Earthquake: ఒక్క కుదుపు.. వేలాది ప్రాణాలు భూస్థాపితం.. అతిపెద్ద భూకంపాలు ఇవే!

భూకంపాల ధాటికి అనేక దేశాల్లో ఇప్పటివరకు లక్షణాలది మంది తమ ప్రాణాలు కోల్పోయారు. అయితే భారీ భూకంపాలు, వాటి తీవ్రత, అవి తీసుకెళ్లిన ప్రాణాలు, జరిపిన నష్టం గురించి తెలుసుకుందాం.......

Published : 22 Jun 2022 18:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మృత్యువులా దూసుకొచ్చిన భూకంపం (Earthquake) అఫ్గానిస్థాన్‌ను (afghanistan) అతలాకుతలం చేసింది. క్షణాల వ్యవధిలో వందల మంది ప్రాణాలను పొట్టనపెట్టుకుంది. ఆ ఘటనలో ఇప్పటివరకు 1000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సంభవించిన భారీ భూకంపాలు, వాటి తీవ్రత, అవి తీసుకెళ్లిన ప్రాణాలు, కలిగించిన నష్టం గురించి తెలుసుకుందాం!


రిక్టరు స్కేలుపై 9.5 తీవ్రత

1960 మే 22న చిలీలో (Chile) సంభవించిన భూకంపం రిక్టరు స్కేలుపై అత్యంత తీవ్రమైన భూకంపంగా రికార్డుల కెక్కింది. దీని తీవ్రత 9.5గా నమోదైంది. ఈ ఘటనలో 1,655 మంది ప్రాణాలు కోల్పోగా.. మూడు వేల మందికిపైగా గాయపడ్డారు. ఈ విపత్తు ధాటికి లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ ప్రకంపనలు హవాయి, జపాన్‌, ఫిలిప్పీన్స్‌ దేశాలపైనా ప్రభావం చూపాయి. ఈ ఘటన జరిగిన రెండు రోజులకే, చిలీ సమీపంలోని అగ్నిపర్వతం పుయెహ్యూ విస్ఫోటనం చెందింది. దీని ధాటికి వాతావరణంలో 6 కి.మీ. మేర బూడిద వ్యాపించింది. అనేక రోజులపాటు ప్రజలు దీని పర్యావసానాలను ఎదుర్కొన్నారు.



ద్వీప దేశంలో 3.16 లక్షల మంది మృతి

ద్వీప దేశం హయతిలో (Haiti) 2010 జనవరి 12న నమోదైన భూకంపం ఏకంగా 3.16 లక్షల మందికిపైగా ప్రాణాలను బలిగొంది. ఈ భూకంపం సమయంలో భూమి ఏకంగా 52 సార్లు కుదుపులకు గురైనట్లు జియోలాజికల్‌ రికార్డులు వెల్లడిస్తున్నాయి. 2.5 లక్షల నివాసాలు, 30 వేల వాణిజ్య భవనాలు పూర్తిగా నేలమట్టం అయ్యాయంటే ఆ భూకంపం ఎంతటి విధ్వంసం సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు. దీని ధాటికి 30 లక్షల మంది వీధిన పడ్డారు.


చైనాలోనే అతిపెద్దది..

1976 జులై 28న చైనాలో (China) సంభవించిన ‘తంక్షన్‌’ భూకంపం భారీ విధ్వంసమే సృష్టించింది. తంక్షన్‌ నగరంలో 7.6 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం 2,42,769 మందిని బలిగొంది. 1,64,851 మందికి గాయాలయ్యాయి. ఒక్క నిమిషంపాటు సంభవించిన భూ ప్రకంపనల ధాటిని ఆ నగరంలోని 85 శాతం భవనాలు కూలిపోయాయి. చైనాలో ఇదే అత్యంత తీవ్రమైన భూకంపంగా నిలిచిపోయింది.



నిత్యం వణికే ఇండోనేసియా

దీవులు అధికంగా ఉండే ఇండోనేసియాలో (Indonesia) భూకంపాలు సర్వసాధారణం. అయితే 2004 డిసెంబర్‌ 26లో రిక్టరు స్కేలుపై 9.1 తీవ్రతతో ఓ భూకంపం ఆ ద్వీపకల్పాన్ని అతలాకుతలం చేసింది. సముద్రంలో సంభవించిన ఈ భూకంపం దక్షిణాసియా, తూర్పు ఆఫ్రికాలోని 14 దేశాలకు విస్తరించింది. మొత్తంగా 2,27,900 మంది మృతిచెందినట్లు అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. 1.7 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు. 2005 మార్చి 28న ఇండోనేసియాలోనే సంభవించిన మరో భూకంపం 1313 మందిని బలితీసుకుంది. సుమత్ర ప్రాంతంలో 8.6 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపానికి సునామీ వచ్చి అనేక ఇల్లు నేలమట్టమయ్యాయి. 400 మంది గాయాలపాలయ్యారు.


 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని