Income tax: ఐటీ సోదాలు @బీబీసీ.. సర్వేకు, సోదాకు తేడా ఏంటీ?

Difference between survey and search operation: ఐటీ సోదాల గురించి మనం తరచూ వింటూ ఉంటాం. బీబీసీ విషయంలో అధికారులు చేపట్టిన దాన్ని ఐటీ అధికారులు సర్వేగా పేర్కొంటున్నారు. మరి ఈ రెండింటికీ తేడా ఏంటి?

Updated : 14 Feb 2023 22:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ వార్తా సంస్థ బీబీసీకి (BBC) చెందిన దిల్లీ, ముంబయి కార్యాలయాల్లో ఐటీ అధికారులు (Income tax department) మంగళవారం ప్రత్యక్షమవ్వడం తీవ్ర కలకలం రేపింది. ప్రధాని మోదీపై బీబీసీ ఓ డాక్యుమెంటరీ రూపొందించిన అనంతరం ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై రాజకీయంగానూ వివాదం చెలరేగింది. ఈ విషయం పక్కనపెడితే సాధారణంగా ఐటీ దాడులు/ సోదాలు గురించి తరచూ మనం వార్తలు వింటూ ఉంటాం. కానీ బీబీసీలో జరుగుతున్నవి సోదాలు కావని, సర్వే అని ఐటీ అధికారులు పేర్కొంటున్నారు. ఇంతకీ సర్వేకు, సోదాలకు తేడా ఏంటి?

సాధారణంగా వెల్లడించని ఆదాయం లేదా ఆస్తికి సంబంధించి ఏదైనా సమాచారం సేకరించేందుకు సర్వే నిర్వహిస్తుంటారు. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని 133ఏ, సెక్షన్‌ 133బి కింద సర్వే నిబంధనలు రూపొందించారు. దీని ప్రకారం.. ఐటీ అధికారులు వ్యాపార కేంద్రాల్లో మాత్రమే తనిఖీలకు అనుమతి ఉంటుంది. అంతేగానీ.. ఆయా సంస్థల ప్రమోటర్ల నివాస సముదాయాల్లో నిర్వహించడానికి వీల్లేదు. అలాగే, నగదు, ఖాతా పుస్తకాలు, దస్త్రాలు వంటివి తనిఖీ చేసి వాటిపై తాము గుర్తించిన విషయాలను మార్క్‌ చేసుకోవచ్చు. కానీ వాటిని స్వాధీనం చేసుకోవడానికి వీలు ఉండదు.

ఇక సోదాల విషయానికొస్తే... ఐటీ చట్టంలోని సెక్షన్‌ 132  ఐటీ అధికారులకు సోదాలకు అనుమతి ఇస్తుంది. సోదాల్లో భాగంగా వ్యాపార, వాణిజ్య, నివాస సముదాయాల్లో ఎక్కడైనా పన్ను అధికారులు సోదాలు నిర్వహించొచ్చు. ఏదైనా ఖాతాలు, డాక్యుమెంట్లు తనిఖీ చేసే అధికారం ఈ సెక్షన్‌ కల్పిస్తుంది. అవసరమైతే తలుపులు, లాకర్లను పగలగొట్టేందుకు వీలు కల్పిస్తోంది. సోదాల్లో భాగంగా పత్రాలను, వస్తువులను సీజ్‌ చేసే అధికారం కూడా అధికారులకు ఉంది. పేర్లు వేరైనా ఐటీ సోదాలు లేదా సర్వే ముఖ్య లక్ష్యం ఆదాయానికి మించిన ఆస్తులు, లెక్కల్లో చూపని ఆదాయాన్ని గుర్తించేందుకు చేపట్టే తనిఖీలే.

  • సాధారణంగా సర్వే అనేది కార్యకలాపాలు సాగే సమయంలో మాత్రమే నిర్వహిస్తారు. కానీ, సోదాలు మాత్రం ఏ సమయంలోనైనా వ్యాపార కేంద్రం/నివాస ప్రాంతాల్లోనూ నిర్వహించొచ్చు.
  • సోదాలకు సంబంధిత వ్యక్తులు సహకరించకపోతే.. అధికారులు తలుపులు, కిటీకీలను పగలగొట్టవచ్చు. కానీ, సర్వే సమయంలో అలా చేసే వీలు లేదు. 
  • సోదాల సమయంలో లెక్కల్లో చూపని ఆస్తుల్ని సీజ్‌ చేయవచ్చు. కానీ, సర్వే అలాంటివి అనుమతించదు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని