Published : 24 Jun 2022 13:33 IST

Darasuram: ఇక్కడి మెట్లు సరిగమలు పాడుతాయి!

విశిష్టతల సమాహారం.. దారాసురం ఐరావతేశ్వర ఆలయం

ఇంటర్నెట్‌ డెస్క్‌: పరమేశ్వరుడు వెలసిన మహాక్షేత్రమే తమిళనాడులోని దారాసురం(Darasuram). ఇక్కడ లయకారకుడు ఐరావతేశ్వర స్వామిగా భక్తులను ఆశీర్వదిస్తున్నారు. దేవతల ఏనుగు ఐరావతం.. స్వామివారిని ఇక్కడే కొలిచింది. దాని భక్తికి మెచ్చిన ఈశ్వరుడు ఐరావతేశ్వర(Airavatesvara) స్వామిగా పూజలందుకుంటున్నారు. భోళా శంకరుడు భక్తుల కోసం ఎంతకయినా దిగివస్తాడు. శ్రీకాళహస్తిలోనూ సాలీడు, ఏనుగు, సర్పాలను తనలో ఐక్యం చేసుకున్న పరమ దయాళువు ఆయన.

దారాసురానికి మరో విశిష్టత కూడా ఉంది. నరకలోకాధిపతి యముడు ఒక సారి రుషి శాపానికి గురికావడంతో శరీరం మొత్తం మండుతున్న బాధ కలిగింది. ఇక్కడికి వచ్చిన యముడు స్వామివారి పుష్కరిణిలో మునగడంతో ఆ బాధ నుంచి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి ఈ కోనేటిని యమతీర్థమని పిలుస్తున్నారు. దేశ చక్రవర్తుల్లో అగ్రగణ్యుడైన రాజరాజచోళుడు(Rajaraja Chola) ఇక్కడ శివలింగాన్ని పూజించేవాడు. అమ్మవారు దేవనాయకిగా కొలువుదీరారు.

 

అబ్బురపరిచే శిల్పకళా సంపద

ఈ ఆలయాన్ని రాజరాజచోళుడు నిర్మించాడు. యునెస్కో గుర్తించిన వారసత్వ కట్టడాల జాబితాలోని ‘గ్రేట్‌ లివింగ్‌ చోళ టెంపుల్స్‌(great living chola temples)’లో ఇదీ ఒకటి. తంజావూరు బృహదీశ్వరాలయం, గంగైకొండ చోళపురాలతోపాటు ఈ ఆలయానికీ ప్రాధాన్యం ఉంది. దీన్ని ద్రవిడ నిర్మాణ శైలిలో నిర్మించారు. ముఖమండపాన్ని రథం రీతిలో అశ్వాలు లాగుతున్నట్టుగా  తీర్చిదిద్దారు. పైకప్పులో కూడా శిల్పకళను చెక్కారు.  ఇక్కడ అనేక శిల్పాలు త్రీడీ రూపంలోనూ ఉండటం విశేషం. వెయ్యేళ్ల క్రితమే ఇప్పుడు వాడుతున్న ఆధునిక టెక్నాలజీ శిల్పాల్లో గోచరిస్తుంది. ప్రతిరాయిని కచ్చితత్వంగా చెక్కడంతో.. ఇక్కడి శిల్పాలను చూస్తే సజీవమూర్తులుగా కనిపిస్తాయి!

మెట్లను తాకితే సరిగమలే..

ఆలయ ప్రధాన ద్వారం సమీపంలో చిన్నమండపం ఉంటుంది. అక్కడి మెట్లను తాకితే  సప్తస్వరాలు వినిపిస్తాయి. లోపలికి వెళ్తే రావణాసురుడు కైలాసాన్ని ఎత్తేందుకు యత్నించిన వైనాన్ని చక్కగా చిత్రీకరించారు.

ఉప ఆలయాలు

ఈ ప్రాంగణంలో సప్తమాతృకల ఆలయం, దేవి ఆలయం తదితర ఆలయాలున్నాయి. భూలోక వైకుంఠంగా పేరొందిన శ్రీరంగం స్థాయిలో ఈ దేవాలయం ఉండేదని శాసనాల ద్వారా తెలుస్తోంది. అయితే  ప్రస్తుతం మాత్రం ఐరావతేశ్వర ఆలయ ప్రాంగణం మాత్రమే ఉంది. తంజావూరు, కుంభకోణం నుంచి దారాసురానికి చేరుకోవచ్చు.

Read latest Explained News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts