ఆన్‌లైన్‌ వేదికగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిని గుర్తించడం సులభమైంది.

నిరంతర నిఘా, పర్యవేక్షణ

చైనా అధికారులు సామాజిక మాధ్యమాలపై విస్తృత నిఘా పెట్టారు. కొన్ని కీవర్డ్‌లు ఉపయోగించి సమాచారాన్ని వడపోస్తున్నారు. ఫొటోలను గుర్తిస్తున్నారు. కృత్రిమ మేధ అల్గారిథంతో నెటిజన్ల కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. దాంతో దేశ భద్రతకు ముప్పు వాటిల్లే పోస్టులు, సమాజంలో అశాంతిని రగిలించే పోస్టులను వేగంగా గుర్తించి వాటికి చెక్‌ పెడుతున్నారు.

సెల్ఫ్ సెన్సార్‌షిప్

చైనాలో ఇన్ని నిబంధనలు ఉన్నాయని తెలిసి చాలా మంది ‘సెల్ఫ్‌ సెన్సార్‌షిప్‌’ పాటిస్తున్నారు. వ్యక్తులు, సంస్థలు ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తూ సున్నితమైన అంశాలను సామాజిక మాధ్యమాల్లో ప్రస్తావించడానికి వెనకాడుతున్నారు. ముఖ్యంగా రాజకీయ చర్చలు చేస్తే చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడుతున్నారు.

బీజింగ్‌ తొలి నుంచీ తమకు ఇబ్బంది కలిగించే ఎలాంటి సమాచారాన్ని వ్యాప్తి చేసినా.. అలాంటి పౌరులను గుర్తించి అరెస్టు చేస్తోంది. కమ్యూనిస్టు ప్రభుత్వానికి, సైన్యానికి సంబంధించి చేసే పోస్టులు వైరల్‌గా మారితే తక్షణమే చర్యలు తీసుకుంటోంది. 

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని