Nato : విస్తరిస్తోంది చూడు.. నాటో.. నాటో..

రష్యాతో (Russia) ఎటువంటి ప్రాదేశిక తగాదాలు లేని ఫిన్లాండ్‌ (Finland) తాజాగా 31వ సభ్య దేశంగా నాటోలో (Nato) చేరింది. ఈ నేపథ్యంలో నాటో అంటే ఏంటీ? దాని ఉనికి ఏ విధంగా మొదలైందో తెలుసుకోండి.

Published : 06 Apr 2023 09:55 IST

ఉక్రెయిన్‌ (Russia-ukraine)పై రష్యా దండయాత్ర కారణంగా ఈ మధ్య కాలంలో నాటో (Nato) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఉక్రెయిన్‌ (Ukraine) నాటోలో చేరడానికి ఆసక్తి చూపడమే యుద్ధానికి అసలు కారణం. ఈ యుద్ధం కొనసాగుతుండగానే రష్యా (Russia) సరిహద్దు దేశం ఫిన్లాండ్‌ (Finland) నాటోలో (Nato) సభ్యత్వం పొందింది. సభ్యత్వం కోసం మరో దేశం స్వీడన్‌ (Sweden) ఎదురు చూస్తోంది. ఐరోపా సమాఖ్యలోని (European union) కీలక దేశం ఫిన్లాండ్‌ నాటో సైనిక కూటమిలో చేరడం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు ఎదురుదెబ్బేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనికి రష్యాతో ఫిన్లాండ్‌కు 1,340 కి.మీ. సరిహద్దు కలిగి ఉండటమే కారణం. ఈ సరిహద్దు ఇప్పుడు నాటోకు అందుబాటులోకి రావడం రష్యా భద్రతకు పెనుసవాలుగా మారనుంది. 

నాటో ఎలా ఏర్పాటైంది?

రెండో ప్రపంచ యుద్ధం (1939-45) అనంతరం తూర్పు యూరప్‌లోని చాలా ప్రాంతాల నుంచి సోవియట్‌ సేనలు వైదొలగేందుకు నిరాకరించాయి. 1948లో బెర్లిన్‌ను పూర్తిగా చుట్టుముట్టాయి. దీంతో సోవియట్‌ను కట్టడి చేయడానికి కూటమిగా ఏర్పడాలని 12 దేశాలు భావించాయి. ఇదిలా ఉంటే.. యుద్ధంతో చితికిపోయిన చాలా ఐరోపా దేశాలు ఆర్థికంగా, భద్రతాపరంగా నిలదొక్కుకునేందుకు ఇబ్బంది పడుతున్నాయి. పరిశ్రమలు స్థాపించడానికి, ఆహారోత్పత్తి పెంపొందించడానికి వాటికి భారీగా నిధుల అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఐరోపాను బలోపేతం చేసి కమ్యూనిస్టు పాలన విస్తరించకుండా చేయాలని అమెరికా పావులు కదిపింది. 1948లో అమెరికా మార్షల్ ప్లాన్‌ను రూపొందించింది. సెక్రటరీ జార్జ్‌ మార్షల్‌ ప్రతిపాదించిన మేరకు భారీ ఆర్థిక సహాయాన్ని అందజేసింది. ఈ చర్య అమెరికా, ఐరోపాలోని కొన్ని దేశాల మధ్య బంధాన్ని బలపరచింది. మరో వైపు సోవియట్ యూనియన్‌ ఈ సహాయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. తూర్పు ఐరోపాలో తన ఆధీనంలో ఉన్న దేశాలను ఈ సహాయం తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ చర్య తూర్పు, పశ్చమ ఐరోపా విభజనకు కారణమైంది. సోవియట్‌ యూనియన్‌ నుంచి పశ్చిమ ఐరోపా దేశాలకు సామూహిక భద్రత అందించడానికి యునైటెడ్‌ స్టేట్స్‌ చొరవతో 1949లో ‘నార్త్ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌’ నాటో ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయం బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో ఉంటుంది. అప్పటి నుంచి ఇది రాజకీయ, సైనిక మార్గాల ద్వారా తమ సభ్య దేశాల స్వేచ్ఛ, భద్రతను కాపాడుతోంది.

సభ్య దేశాలివీ..

నాటోలో తొలుత బెల్జియం, కెనడా, డెన్మార్క్‌, ఫ్రాన్స్‌, ఐస్‌లాండ్, ఇటలీ, లక్సెంబర్గ్‌, నెదర్లాండ్స్‌, నార్వే, పోర్చుగల్‌, యూకే, యూఎస్‌  సభ్య దేశాలుగా చేరాయి. తరువాత దశల వారీగా గ్రీస్‌, టర్కీ, వెస్ట్ జర్మనీ(1990 తరువాత నుంచి జర్మనీ), బల్గేరియా, ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియా, రొమేనియా, స్లొవేకియా, స్లొవేనియా, అల్బేనియా, క్రొయేషియా, మాంటెనిగ్రో, నార్త్‌ మాసిడోనియా, చెక్‌ రిపబ్లిక్‌, హంగరీ, పోలండ్‌, స్పెయిన్‌, చేతులు కలిపాయి. ఫ్రాన్స్‌ సభ్యదేశంగా ఉంటూనే సమీకృత మిలటరీ కమాండ్‌ నుంచి 1966లో వైదొలిగింది. 2009లో మళ్లీ పూర్తి స్థాయిలో భాగమైంది. తాజాగా నాటో జాబితాలోకి ఫిన్లాండ్ చేరింది. ఈ దేశాలు మొత్తం సమష్టిగా భద్రతా బాధ్యతలను పంచుకొంటాయి. ఒక నాటో సభ్యదేశంపై దాడి జరిగితే అన్ని సభ్యదేశాలపై దాడిగా పరిగణిస్తారు. అంతా కలిసి ఆ దురాక్రమణదారుపై విరుచుకుపడతారు. 

పరిపాలన-మిలటరీ

నాటో ఏర్పాటైన తరువాత పరిపాలన వ్యవహారాలు, మిలటరీ వ్యవహారాలు చూడటానికి వేర్వేరు విభాగాలు ఏర్పడ్డాయి. నాటో ప్రతినిధులతో నార్త్‌ అట్లాంటిక్‌ కౌన్సిల్, న్యూక్లియర్‌ ప్లానింగ్‌ గ్రూప్‌ ఏర్పాటైంది. కౌన్సిల్ సూచన మేరకు ‘సుప్రీం అలైడ్‌ కమాండర్‌ యూరప్‌’ ఏర్పాటైంది. ఇది నాటోలో రెండవ అత్యున్నత సైనిక స్థానం. దీనికి అమెరికన్‌ నేతృత్వం వహిస్తారు. సెక్రటరీ జనరల్‌గా యూరోపియన్‌ కొనసాగుతారు. నార్త్‌ అట్లాంటిక్‌ కౌన్సిల్లో సభ్య దేశాలకు చెందిన ప్రతినిధులు మంత్రివర్గ సభ్యులుగా ఉంటారు. వీరంతా ఏడాదికి రెండు సార్లు తప్పకుండా సమావేశమవుతారు. ఇతర సమాయాల్లో నాటో సెక్రటరీ జనరల్ అధ్యక్షత వహిస్తూ రాయబారుల స్థాయిలో శాశ్వత సమావేశాలు నిర్వహిస్తుంటారు.

మిలటరీ వ్యవహారాల కమిటీలో సభ్యదేశాల మిలటరీ ఉన్నతాధికారులు ఉంటారు. ఇందులోనూ రెండు విభాగాలున్నాయి. ఒకటి అలైడ్‌ కమాండ్‌ ఆపరేషన్స్‌(ఏసీవో), రెండోది అలైడ్ కమాండ్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌(ఏసీటీ). ‘ఏసీవో’కు ‘సుప్రీం అలైడ్‌ కమాండర్‌ యూరప్‌’ అధ్యక్షుడిగా ఉంటారు. ఇది బెల్జియంలోని ‘సుప్రీం హెడ్ క్వార్టర్స్‌ అలెడ్ పవర్స్‌ యూరప్‌(షేప్‌)లో ఉంటుంది.

అపారమైన సైనిక శక్తి

నాటోకు అపారమైన సైనికశక్తి ఉంది. మొత్తం సైనికుల సంఖ్య 33 లక్షలు. వీరిలో 8లక్షల మంది యాక్టివ్‌ దళాలు. ఇందులో అమెరికా సైనికులు 13 లక్షల దాకా ఉన్నారు. నాటోలోని 30 సభ్యదేశాలు 2021లో 1,174 బిలియన్‌ డాలర్లను సైన్యంపై ఖర్చుపెట్టాయి. 2020లో ఈ బడ్జెట్‌ 1,106 బిలియన్‌ డాలర్లుగా ఉంది. దాదాపు 40 వేల నాటో సైనికులు ఎల్లవేళలా పోరాడేందుకు సిద్ధంగా ఉంటారు. 

రష్యా ‘వార్సా ఒప్పందం’

1950లో జరిగిన పారిస్‌ ఒప్పందం ద్వారా పశ్చిమ జర్మనీకి సభ్యత్వం ఇచ్చేందుకు నాటో అంగీకరించింది. ఈ చర్య సోవియట్‌ యూనియన్‌కు మింగుడుపడలేదు. దాంతో మధ్య, తూర్పు ఐరోపా దేశాలతో కలిసి ‘వార్సా ఒప్పందం’ కూటమిని తయారు చేసింది. దీన్ని అధికారికంగా ‘వార్సా ట్రీటీ ఆఫ్‌ ఫ్రెండ్‌షిప్‌’ అని పిలుస్తుంటారు. ఇందులో అల్బేనియా, బల్గేరియా, చెకోస్లోవేకియా, తూర్పు జర్మనీ, హంగరీ, పోలండ్‌, రొమేనియా సభ్య దేశాలుగా చేరాయి. 1968లో అల్బేనియా, 1990లో తూర్పు జర్మనీ ఇందులో నుంచి బయటకు వచ్చాయి. 1989 నాటికి తూర్పు ఐరోపాలో ప్రజాస్వామ్య విప్లవాలు ఊపందుకున్నాయి. దాంతో 1991 జులై 1 నాటికి వార్సా ప్రస్థానం ముగిసిపోయింది. అదే ఏడాది డిసెంబర్‌ 26న సోవియట్‌ పతనమైంది. మొత్తం 15 కొత్త దేశాలు ఆవిర్భవించాయి. అందులో ఉక్రెయిన్‌ కూడా ఒకటి. కొన్ని దేశాలు స్వతంత్రంగా వ్యవహరించడం మొదలుపెట్టాయి. మరికొన్ని అమెరికా ప్రోద్బలంతో నాటోలో చేరాయి. అప్పటి నుంచి రష్యా ఒంటరైపోయింది.

నాటో-రష్యా కస్సుబుస్సులు

నాటో చేపట్టే ఎలాంటి కార్యక్రమమైనా రష్యాకు కంటగింపుగా ఉంటుంది. ముఖ్యంగా నాటో తూర్పు దిశగా విస్తరించడాన్ని రష్యా అంగీకరించడం లేదు. తమ సరిహద్దు దేశాలను నాటోలో చేర్చుకోవడం కూడా రష్యా, నాటోకు మధ్య శత్రుత్వం పెంచుతోంది. నాటో-రష్యాకు మధ్య జరిగిన కొన్ని ముఖ్యమైన ఘటనలివి..

  • 1994లో రష్యా, నాటోతో శాంతి స్థాపన కార్యక్రమంలో చేతులు కలిపింది.
  • 2002లో రష్యా-నాటో కౌన్సిల్ ఏర్పాటైంది. భద్రతాపరమైన సవాళ్లు, ఇతర ప్రాజెక్టుల వివాదాలను పరిష్కరించుకునేందుకు దీన్ని ఏర్పాటు చేశారు.
  • 2014లో రష్యా క్రిమియాను ఆక్రమించుకోవడంతో నాటో.. రష్యాకు ఇతర సహకారాలను నిరాకరించింది. కానీ, రష్యా-నాటో కౌన్సిల్‌ మాత్రం రద్దు కాలేదు.
  • 2021లో బ్రసెల్స్‌ నుంచి 8 మంది రష్యా దౌత్యవేత్తలను బహిష్కరించారు.
  • 2022లో ఉక్రెయిన్‌ను నాటోలో చేరే ప్రయత్నాలు ముమ్మరం చేయడం రష్యాకు ఆగ్రహం తెప్పించింది. దాంతో రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించింది.

-ఇంటర్నెట్ డెస్క్‌ ప్రత్యేకం
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని