ప్లాస్టిక్‌ నిర్మూలన దిశగా పలు దేశాలు!

పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న అంశాల్లో ప్లాస్టిక్‌ ఒకటి. ఈ ప్లాస్టిక్‌ వస్తువులు అంత త్వరగా భూమిలో కలిసిపోవు. దీంతో ఎన్నాళ్లయినా భూమిలో ఉండిపోతాయి. వీటిని తినడం వల్ల జంతువులు, జలాచరాలు తీవ్ర అస్వస్థతకు  గురవుతున్నాయి. వీటిని దహనం చేస్తే

Updated : 11 Oct 2020 11:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న అంశాల్లో ప్లాస్టిక్‌ ఒకటి. ఈ ప్లాస్టిక్‌ వస్తువులు అంత త్వరగా భూమిలో కలిసిపోవు. ఎన్నాళ్లయినా భూమిలో ఉండిపోతాయి. వీటిని తినడం వల్ల జంతువులు, జలచరాలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నాయి. ప్లాస్టిక్‌ను దహనం చేస్తే వచ్చే రసాయన వాయువులు వాయు కాలుష్యానికి దారి తీస్తాయి. ఇలా ప్లాస్టిక్‌ కారణంగా జీవరాశులకు, పర్యావరణానికి ప్రమాదం పొంచి ఉంది. అందుకే వీలైనంత వరకు ప్లాస్టిక్‌ వస్తువులను వినియోగించవద్దని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. అయినా వీటి వినియోగం ఏ మాత్రం తగ్గట్లేదు. దీంతో కొన్ని దేశాలు ప్లాస్టిక్‌పై నిషేధం విధిస్తున్నాయి. తాజాగా ఇంగ్లాండ్‌ కూడా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై నిషేధం విధించింది.

ప్లాస్టిక్‌పై పోరులో భాగంగా ఇంగ్లాండ్‌ ప్రభుత్వం సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులను నిషేధిస్తూ గత ఏప్రిల్‌లో చట్టం చేసింది. అయితే కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా నిషేధం అమలు వాయిదా పడింది. తాజాగా అక్టోబర్‌ 1వ తేదీ నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. వ్యాపార రంగంలో ప్లాస్టిక్‌ స్ట్రాలు, స్టిర్రర్స్‌, ప్లాస్టిక్‌తో చేసిన చెవి పుల్లలు వంటివి అమ్మినా, కొన్నా నేరంగా పరిగణించనున్నారు. దివ్యాంగులు, చికిత్స పొందుతున్న వారికి వీటి వినియోగంలో మినహాయింపు ఇచ్చారు. పర్యావరణాన్ని, సముద్ర జలాలను కాపాడుకోవాల్సిన అవసరముందని, అందుకే సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై నిషేధం విధించి ప్లాస్టిక్‌పై పోరులో మరో అడుగు ముందుకు వేసినట్లు అక్కడి ప్రభుత్వ అధికారులు తెలిపారు. దేశంలో ప్టాస్లిక్‌ నిషేధంపై ఐదు అంచెల ప్రణాళిక అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే సూపర్‌మార్కెట్లలో 95శాతం ప్లాస్టిక్‌ వినియోగం తగ్గిపోయిందని వెల్లడించారు. త్వరలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను సేకరించి రీసైక్లింగ్‌ చేసే యోచనలో ఉన్నట్లు చెప్పారు. దేశంలో ఏటా 4.7 బిలియన్‌ ప్లాస్టిక్‌ స్ట్రాలు, 316 మిలియన్‌ ప్లాస్టిక్‌ స్టిర్రర్స్‌, 1.8 బిలియన్‌ చెవి పుల్లలు వినియోగిస్తారట.  

2021 నాటికి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ రహిత దేశంగా కోస్టారికా!

పర్యావరణాన్ని సంరక్షించుకునే దేశాల్లో కోస్టారికా ముందుంటుంది. ఈ దేశం ఇప్పటికే 99 శాతం విద్యుత్‌ను పునరుత్పాదక వనరులతో ఉత్పత్తి చేస్తోంది. నదులు, జియో థర్మల్‌, సోలార్‌, గాలిమరల సాయంతో విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. చమురు ఉత్పత్తులను, చమురుతో తయారు చేసిన వస్తువులను చాలా కాలం నుంచి వాడట్లేదు. గతేడాది అక్కడి ప్రభుత్వం సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను నిషేధించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ ఏడాది ప్రారంభంలో ప్లాస్టిక్‌ నిషేధం అమల్లోకి వచ్చింది. 2021నాటికి కోస్టారికా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ రహిత దేశంగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్‌ వస్తువులకు బదులుగా ఆరు నెలల్లో భూమిలో కలిసిపోయే పునరుత్పాదక పదార్థాలతో తయారు చేసిన వస్తువులను అందుబాటులోకి తెచ్చారు. చెరకుతో చేసిన డబ్బాలు, కలపతో చేసిన చెంచాలను ప్రజలు ఉపయోగిస్తున్నారు. త్వరలో దేశవ్యాప్తంగా కేవలం విద్యుత్‌ వాహనాలే నడిచేలా ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది.

ఇంగ్లాండ్‌.. కోస్టారికా బాటలో జర్మనీ..

యూరప్‌ దేశాలు ఇప్పటికే ప్లాస్టిక్‌ వాడకం తగ్గించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జర్మనీ కూడా గతేడాదే సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై నిషేధం విధించాలని నిర్ణయించింది. అయితే వచ్చే ఏడాది జులైలోనే ఈ నిషేధం అధికారికంగా అమలు కానుంది. ఇప్పటికే ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించేందుకు పలు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం.. నిషేధం అమల్లోకి వచ్చాక వంటింట్లో ఉపయోగించే ప్లాస్టిక్‌ వస్తువులు, స్ట్రాలు, ఆహార పదార్థాలు నిల్వ ఉంచే ప్లాస్టిక్‌ కవర్లు, చెవి పుల్లలు, బెలూన్‌ హోల్డర్స్‌ వంటి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులను వినియోగించకుండా కఠిన చర్యలు తీసుకోనుంది.

మన దేశంలోనూ ప్లాస్టిక్‌ నిషేధం అమల్లో ఉంది. దుకాణాల్లో ప్లాస్టిక్‌ కవర్ల వాడకం చాలా వరకు తగ్గిపోయింది. ఇక జపాన్‌లో షాపింగ్‌ చేస్తే సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ సంచులకు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇండోనేషియా రాజధాని జకర్తాలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులు పూర్తిగా నిషేధం. యూకేలోని వేల్స్‌ దేశం 2050 నాటికి చెత్తరహిత దేశంగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ప్లాస్టిక్‌ వాడకంపై వచ్చే ఏడాది ప్రథమార్ధంలో నిషేధం విధించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని