Employees For Sale: నచ్చని ‘బాస్‌’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్‌ మార్కెట్‌లో నయా ట్రెండ్‌!

చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్‌ వైరల్‌ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్‌లను, సహోద్యోగులను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెడుతున్నారు.

Updated : 08 Jul 2024 11:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఏ ఉద్యోగమైనా (Job) స్థాయిని బట్టి ఒత్తిడి ఉంటుంది. దీనిని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పని ప్రాంతంలో పరిస్థితులు బాగోలేకపోయినా, సహోద్యోగులు (Colleagues) బృందంలా కాకుండా ఎవరికి వారన్నట్లుగా ప్రవర్తిస్తున్నా.. ప్రతి చిన్న పొరపాటునూ బాస్‌ భూతద్దంలో పెట్టి అందరి ముందు అవమానించినా ఒత్తిడి (Stress) మరికాస్త ఎక్కువవుతుంది. అలాంటి వాతావరణం వల్ల ఉద్యోగులు తీవ్ర సంఘర్షణకు లోనవుతారు. కుంగుబాటుకు గురవడమే కాకుండా పనిపై వ్యతిరేకత ఏర్పడుతుంది. ఈ తరహా సమస్యల నుంచి బయటపడేందుకు చైనాలోని (China) యంగ్‌ ప్రొఫెషనల్స్‌ సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఉద్యోగులు తమకు నచ్చని బాస్‌లను, సహోద్యోగులను, ఉద్యోగాలను సెకెండ్‌ హ్యాండ్‌ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫాంలపై విక్రయానికి (Employees For sale) పెడుతున్నారు.

ఈ ట్రెండ్ ప్రస్తుతం చైనాలో వైరల్‌ అవుతోంది. ఇంతకీ బాస్‌లను అమ్మడం ఏంటి అనుకుంటున్నారా?అలీబాబాకు చెందిన సెకెండ్‌ హ్యాండ్‌ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫాం క్జియాన్‌యు ఈ ట్రెండ్‌కు వేదికగా నిలుస్తోంది.  పని ఒత్తిడి, ఆఫీసు వాతావరణంతో విసిగిపోయిన ఉద్యోగులు.. తమకు ఇష్టం లేని బాస్‌లు, సహోద్యోగులు, ఉద్యోగాలను వెబ్‌సైట్‌లో లిస్టింగ్‌కు పెడుతున్నారు. ‘బాధించే బాస్‌లు’, అసహ్యించుకునే సహోద్యోగులు, ‘భయం పుట్టించే ఉద్యోగాలు’ అంటూ మూడు కేటగిరీలుగా విభజించి.. వారి ధరను రూ.4 నుంచి రూ.9 లక్షల వరకు నిర్ణయిస్తున్నారు.

ఓ మహిళా ఉద్యోగి తన జాబ్‌ను రూ.91 వేలకు అమ్మకానికి పెట్టింది. నెలకు రూ.33 వేల జీతం వస్తుందని, తన జాబ్‌ను కొనుక్కుంటే 3 నెలల్లోనే ఆ మొత్తాన్ని సంపాదించవచ్చని రాసుకొచ్చింది. ‘పక్కవారిని ఎగతాళి చేయడంలో ముందువరుసలో ఉండే నా సహోద్యోగిని 3,999 యువాన్లకు (సుమారు రూ.45,945)కి అమ్మేయాలని నిర్ణయించుకున్నా. ఇతడితో ఎలా మసలుకోవాలో మీకు చెప్తాను. ఆయన వల్ల బలిపశువు కాకుండా 10 చిట్కాలను కూడా చెప్తా’ అంటూ ఆఫీసులో తనకు ఇబ్బంది కలిగించే వ్యక్తిని అమ్మకానికి పెట్టారు మరొకరు. చీటికీ మాటికీ కించపరుస్తున్నాడన్న కారణంతో మరో యంగ్‌ ప్రొఫెషనల్‌  తన బాస్‌ను 500 యువాన్లు (సుమారు రూ.5,742)కు అమ్మకానికి పెట్టాడు.

ఉద్యోగాలకు రాజీనామా చేయడం విన్నాం గానీ, జాబ్‌ను, బాస్‌లను, సహోద్యోగులను అమ్మడం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా? అదేం లేదండీ.. ఇదంతా కేవలం కల్పితమే. నిజం కాదట. తమ మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు చైనాలో ఉద్యోగులు అనుసరిస్తున్న ఓ విధానం మాత్రమే. దీనినే అక్కడ ‘వర్క్‌ స్మెల్‌’అని పిలుస్తున్నారు. రోజంతా పని చేసిన తర్వాత తమకు నచ్చనివారిని, ఇబ్బంది పెట్టేవారిని ఇలా ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెడితే.. ఒత్తిడి కొంతవరకు తగ్గుతుందని వారి భావన. ఒకవేళ అమ్మకానికి పెట్టిన వారిని కొనుగోలు చేసేందుకు సరదాగా ఎవరైనా ముందుకొచ్చినా.. లిస్టింగ్‌ చేసిన వాళ్లు క్యాన్సిల్‌ చేస్తారట. లేదంటే.. డబ్బులు చెల్లించకుండానే అవతలి వ్యక్తి కొనుగోలును నిలిపివేస్తాడట. అంటే నిజమైన ఆర్థిక లావాదేవీలు జరగవు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇదంతా కేవలం ఆత్మసంతృప్తి కోసమే. దీనిపై అక్కడ మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు సరదాగా తీసుకుంటుంటే.. ఇంకొందరు మాత్రం యువత ఎటువైపు వెళ్తోంది.. ఇదేం వెర్రి? అని ప్రశ్నిస్తున్నారట.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు