‘జాతీయ పార్టీ’ హోదా సాధించాలంటే...!

దేశంలో మొన్నటి వరకు ఎనిమిది జాతీయ పార్టీలుండేవి. ఇటీవల ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) జాతీయ పార్టీగా అవతరించడంతో ఆ సంఖ్య తొమ్మిదికి చేరింది. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి(భారాస) కూడా జాతీయ పార్టీగా మారేందుకు కసరత్తు మొదలుపెట్టింది. మరి జాతీయ పార్టీగా మారాలంటే.. కావాల్సిందేంటి?

Updated : 03 Jan 2023 20:53 IST

ప్రతి రాజకీయ పార్టీ దేశస్థాయిలో సత్తా  చాటాలని ఆశ పడుతుంది. కొన్ని పార్టీలు ఆ దిశగా అడుగులూ వేస్తాయి. ఈ కల నెరవేరాలంటే నాయకత్వం, దేశ వ్యాప్తంగా ఆ పార్టీ సిద్ధాంతాలను మెచ్చే సంఘాలు కలిసి రావాలి. అంతటితో అయిపోలేదు.. పార్టీకి జాతీయ పార్టీగా గుర్తింపు రావాలంటే ఎన్నికలం సంఘం నిర్దేశించిన కొన్ని అర్హతలను అందుకోవాలి..
దేశంలో మొన్నటి వరకు ఎనిమిది జాతీయ పార్టీలుండేవి. ఇటీవల ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) జాతీయ పార్టీగా అవతరించడంతో ఆ సంఖ్య తొమ్మిదికి చేరింది. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి(భారాస) కూడా జాతీయ పార్టీగా మారేందుకు కసరత్తు మొదలుపెట్టింది. 

తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస)ని దేశవ్యాప్తం చేసేందుకు భారత రాష్ట్ర సమితి(భారాస)గా ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ మార్చారు. దీనికి ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో పోటీ చేసేందుకు భారాస నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే పొరుగురాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో భారాస రాష్ట్ర అధ్యక్షుడిగా ఐఏఎస్‌ మాజీ అధికారి తోట చంద్రశేఖర్‌ను కేసీఆర్‌ నియమించారు. సంక్రాంతికి ఏపీలో భారాస క్రియాశీలకంగా మారుతుందన్నారు. త్వరలో అన్ని రాష్ట్రాల్లోనూ పార్టీ కార్యకలాపాలు మొదలుపెట్టబోతున్నారు.
అయితే.. ఓ రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీగా మారడం అంత సులువేం కాదు. దానికి ఎన్నికల సంఘం కొన్ని నియమనిబంధనలు విధించింది. 

ఒక పార్టీ.. జాతీయ పార్టీ కావాలంటే ముందుగా రాష్ట్ర/ప్రాంతీయ పార్టీగా గుర్తింపు ఉండాలి. మరి ఆ హోదా పొందాలంటే..
* ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 6 శాతం ఓట్లు, రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచి తీరాలి. 
లేదా
* లోక్‌సభ ఎన్నికల్లో ఒక రాష్ట్రంలో 6 శాతం ఓట్లు, ఒక ఎంపీ సీటు సాధించాలి.
లేదా
* గత ఎన్నికల్లో రాష్ట్ర అసెంబ్లీ స్థానాల్లో కనీసం మూడు శాతం సీట్లు లేదా మూడు సీట్లు(ఏది ఎక్కువగా అయితే అది)గెలవాల్సి ఉంటుంది.
లేదా
* అసెంబ్లీ లేదా లోక్‌ సభ ఎన్నికల్లో పార్టీ కనీసం 8 శాతం ఓట్లు పొందాలి.
ఇలా ఎన్నికల సంఘం నిర్దేశించిన అర్హత సాధిస్తే ఆ పార్టీ రాష్ట్ర/ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందుతుంది. 

ఇక రాష్ట్రంలో క్రియశీలంగా ఉన్న పార్టీ.. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలంటే.. ఎన్నికల సంఘం పేర్కొన్న అర్హతలను అందుకోవాల్సి ఉంటుంది. అవేంటంటే..
* కనీసం నాలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీకి.. రాష్ట్ర పార్టీగా గుర్తింపు ఉండాలి. 
లేదా

* దేశంలోని కనీసం మూడు రాష్ట్రాల్లో ఆ పార్టీ 2 శాతం చొప్పున ఓట్లు పొందాలి. 
లేదా
* సార్వత్రిక ఎన్నికల్లో(అసెంబ్లీ లేదా లోక్‌సభ) నాలుగు అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో 6 శాతం ఓట్లు.. వేర్వేరు రాష్ట్రాల నుంచి కనీసం 4 ఎంపీ సీట్లు సాధించాలి.

అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వం వహిస్తోన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)ని 2012లో స్థాపించారు. మొదట దిల్లీలో మాత్రమే పోటీ చేస్తూ కొన్నాళ్లకు అధికారంలోకి వచ్చింది ఆప్‌. ఆ తర్వాత సమీప రాష్ట్రాల్లోనూ ఎన్నికల బరిలోకి దిగుతూ పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో పాల్గొంది. గుజరాత్‌లో ఐదు అసెంబ్లీ స్థానాలు.. 12 శాతం ఓట్లు సాధించి జాతీయ పార్టీకి కావాల్సిన అర్హతను అందుకుంది. దీంతో ఎన్నికల సంఘం ఆప్‌ను జాతీయ పార్టీగా గత డిసెంబర్‌లో ప్రకటించింది. 
రాష్ట్రీయ జనతాదళ్‌, సమాజ్‌వాదీపార్టీ, తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నికల సంఘం వద్ద జాతీయ పార్టీ గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నాయి. వాటికంటే ముందే.. పార్టీ పెట్టిన పదేళ్లకే ఆప్‌ జాతీయ పార్టీ గుర్తింపు పొందడం విశేషం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పోటీ చేసి జాతీయ పార్టీగా ఎదగాలని భారాస ఆశిస్తోంది

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని