Solo traveling : ఒంటరిగా విహార యాత్ర ప్లాన్‌ చేస్తున్నారా.. ఈ దేశాలు చాలా సేఫ్‌!

జీవితంలో ఒక్కసారైనా ఒంటరిగా విదేశాల్లో విహారయాత్ర (Solo traveling) చేయాలని కొందరు పరితపిస్తుంటారు. అయితే, వెళ్లిన ప్రదేశంలో భద్రత (safety) ఎలా ఉంటుందోననే భయంతో వెనుకాడుతుంటారు. ప్రపంచంలోని (World) ఈ కొన్ని దేశాలు చూడదగ్గ ప్రదేశాలతో.. ఒంటరి ప్రయాణానికి అనుకూలంగా ఉంటాయి. అవేంటో పరిశీలించండి.

Published : 19 May 2023 14:57 IST

సోలో ట్రావెలింగ్‌.. (Solo traveling) అంటే ఒంటరి ప్రయాణం. ఈ ప్రయాణంలో స్నేహితులు, కుటుంబ సభ్యులు, ట్రావెల్ గ్రూప్‌ ఇలా ఎవరూ తోడుండరు. ఎక్కడికి వెళ్లాలన్నా సొంతంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు తగినట్లే ఆయా ప్రాంతాల్లో చూడదగ్గ ప్రదేశాలతోపాటు స్వేచ్ఛ (Freedom), భద్రత (safety) తప్పనిసరిగా ఉండి తీరాలి. ఈ దేశాలు ఒంటరి ప్రయాణాలకు చాలా అనువుగా ఉంటాయి. వాటిపై ఓ లుక్కేయండి.

క్యోటో-జపాన్‌

జపాన్‌లోని క్యోటో నగరం ఒంటరి ప్రయాణానికి చాలా అనుకూలమైనది. అక్కడి ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదిస్తూ వివిధ ప్రాంతాలను చుట్టేయొచ్చు. ఈ నగరంలో అనేక దర్శనీయ ఆలయాలు, పుణ్యక్షేత్రాలున్నాయి. జపాన్‌ సంస్కృతిలో టీ ఒక భాగం. అందుకే స్థానిక కెఫేకు వెళ్లి ఓ టీ తాగడం మర్చిపోవద్దు. జపాన్‌ పౌరులు ఎవరైనా మీతో స్నేహం చేస్తే తప్పకుండా వారి ఇంటికి టీ తాగడానికి ఆహ్వానించే అవకాశం ఉంది. ఇక్కడ పగలు, రాత్రి అనే ఉండదు. నేర గణాంక సూచీ ప్రకారం చూస్తే ఈ నగరంలో క్రైమ్‌ రేటు చాలా తక్కువ. స్థానిక నిషీ మార్కెట్, షోసీన్ గార్డెన్ ఆహ్లాదకర అనుభూతినిస్తాయి. క్యోటో నగరం ప్రపంచంలోకెల్లా భిన్నమైన సంస్కృతిని ప్రతిబింబిస్తుంటుంది. ఒంటరి ప్రయాణికులకు ఈ నగరం ఓ మరపురాని అనుభూతినిస్తుంది.

ఆక్లాండ్‌-న్యూజిలాండ్‌

న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌ నగరం చుట్టూ ప్రకృతి రమణీయ దృశ్యాలు సాక్షాత్కరిస్తాయి. ఈ నగరం ఎల్లప్పుడూ సందడిగా ఉంటుంది. స్థానికులు బయటివారిని స్నేహపూర్వకంగా పలకరిస్తారు. ఆక్లాండ్ కూడా చాలా సురక్షిత నగరం. పగటి పూట స్థానికులను సహాయం అడిగితే తక్షణమే స్పందిస్తారు. ఇక్కడ రుచులకు ఎలాంటి లోటు ఉండదు. అంతర్జాతీయ స్థాయిలో అన్ని రకాల వంటకాలు లభిస్తాయి. సుషి, పిజ్జా దొరుకుతాయి. హియాకై రెస్టారెంట్‌లో సంప్రదాయ మౌరీ డిషెస్‌ ఉంటాయి. ఆక్లాండ్‌ చుట్టూ ఉన్న పిహా బ్లాక్‌ సాండ్‌ బీచ్‌లు, ఎత్తయిన అగ్నిపర్వతాలు, దట్టమైన అడవులను సందర్శించొచ్చు.

రెక్యావిక్‌-ఐస్‌లాండ్‌

ఐస్‌లాండ్‌ రాజధాని రెక్యావిక్‌ చూడటానికి చాలా చిన్నగా.. అందంగా ఉంటుంది. అందువల్ల బైక్‌పై లేదా నడుస్తూనే వివిధ ప్రాంతాలను అన్వేషించవచ్చు. ఈ నగరంలోని హాల్‌గ్రిమ్‌స్కర్క్యా చర్చి నిర్మాణ కౌశలాన్ని చూసి తీరాల్సిందే. ఇక్కడ నేరాలు చాలా తక్కువగా నమోదవుతుంటాయి. ప్రకృతి రమణీయ దృశ్యాలు ఐస్‌లాండ్‌లోని ప్రతి మూలనా కన్పిస్తాయి. ఎత్తయిన జలపాతాలు మొదలుకొని రగులుతున్న అగ్నిపర్వతాల వరకు అన్నీ ఇక్కడ చూడొచ్చు. హైకింగ్‌ ద్వారా స్కెల్జానెస్‌ వ్యూపాయింట్‌కు చేరుకోవచ్చు. ప్రశాంతంగా స్కై లగూన్‌ వేడినీటి మడుగులో స్నానం చేయవచ్చు. సమీప ప్రాంతాల్లో తిమింగలాలను చూసే వెసులుబాటు ఉంటుంది. ప్రపంచ నలుమూలల నుంచి ట్రావెలింగ్‌ కోసం ఇక్కడకు అనేక మంది వస్తుంటారు. దాంతో కేఫ్‌లు, కచేరీలు, కళా ప్రదర్శనలకు కొదవుండదు. మిగతా ప్రపంచంతో సంబంధం లేకుండా నార్తన్‌ లైట్స్‌, మంచు కొండలు వంటి ప్రకృతి రమణీయ దృశ్యాలను చూస్తూ మరో ఊహాలోకంలో విహరించవచ్చు.

సిడ్నీ-ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఒంటరి ప్రయాణం చేస్తే మిశ్రమ అనుభూతులు సొంతం చేసుకోవచ్చు. ఒపెరా హౌస్‌ మొదలుకొని అందమైన బీచ్‌ల వరకు ఎన్నో చూడొచ్చు. సిడ్నీకి వెలుపల బ్లూ మౌంటెన్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఆస్ట్రేలియన్లు చాలా స్నేహపూర్వకంగా మెలుగుతారు. ఆసక్తి ఉంటే టూర్లకు వచ్చే విదేశీయులతో స్నేహం చేయొచ్చు. ఇక్కడి ఎడిన్‌ బర్గ్ క్యాజిల్‌లో సముద్ర జీవులతో చేసిన వంటకాలు నోరూరిస్తాయి.

చియాంగ్‌ మై-థాయిలాండ్‌

థాయ్‌ సంస్కృతిని ఇష్టపడేవారికి చియాంగ్‌ మై చాలా బాగా నచ్చుతుంది. థాయ్‌, లన్నా, బర్మేస్‌ సమ్మేళనం కారణంగా ఈ నగరానికి ప్రత్యేక చరిత్ర ఉంది. ఈ ప్రాంతంలో అనేక దేవాలయాలను సందర్శించవచ్చు. ఇక్కడ రాత్రిపూట మార్కెట్లు కళకళలాడుతుంటాయి. వాటిలో స్థానిక వంటకాలు ఎలా తయారు చేయాలో నేర్పించడానికి కుకింగ్‌ క్లాస్‌లను కూడా నిర్వహిస్తుంటారు. కొంత నగదు చెల్లించి నేర్చుకోవచ్చు. ఇక థాయ్‌ రుచులకు ప్రత్యేక స్థానం ఉంది. కారంగా ఉండే కూరలు మొదలుకొని రుచికరమైన నూడుల్స్‌ వరకు అన్నీ దొరుకుతాయి. సాహసాలు ఇష్టపడేవారు అడవుల్లో ట్రెక్కింగ్ చేయవచ్చు. జిప్‌లైనింగ్‌, ట్రీటాప్స్‌ వంటి క్రీడలు ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ఏనుగుల అభయారణ్యాన్ని సందర్శించవచ్చు. అలసిన శరీరానికి థాయ్‌ మసాజ్‌తో ఉపశమనం దొరుకుతుంది. వైల్డ్‌ రోజ్‌ యోగా స్టూడియోలో తరగతులు బోధిస్తారు.

ప్యూర్టో వీజో-కోస్టారికా

ప్యూర్టో వీజో ప్రకృతి ప్రేమికులకు ఒక స్వర్గంలాంటిది. కరేబియన్‌ తీరంలోని ఈ పట్టణం చుట్టూ దట్టమైన వర్షారణ్యాలున్నాయి. వాటిలో వన్యప్రాణులు సంచరిస్తుంటాయి. సహజ సిద్ధమైన బీచ్‌ల అందాలు మైమరపింపజేస్తాయి. ఆసక్తి ఉన్నవారు హైకింగ్‌, సర్ఫింగ్‌ చేయొచ్చు. పుంట ఉవా అరెసిఫీ అనే ప్రాంతంలో సముద్ర గర్భ అందాలను తిలకించేందుకు స్నార్కెలింగ్‌కు వెళ్లొచ్చు. ఆఫ్రో-కరీబియన్‌ సంస్కృతి ఇక్కడ కన్పిస్తుంది. పట్టణ వీధుల్లోని గోడలపై రంగురంగుల భారీ చిత్రాలు ఆకట్టుకుంటాయి. బియ్యం, బీన్స్‌, సముద్ర జీవులు, అరటికాయలతో తయారు చేసిన వంటకాలు ఇక్కడ ప్రత్యేకంగా లభిస్తాయి.

స్టాక్‌హోం-స్వీడన్‌

స్టాక్‌హోం నగరం అద్భుతమైన శిల్పసౌందర్యానికి ప్రతీక. పార్క్‌లు, వాటర్‌ఫాంట్స్‌ మైమరపింపజేస్తాయి. వాసా మ్యూజియంలో పురాతన ఓడలను భద్రపరిచారు. ఫొటోగ్రాఫిస్కాలో రకరకాల గ్యాలరీలను వీక్షించొచ్చు. బోట్ టూర్‌లో చుట్టుపక్కల ద్వీప సమూహాలకు వెళ్లొచ్చు. ఇక స్టాక్‌హోం నగరం గుండా ప్రయాణిస్తే మనోహరమైన కట్టడాలు తారసపడతాయి. కెఫేలు, రెస్టారెంట్లలోకి వెళ్లి స్థానికులతో పరిచయం పెంచుకోవచ్చు. ఈ నగరంలో ఎక్కడికైనా నడుస్తూనే వెళ్లిపోవచ్చు. అలా వెళ్లడం ఇష్టం లేకపోతే ప్రజా రవాణా సౌకర్యాలున్నాయి. ఆహారం విషయానికి వస్తే మీట్‌బాల్స్‌, ఫ్రైడ్‌ హెర్రింగ్‌ అద్భుతమైన అనుభూతినిస్తాయి.

బుడాపెస్ట్-హంగరీ

బుడాపెస్ట్‌లోని పార్లమెంట్‌ భవనం ఓ రాయల్ లుక్‌లో దర్శనమిస్తుంది. ఈ నగరంలో థర్మల్ బాత్‌ ప్రదేశాలు ఆకట్టుకుంటాయి. సెయింట్‌ స్టీఫెన్‌ బసిలికాలో నిత్యం కచేరీలు జరుగుతుంటాయి. ఈ నగరంలోని హీరోస్‌ స్క్వేర్‌ను ఎక్కువ మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. గౌలాష్‌, చిమ్నీ కేక్‌ ఇక్కడ ప్రత్యేక వంటకాలు. బుడాపెస్ట్‌లో ధరలు అందుబాటులో ఉంటాయి. బడ్జెట్‌ ఫ్రెండ్లీ యాత్రకు అనువుగా ఉంటుంది.

డబ్లిన్‌-ఐర్లాండ్‌

ఎక్కడికైనా ఒంటరిగా ప్రయాణించేందుకు డబ్లిన్‌ నగరం అనుకూలంగా ఉంటుంది. ఇక్కడి టెంపుల్‌ బార్‌ ప్రాంతంలో రోడ్లన్నీ సందడిగా కనిపిస్తాయి. చారిత్రక ట్రినిటీ కళాశాల భవనం ఆకట్టుకుంటుంది. గిన్నిస్‌ స్టోర్ హౌస్‌, జేమ్సన్‌ డిస్టిలరీ సహా అనేక మ్యూజియాలను సందర్శించవచ్చు. ఐర్లాండ్‌ సంగీత కచేరీలకు ఫేమస్‌. కావున ఈ నగరంలోనూ అక్కడక్కడా సంగీత కచేరీలు నిత్యం జరుగుతుంటాయి. ఐరిష్‌ స్ట్యూ, తాజా సీ ఫుడ్‌, చీజ్‌ వంటకాలు నోరూరిస్తాయి. అన్ని పండగలు ఆడంబరంగా చేస్తారు. సెయింట్‌ ప్యాట్రిక్‌ డే పరేడ్‌, డబ్లిన్‌ థియేటర్‌ ఫెస్టివల్‌, బ్లూమ్స్ డే ఫెస్టివల్‌ ఇలా ఏవో ఒకటి జరుగుతూనే ఉంటాయి.

బాలి-ఇండోనేసియా

ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి బాలి అనువైన ప్రాంతం. ఈ ద్వీపంలో కాంగూ, జంబారన్‌ సహా అనేక బీచ్‌లు తీరం వెంట కనిపిస్తాయి. కేవలం ఇండోనేసియా వంటకాలే కాకుండా ఇండియా, చైనా ఆహార పదార్థాలు కూడా ఇక్కడ దొరుకుతాయి. స్థానిక మార్కెట్లు నిత్యం రద్దీగా కన్పిస్తాయి. పొలాలు వైవిధ్యంగా మెట్లను పోలి ఉంటాయి. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని