ప్రిన్సెస్‌ విక్టోరియా గౌరమ్మ గురించి తెలుసా?

బ్రిటన్‌ ప్రిన్స్‌ హ్యారీ.. మేఘన్‌ మార్కెల్‌ దంపతులు రాజకుటుంబం నుంచి బయటకు రావడం.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తమ కుటుంబంలో జరిగిన సంగతులు ప్రపంచానికి వివరించడంతో మరోసారి బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. అసలు బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో ఏం జరుగుతుందని

Updated : 17 Mar 2021 04:59 IST


(చిత్రకారుడు: ఫ్రాంజ్‌ క్సేవర్‌ వింటర్‌హాల్టర్‌, ఫొటో: రాయల్‌ కలెక్షన్‌/వికీపీడియా)

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్రిటన్‌ యువరాజు హ్యారీ.. మేఘన్‌ మార్కెల్‌ దంపతులు రాజకుటుంబం నుంచి బయటకు రావడం.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తమ కుటుంబంలో జరిగిన సంగతులు ప్రపంచానికి వివరించడంతో మరోసారి బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. అసలు బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో ఏం జరుగుతుందని చర్చలు జరుగుతున్నాయి. ఇదంతా పక్కన పెడితే.. చరిత్రలో ఎన్నో ఘటనలకు.. విషయాలకు బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. భారతదేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో బ్రిటన్‌ క్వీన్‌ విక్టోరియా.. ఓ భారతీయ యువతిని బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ వేదికగానే దత్తత తీసుకొని పెంచిందని మీకు తెలుసా?ఇంతకీ ఆమె ఎవరు? ఏం జరిగింది?

1830కాలంలో కర్ణాటకలోని కూర్గ్‌ ప్రాంతాన్ని చిక్క వీరరాజేంద్ర అనే రాజు పాలించేవాడు. అయితే, 1834లో బ్రిటన్‌ సైన్యం కూర్గ్‌పై దండెత్తి వీరరాజేంద్రను రాజకీయ ఖైదీగా బంధించి వారణాసికి తీసుకెళ్లింది. కొన్నేళ్లపాటు ఆయన అక్కడే జైలు జీవితం గడిపాడు. ఆ తర్వాత జైలు నుంచి విడుదలైన వీరరాజేంద్ర.. 1852లో అప్పటి బ్రిటన్‌ క్వీన్‌ విక్టోరియాను కలిసి ఈస్ట్‌ ఇండియా కంపెనీ స్వాధీనం చేసుకున్న తన ఆస్తులను తిరిగి ఇచ్చేలా చేయమని కోరేందుకు ఇంగ్లాండ్‌ వెళ్లాడు. తనతోపాటు తన పదకొండేళ్ల కుమార్తె గౌరమ్మను సైతం తీసుకెళ్లాడు. బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో వీరరాజేంద్రకు ఘన స్వాగతం లభించింది. క్వీన్‌ విక్టోరియా స్వయంగా వారికి అతిథి మర్యాదలు జరిపించారు. అయితే, వీరరాజేంద్ర కుమార్తె గౌరమ్మను చూసిన క్వీన్‌ విక్టోరియా ముచ్చటపడింది. ఆమె సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లోనే గౌరమ్మ బాప్టిజ్‌డ్‌ కావడం ద్వారా క్వీన్‌ విక్టోరియా ఆమెకు సంరక్షకురాలిగా మారిపోయింది. అంతేకాదు, గౌరమ్మ పేరును విక్టోరియా గౌరమ్మగా మార్చారు.

వివాహం చేద్దామనుకుంటే..

1858లో క్వీన్‌ విక్టోరియా.. విక్టోరియా గౌరమ్మకు వివాహం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం లేడీ లాగిన్‌ అనే మధ్యవర్తికి బాధ్యతలు అప్పగించారు. లేడీ లాగిన్‌ అప్పటికే రాజ్యం కోల్పోయి యూకేకి వలస వచ్చిన సిక్కు యువరాజు దులిప్‌సింగ్‌కు సంరక్షకురాలిగా ఉన్నారు. అలా, తన వద్ద పెరుగుతున్న దులీప్‌ సింగ్‌కు విక్టోరియా గౌరమ్మను ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నారు. కానీ, ఆయన యూకేకు చెందిన అమ్మాయినే జీవితభాగస్వామిగా చేసుకోవాలని ఆశపడ్డాడు. దీంతో యూరప్‌లోనే మరో సంబంధం కోసం ప్రయత్నాలు చేశారు. ఇంతలోనే గౌరమ్మ తనకంటే వయసులో 30ఏళ్లు పెద్దవాడైన లెఫ్టినెంట్‌ కల్నల్‌ జాన్‌ కాంప్‌బెల్‌ను పెళ్లాడింది. ఒక కుమార్తెకు జన్మనిచ్చాక.. 1864లో టీబీతో బాధపడుతూ కన్నుమూసింది. ఆమె మరణాన్ని క్వీన్‌ విక్టోరియా తట్టుకోలేకపోయారు. విక్టోరియా గౌరమ్మ మరణం తనని ఎంతో బాధించిందని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

గౌరమ్మపై పుస్తకం

విక్టోరియా గౌరమ్మ జీవితంపై ‘విక్టోరియా గౌరమ్మ: ది లాస్ట్‌ ప్రిన్సెస్‌ ఆఫ్‌ కూర్గ్‌’ పేరుతో వచ్చిన పుసక్తం మార్కెట్లో అందుబాటులో ఉంది. దీన్ని రచయిత సి.పి. బెల్లియప్ప రచించాడు. తండ్రితో ఇంగ్లాండ్‌ ప్రయాణం నుంచి.. మరణం వరకు ఆమె జీవితం ఎలా సాగిందో ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని