ఇంటి నుంచి కాదు.. విదేశాల నుంచి పని చేస్తారా?

కరోనా మహమ్మారి దెబ్బకు ఉద్యోగుల పని తీరు, సంస్థల నిబంధనలు మారిపోయాయి. కరోనా కట్టడిలో భాగంగా సంస్థలు తమ ఉద్యోగులను తాత్కాలికంగా వర్క్‌ ఫ్రమ్‌ హోం చేయమంటున్నాయి. కొన్ని సంస్థలు ఇప్పట్లో ఆఫీస్‌కు అస్సలు రావొద్దని స్పష్టం చేశాయి. కరోనాతో

Published : 26 Nov 2020 13:09 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోంపై వివిధ దేశాల ప్రత్యేక ప్యాకేజీలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా మహమ్మారి దెబ్బకు ఉద్యోగుల పని తీరు, సంస్థల నిబంధనలు మారిపోయాయి. కరోనా కట్టడిలో భాగంగా సంస్థలు తమ ఉద్యోగులను తాత్కాలికంగా వర్క్‌ ఫ్రమ్‌ హోం చేయమంటున్నాయి. కొన్ని సంస్థలు ఇప్పట్లో ఉద్యోగులు ఆఫీస్‌కు అస్సలు రావొద్దంటున్నాయి. కరోనాతో సంబంధం లేకుండా తాము మరో ప్రకటన ఇచ్చే వరకు వర్క్‌ ఫ్రమ్‌ హోం చేయాలని తేల్చి చెప్పాయి. ఈ పరిణామాలతో ఉద్యోగులు సైతం వర్క్‌ ఫ్రమ్‌ హోం చేయడానికి అలవాటు పడిపోయారు. ఆఫీస్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు కదా.. ఎక్కడ నుంచి పని చేస్తే ఏంటని.. కొందరు ఉన్న ఊరిని వదిలేసి సొంతూళ్లకు వెళ్లిపోయారు. మరికొందరు ఏదైనా విదేశానికి వెళ్లి అక్కడ విహార యాత్రను ఆస్వాదిస్తూ విధులు నిర్వర్తించాలని భావిస్తున్నారు. ఇలాంటి వారి కోసం కొన్ని దేశాలు ఆహ్వానం పలుకుతున్నాయి. ఇప్పటికే పలు దేశాలు ఇలాంటి సదుపాయాల్ని అందిస్తున్నా.. కరోనా నేపథ్యంలో మా దేశంలో ఉంటూ పని చేసుకోండంటూ మరికొన్ని దేశాలు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. 

కేమన్‌ ఐలాండ్‌

చుట్టూ సముద్రం.. ఒడ్డులో హాయిగా కూర్చొని పనిచేయాలనుకుంటున్నారా? అయితే మీకోసమే యూకే ఆధీనంలో ఉండే కేమన్‌ ఐలాండ్స్‌ ‘గ్లోబల్‌ సిటిజెన్‌ కాన్సియార్జ్‌ ప్రొగ్రామ్‌’ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఇతర దేశాల్లో ఉండే ఉద్యోగులు రెండేళ్లపాటు కేమన్‌ ఐలాండ్స్‌లో ఉంటూ పని చేసుకోవచ్చు. అక్కడికి వెళ్లాలంటే ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. ఉద్యోగి ఒక్కరే అయితే లక్ష డాలర్లు, దంపతులైతే లక్షా యాభైవేల డాలర్లు, పిల్లలుంటే లక్షా ఎనభైవేల డాలర్ల వార్షికాదాయం వస్తున్నట్లు నిరూపించాలి. గుర్తింపు కార్డు, బ్యాంక్‌ లావాదేవీలు, ఆరోగ్య బీమా పత్రాలు, నేర చరిత్ర లేదని చెప్పే ధ్రువపత్రం సమర్పించాల్సి ఉంటుంది. దీనికి ఫీజు 1500 డాలర్ల వరకు ఉంది. ఇక్కడికి వచ్చాక బస, ఇతర సదుపాయాలకు ఖర్చులు వేరుగా ఉంటాయి.

ఆంటిగ్వా అండ్‌ బర్ముడా

కరేబియన్‌ ప్రాంతంలో ఈ ఆంటిగ్వా అండ్‌ బర్ముడా దేశం కూడా వర్క్‌ ఫ్రమ్‌ హోం చేసేవాళ్లని తమ దేశం నుంచి చేయమని పిలుస్తోంది. ఈ మేరకు నొమడ్‌ డిజిటల్‌ రెసిడెన్స్‌(ఎన్‌డీఆర్‌)వీసాలు జారీ చేస్తోంది. ఈ దేశంలో ఉండి పనిచేయాలంటే ఉద్యోగి పని చేసే సంస్థ కరేబియన్‌ ప్రాంతానికి చెందినది కాకూడదు. ఉద్యోగికి 50వేల డాలర్ల వార్షికాదాయం ఉండాలి. కుటుంబాన్ని వెంటతీసుకువెళ్లొచ్చు. ఇక్కడ ఉండే రెండేళ్లూ ఉద్యోగులు తప్పకుండా ఆరోగ్య బీమా కలిగి ఉండాలి. దరఖాస్తులో భాగంగా ఒక్కరికైతే 1500 డాలర్లు, జంటకయితే 2వేల డాలర్లు, కుటుంబానికైతే 3వేల డాలర్లు ఫీజు వసూలు చేస్తున్నారు. 

దుబాయి

ప్రపంచంలో అత్యధిక మంది పర్యాటకులు వెళ్లే దేశాల్లో దుబాయి కూడా ఒకటి. ఎంతో అందమైన, సందర్శక ప్రాంతాలు ఎక్కువగా ఉన్న ఈ దుబాయిలో పర్యటిస్తూ పని చేసుకునే సదుపాయముంది. ఈ మేరకు దుబాయి.. ఏడాది వ్యవధి ఉన్న ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఇతర దేశాల్లో ఉండే ఉద్యోగులు ఏడాది పాటు దుబాయిలో ఉండి వర్క్‌ ఫ్రమ్‌ హోం చేయొచ్చన్నమాట. ఇందుకు కోసం దరఖాస్తుదారులు నెలకు 5వేల డాలర్లు సంపాదిస్తున్నట్లు నిరూపించే ప్లే స్లిప్స్‌, మూడు నెలల బ్యాంక్‌ లావాదేవీలు చూపించాల్సి ఉంటుంది. యూఏఈలోనూ వర్తించేలా ఆరోగ్య బీమా ఉండాలి. ఫీజు ఒక్కరికి 287 డాలర్లు.

అరుబా

ఇదో ఐలాండ్‌. అందమైన బీచ్‌లు, ఆహ్లాదకరమైన వాతావరణం దీని సొంతం. కరోనా కారణంగా కొన్ని రోజులు మూతపడ్డా జూన్‌ నుంచి పర్యటకులను అనుమతిస్తోంది. తాజాగా వర్క్‌ ఫ్రమ్‌ హోం చేసేవారి కోసం అరుబా ‘వన్‌ హ్యాపీ వర్కేషన్‌’ పేరుతో ఒక పథకం తీసుకొచ్చింది. దీనిలో భాగంగా విదేశాల్లో పని చేసే ఉద్యోగులు ఈ దీవిలో 90 రోజులపాటు ఉండొచ్చు. ఇక్కడ ఉండే హోటళ్లు, రిసార్ట్స్‌, అద్దె ఇళ్లకు రాయితీలు ఇస్తారట. అయితే ఈ అవకాశం కేవలం అమెరికా వాసులకే. యూఎస్‌ పాస్‌పోర్ట్‌ ఉన్న ఎవరైనా సరే.. వీసా, ఇతర అనుమతి పత్రాలు ఏవీ లేకున్నా ఈ ఐలాండ్‌లో వాలిపోవచ్చు.

బార్బడోస్‌ 

కరేబియన్‌ ప్రాంతంలో మరో ఐలాండ్‌ దేశమే బార్బడోస్‌. ఈ దేశం కూడా ఉద్యోగులకు ఏడాదిపాటు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. జులై నుంచే ఈ దరఖాస్తులు మొదలయ్యాయి. ఈ ఐలాండ్‌కు వెళ్లాలంటే ముందుగా ఉద్యోగి తనకు సంబంధించిన వివరాలతో సంబంధిత వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఒక్కరైతే 2వేల డాలర్లు, కుటుంబమైతే 3వేల డాలర్లు ఫీజు ఉంటుంది. 

ఎస్టోనియా

యూరప్‌లోని ఎస్టోనియా దేశం కూడా గత ఆగస్టు నెలలోనే ‘డిజిటల్‌ నొమడ్‌ వీసా’ను ప్రారంభించింది. ఈ దేశంలో ఉండి పని చేయాలనుకునేవారు ముందుగా తాము వర్క్‌ ఫ్రమ్‌ హోం చేయగలమని నిరూపించాలి. నెలకు కనీసం 4,130 డాలర్లు ఆదాయం వస్తున్నట్లు చూపించాలి. ఏడాది లోపల ఎన్ని రోజులైనా ఇక్కడ ఉండొచ్చు. ఉండే రోజుల్ని బట్టి దరఖాస్తు ధర 94 డాలర్ల నుంచి 117 డాలర్ల వరకు ఉంటుంది. 

బెర్ముడా

బెర్ముడా ఐలాండ్‌.. ఉద్యోగులతోపాటు విద్యార్థులను సైతం ఆకర్షిస్తోంది. పని నిమిత్తమైనా, చదువు నిమిత్తమైనా ఏడాదిపాటు ఇక్కడ ఉండొచ్చని బెర్ముడా ప్రభుత్వం గత జులైలోనే ప్రకటన విడుదల చేసింది. ‘రెసిడెన్సీ సర్టిఫికేట్‌ పాలసీ’ పథకం కింద విద్యార్థులు ఇక్కడికి రావాలంటే కనీసం 18ఏళ్లు నిండి ఉండాలి. ఉద్యోగులైతే ఆరోగ్య, బీమా, ఉద్యోగి గుర్తింపు కార్డు, స్థిరమైన ఆదాయం చూపించాలి. దరఖాస్తు ధర 263 డాలర్లు.

జార్జియా

ఆరు నెలలు అంతకన్నా ఎక్కువ నెలలు ఏదైనా విదేశంలో ఉండి పని చేసుకోవాలనుకునే ఉద్యోగుల కోసం జార్జియా న్యూ వీసా ప్రోగ్రామ్‌ ప్రారంభించింది. కనీసం నెలకు 2వేల డాలర్లు సంపాదన, ఆరోగ్య బీమా ఉన్నట్లు నిరూపించాలి. ఈ దేశానికి రావడంతోనే 12 రోజులు సొంత ఖర్చుతో క్వారంటైన్‌లో ఉండాలని, ఆ తర్వాత కరోనా పరీక్షలు చేయించుకోవాలని నిబంధన పెట్టారు. 

ఫ్రీలాన్సర్లకు ప్రత్యేకం..

కొంతమంది ఫ్రీలాన్సర్‌గా పని చేస్తుంటారు. ఉన్న చోటు లేదా విదేశాల నుంచి పనులు సంపాదించుకుంటారు. ఒత్తిళ్లు లేకుండా తమకు నచ్చిన సమయంలో పనిచేస్తూ సంస్థలకు అవసరమైన సేవలు అందిస్తుంటారు. అలాంటి వారి కోసం కొన్ని దేశాలు ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నాయి. చెక్‌ రిపబ్లిక్‌ చాలాకాలంగా జివ్నో వీసా/లాంగ్‌ టర్మ్‌ బిజినెస్‌ వీసాలు మంజూరు చేస్తోంది. ఈ వీసాతో చెక్‌ రిపబ్లిక్‌లో ఎంత కాలమైనా ఉండొచ్చు. ఇందుకోసం అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆదాయ వనరులు, ఆరోగ్య బీమా, దేశంలో ఎక్కడా ఉంటారో ఆధారాలు చూపించాలి.వీరి కోసం పోర్చుగల్‌ ‘టెంపరీ రెసిడెన్స్‌’ పేరుతో వీసాలు ఇస్తోంది. ఇక్కడ ఉండాలనుకునే వారి నైపుణ్యాలను పోర్చుగల్‌ ప్రభుత్వానికి చూపించాలి. అప్పుడే పోర్చుగల్‌లో ఉండే సంస్థలు దరఖాస్తుదారులకున్న నైపుణ్యాన్ని బట్టి పని కల్పించే అవకాశాలున్నాయి. జర్మనీ కూడా కేవలం ఫ్రిలాన్సర్ల కోసం ప్రత్యేక వీసాలు మంజూరు చేస్తోంది. తొలుత మూడు నెలలే దీనికి పరిమితి. ఉపాధి పొంది చక్కగా పనిచేస్తే గడువు మరింత పొడిగిస్తారు. అయితే దరఖాస్తుదారుడు ఈ వీసా పొందాలంటే ఆదాయ ధ్రువపత్రం, ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌, గతంలో పని చేసిన సంస్థ నుంచి సిఫార్సు తప్పనిసరి. 

ఫ్రీలాన్సర్లు, స్వయం ఉపాధి పొందేవాళ్ల కోసం

స్పెయిన్‌ ఎప్పటినుంచో ‘సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌ వర్క్‌ వీసా’ను మంజూరు చేస్తోంది. ఈ వీసాతో ఎవరైనా సరే స్పెయిన్‌లో పని వెతుక్కొని ఏడాదిపాటు నివసించొచ్చు. అయితే, అక్కడికి వెళ్లాలంటే దరఖాస్తు దారులు గతంలో పని చేసిన అనుభవం ఉన్నట్లు పత్రాలు కలిగి ఉండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని