
ఎయిర్‌పోర్టు లేని దేశాలివీ..!
ఇంటర్నెట్ డెస్క్: రవాణా రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ధనికులు మాత్రమే ఎక్కే విమానాల్లో ఇప్పుడు మధ్యతరగతి ప్రజలూ ప్రయాణిస్తున్నారు. మన దేశంలోనూ విమాన ప్రయాణికుల సంఖ్య భారీగానే పెరిగింది. దీంతో చిన్న చిన్న పట్టణాలకు కూడా విమాన సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే, ఇప్పటికీ అసలు ఒక్క ఎయిర్‌పోర్టు కూడా లేని దేశాలు కొన్ని ఉన్నాయంటే నమ్ముతారా? అంతేకాదు.. అవన్నీ యూరప్ ఖండంలోనే ఉండటం గమనార్హం. మరి ఆ దేశాలేవో తెలుసుకుందాం పదండి..
వాటికన్ సిటీ
ఇటలీ దేశంలోనే ప్రత్యేక దేశంగా వాటికన్ సిటీ ఉందనే విషయం తెలిసిందే. ప్రపంచంలోకెల్లా అత్యంత చిన్న దేశంగా దీనికి పేరుంది. ఈ దేశానికి అధినేతగా క్రైస్తవ మత గురువు పోప్ వ్యవహరిస్తారు. ఆయన చెప్పిందే ఇక్కడ వేదం. వెయ్యిలోపే జనాభా ఉండే ఈ చిన్న దేశానికి ఎయిర్‌పోర్టు లేదు. ఇక్కడికి వెళ్లాలంటే రోమ్‌లోని సియాంపినో ఎయిర్‌పోర్టు లేదా ఫిమిసినో ఎయిర్‌పోర్టులో దిగి.. అక్కడి నుంచి వాటికన్ సిటీకి రోడ్డు మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. అయితే, వాటికన్ నగరానికి చెందిన ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు హెలికాప్టర్ ద్వారా రోమ్ నగరానికి చేరుకుంటూ ఉంటారు.
అండొర్రా
యూరప్‌లో ఉన్న అందమైన దేశాల్లో అండొర్రా ఒకటి. ఇక్కడి కొండలు, లోయలు, ప్రకృతి అందాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. విస్తీర్ణం, జనాభా పరంగా ఈ దేశం పెద్దదే అయినా ఇక్కడ విమానయాన సదుపాయం లేదు. ఈ దేశానికి వెళ్లాలంటే స్పెయిన్, ఫ్రాన్స్‌లోని ఎయిర్‌పోర్టుల్లో దిగాల్సి ఉంటుంది. కేవలం మూడు గంటల్లోనే రోడ్డు మార్గంలో అండొర్రాకు చేరుకోవచ్చు. ఈ దేశంలో మూడు హెలీప్యాడ్లు ఉన్నాయి. ఎక్కువగా వైద్య అవసరాల నిమిత్తం ఉపయోగించే హెలికాప్టర్ కోసం వీటిని ఉపయోగిస్తున్నారు.
శాన్ మారినో
ఇటలీ భూభాగంలో స్వతంత్ర దేశంగా ఉన్న శాన్ మారినోలో దాదాపు 40వేల జనాభా ఉంటుంది. ప్రపంచంలో అతిచిన్న దేశాల్లో ఇదీ ఒకటి. అయితే, శాన్ మారినోకి విమానంలో వెళ్లే అవకాశాలు లేవు. కానీ, ఇటలీలో ఉన్న రిమిని, బొలొగ్నా ఎయిర్‌పోర్టుల్లో దిగి అక్కడి నుంచి శాన్మారినోకి రోడ్డు మార్గం గుండా చేరుకోవచ్చు. అయితే, శాన్మారినోలోని బొర్గొ మగ్గియోర్ ప్రాంతంలో చిన్న హెలిప్యాడ్, టొర్రెసియాలో 680 మీటర్ల రన్‌వేతో చిన్న ఎయిర్‌ఫీల్డ్ ఉంది. అత్యవసర పరిస్థితుల్లో వీటిని వినియోగిస్తారట.
మొనాకో
మొనాకో కూడా అతి చిన్న దేశమే. మూడు వైపులా ఫ్రాన్స్‌తో సరిహద్దులు.. ఒకవైపు మెడిటెర్రనియన్ సముద్రం ఉంటుంది. 40వేలలోపు జనాభా ఉండే ఈ దేశంలో ఎయిర్‌పోర్టు అవసరం రాలేదో.. లేక నిర్మించాలనే ఉద్దేశం లేదో తెలియదు గానీ, ఇక్కడ ఇప్పటికీ విమాన సదుపాయం అందుబాటులోకి రాలేదు. ఫ్రాన్స్‌లోని నైస్ కొట్ డిఅజుర్ ఎయిర్‌పోర్టు మొనాకోకు సమీపంలో ఉంటుంది. ఇక్కడికి రావాలంటే ఆ ఎయిర్‌పోర్టులో దిగాలి. అక్కడి నుంచి అరగంట ప్రయాణిస్తే గమ్యం చేరుకుంటారు. మొనాకోలో ఎయిర్‌పోర్టు లేకున్నా.. ఫొంటివిల్లే జిల్లాలో ఒక హెలిపోర్టు ఉంది.
లిచెన్‌స్టైన్
యూరప్ దేశంలో ఉన్న మరో చిన్న దేశం లిచెన్‌స్టైన్. ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ దేశాలతో సరిహద్దులు పంచుకుంటుంది. ఈ దేశానికి పర్యటకులు ఎక్కువగా వస్తుంటారు. అయితే, విమానంలో నేరుగా అక్కడికి వచ్చే వీలు లేదు. ఈ దేశంలో ఎయిర్‌పోర్టు లేకపోవడంతో ఇరుగుపొరుగున ఉన్న దేశాల్లోని ఎయిర్‌పోర్టులను ఆశ్రయించాల్సి ఉంటుంది. లిచెన్స్టైన్కి వెళ్లాలంటే స్విట్జర్లాండ్‌లోని సెయింట్ గాలెన్-ఆల్టెన్రిన్ ఎయిర్‌పోర్టులో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గం లేదా పడవ ప్రయాణం ద్వారా చేరుకోవచ్చు. లేదా స్విట్జర్లాండ్, ఆస్ట్రియా నుంచి రైలులో లిచెన్‌స్టైన్‌కు వెళ్లొచ్చు. ఈ దేశంలోనూ బల్జెర్స్లో ప్రాంతంలో అత్యవసర ప్రయాణాల నిమిత్తం ఒక హెలిపోర్టు ఉంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.