Cuba : వైద్యుల దేశం.. పాల కోసం అలమటిస్తోంది!

వైద్య రంగంలో క్యూబా సాధించిన అభివృద్ధికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అలాంటి దేశాన్ని ప్రస్తుతం పాల కొరత పట్టి పీడిస్తోంది. అమెరికా ఆంక్షలు, దేశీయ పరిస్థితులు క్షీర సంక్షోభానికి ఎలా కారణమయ్యాయో చదివేయండి. 

Updated : 29 Jan 2023 12:17 IST

ఏడేళ్లలోపు వయస్సు కలిగిన చిన్నారులందరికీ సబ్సిడీలో రోజుకు లీటర్ చొప్పున పాలను అందిస్తాం- క్యూబా(Cuba)లో కమ్యూనిజం పాలన మొదలైనప్పుడు అప్పటి అధ్యక్షుడు ఫిడెల్‌ క్యాస్ట్రో(Fidel Castro) ఇచ్చిన హామీ ఇది!

ద్వీప దేశమైన క్యూబాలో ప్రస్తుతం అందరి ఆకలి తీరే స్థాయిలో పాలు(milk) లభించడం లేదు. అక్కడ నిత్యం ‘పాలు లేవు.. అయిపోయాయి’ అనే మాటలు వినిపిస్తూ ఉంటాయి. గత ముప్ఫై ఏళ్లుగా క్యూబాలో పాల ఉత్పత్తి తగ్గుతూ వస్తోంది. అక్కడ ఏడాది మొత్తం కలిపి ఒక వ్యక్తికి 39.5లీటర్ల పాలు మాత్రమే లభిస్తున్నాయి. అంటే రోజుకు సగం గ్లాసు పాలు కూడా అందవు. క్యూబా ప్రధానంగా పాల సరఫరా కోసం న్యూజిలాండ్‌పై ఆధార పడుతోంది. బెల్జియం, ఉరుగ్వే దేశాలు కూడా క్యూబాకు పాలు ఎగుమతి చేస్తున్నాయి. 

చిన్నారులు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం సబ్సిడీ రూపంలో పాలు సరఫరా చేయడానికి ప్రయత్నం చేస్తున్నా.. ఆశించిన మేర ఫలితం కనబడటం లేదు. మిగతావారు అందుబాటులో ఉన్న కొన్ని స్టోర్లలో అత్యధిక ధర చెల్లించి పాలను కొనుగోలు చేస్తుంటారు. 2022 ప్రారంభంలో ఒక కేజీ పాలపొడి ధర అచ్చంగా ఆరు నుంచి ఎనిమిది డాలర్లు పలికింది. అంటే మన కరెన్సీలో రూ.450 నుంచి రూ.600 అన్నమాట. 

బలహీనమైన ఆవులు.. వధిస్తే కఠిన శిక్షలు

క్యూబా ప్రజలకు ఆవు(cow) పాలే ప్రధాన ఆధారం. అక్కడి ఆవులు చాలా బలహీనంగా ఉంటాయి. వాటిని మేపడానికి, పోషించడానికి సరిపడా వనరులు లేకున్నా.. కొంత మంది రైతులు పాల ఉత్పత్తి ఇన్ని రోజులు చేస్తామని దళారీలతో అగ్రిమెంట్లు కుదుర్చుకుంటారు. ఆ గడువు తీరగానే ఆవులను వధ చేయడానికి అమ్మేస్తుంటారు. అయితే అక్రమ వధను అక్కడి ప్రభుత్వం ఎంత మాత్రం ఉపేక్షించదు. ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడినట్లు తెలిస్తే మూడు నుంచి ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధిస్తుంది. ఆవులను అమ్మిన వ్యక్తులకు, రవాణా చేసిన వారికి రెండు నుంచి ఐదేళ్ల జైలు శిక్ష విధించేలా చట్టాలున్నాయి. ఇక ఆహార సంక్షోభం కూడా పశు వధలకు కారణమవుతోంది. చిన్నాచితకా రైతులు తమ పాడి ఆవులను ఎక్కడ దొంగలు ఆహారం కోసం ఎత్తుకెళ్తారోనని రాత్రుళ్లు నిరంతరం కాపలా కాస్తుంటారు. 

ప్రభుత్వ ప్రోత్సాహం కరవు

క్యూబా ప్రభుత్వం తమకు ఇస్తున్న నగదు ఎంత మాత్రం సరిపోవడం లేదని పాల ఉత్పత్తిదారులు ఆరోపిస్తున్నారు. ఆ నగదు కూడా సకాలంలో అందడం కష్టమేనని చెబుతున్నారు. ప్రభుత్వం ఒక్కో లీటరుకు 0.71 డాలర్లు మాత్రమే ఇస్తుంది. అదే బ్లాక్‌ మార్కెట్లో అయితే 1.46 డాలర్ల వరకు వస్తాయి. ఇక పాలను చీజ్‌, పెరుగుగా మార్చి బ్లాక్‌ మార్కెట్లో అమ్మితే 7.26 డాలర్ల వరకు ఆదాయం లభిస్తుంది. అత్యధిక మంది పాడి రైతులు ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య రవాణా. ఇప్పటికీ అక్కడి రైతులు మోటారు వాహనాలపై కాకుండా గాడిద బండ్లతో పాలను రవాణా చేస్తుంటారు.

అమెరికాతో వైరం.. ఆంక్షల పర్వం

అమెరికా(america), క్యూబాకు కొన్ని దశాబ్దాలుగా వైరం కొనసాగుతోంది. ఈ దేశానికి ఎగుమతులను అమెరికా ఎంత మాత్రం ప్రోత్సహించదు. ముందస్తు చెల్లింపులు చేసిన తరువాతే ఏ సరుకైనా పంపించాలని 2000 సంవత్సరంలో అమెరికా తమ కంపెనీలను ఆజ్ఞాపించింది. దీంతో అమెరికా మిత్ర దేశాలు కూడా క్యూబాకు సహాయం చేయడానికి వెనకాడుతుంటాయి. కొవిడ్‌ మహమ్మారి ప్రబలిన సమయంలో అగ్రరాజ్యం ఆంక్షలతో క్యూబాను మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. ఫలితంగా క్యూబాకు చేరాల్సిన ఆహార పదార్థాలు, మిల్క్‌ కంటెయినర్లు, ప్యాకేజింగ్‌ వస్తువులు సముద్రంలోనే ఓడల్లో నిలిచిపోయాయి. 
ద్వీపాల సమూహమైన క్యూబాకు రవాణా కూడా ఒక సవాలుగా మారుతోంది. దానిని ఎదుర్కొనేందుకు నిధులు కేటాయించడం, పడవలు, ఓడలు అందుబాటులో ఉంచడం దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని క్యూబా ప్రజలు ఆశిస్తున్నారు. వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన క్యూబాలో తక్షణమే క్షీరవిప్లవం రావాలని ఎదురు చూస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు