పొట్టలో వాయుగుండం(గ్యాస్‌) తగ్గేదెలా..?

ఈ మధ్య కాలంలో మనలో చాలామందికి పొట్టలో గ్యాస్‌ బాధలు బాగా పెరుగుతున్నాయి. ఈ గ్యాస్‌ ట్రబుల్‌ను కడుపులో పెద్ద వాయుగుండంగా భావిస్తుంటారు. పొట్ట ఉబ్బరంగా ఉండటం, ఆపై పులితేన్పులు, ఎడతెగని అపానవాయువులతో అసౌకర్యంగా ఉంటుంది. ఇందుకు గాడితప్పిన

Updated : 12 Mar 2021 04:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ మధ్య కాలంలో మనలో చాలామందికి పొట్టలో గ్యాస్‌ బాధలు బాగా పెరుగుతున్నాయి. ఈ గ్యాస్‌ ట్రబుల్‌ను కడుపులో పెద్ద వాయుగుండంగా భావిస్తుంటారు. పొట్ట ఉబ్బరంగా ఉండటం, ఆపై పులితేన్పులు, ఎడతెగని అపానవాయువులతో అసౌకర్యంగా ఉంటుంది. ఇందుకు గాడితప్పిన ఆహారపు అలవాట్లు.. అస్తవ్యస్థమైన జీవనశైలి కారణాలు కావొచ్చు. మరి ఈ గ్యాస్‌ ట్రబుల్‌ను ఎలా అధిగమించవచ్చో తెలుసుకుందాం..

మనం తీసుకున్న ఆహారం నోటిలో బాగా నమలబడి ఆ తర్వాత గొంతు నుంచి ఆహారనాళం ద్వారా పొట్టలోని జీర్ణాశయంలోకి చేరుతుంది. అక్కడ ఆహారాన్ని జీర్ణం చేయడానికి యాసిడ్‌తోపాటు పెప్సిన్‌ వంటి ఎంజైమ్స్‌ ఉత్పత్తి అవుతాయి. కొంతమందిలో ఆ యాసిడ్‌.. ఆహారాన్ని జీర్ణం చేసే పరిమాణంలో లేనప్పుడు మరింత యాసిడ్‌ ఉత్పన్నం అవుతుంది. ఈ యాసిడ్‌కు మంట పుట్టించే గుణం ఉంటుంది. అందుకే, యాసిడ్‌ ఎక్కువ ఉత్పత్తి అవుతున్న కొద్ది పొట్టలో మంటగా అనిపిస్తుంది. దాంతోపాటు గ్యాస్‌ కూడా ఉత్పత్తి అవుతుంది. దీంతో పొట్టంతా ఉబ్బరించినట్టుగా మారుతుంది. గ్యాస్‌ పైకి ఎగదన్నుకు వస్తూ పొట్టలో, ఛాతీలో, గొంతులో మంటగా అనిపిస్తుంటుంది. పులితేన్పులు, ఆపానవాయువులతో అసౌకర్యంగా ఉంటుంది.  

కొంతమందికి గ్యాస్‌ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. అది తినే ఆహారం వల్ల కావొచ్చు.. పొట్టలో ఇన్‌ఫెక్షన్ల వల్ల కావొచ్చు. క్యాబేజీ, కాలీఫ్లవర్‌, బీన్స్‌, కొన్నిసార్లు క్యారెట్లు, పప్పులు, పాలు, పాల ఉత్పత్తుల వల్ల పొట్టలో గ్యాస్‌ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఔషధాల ద్వారా లేదా ఆహారపు అలవాట్లలో మార్పులు, వ్యాయామం ద్వారా ఈ గ్యాస్‌ ట్రబుల్‌ను తగ్గించుకోవచ్చు. అయితే, కొందరిలో ఈ బాధ ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారికి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. వ్యాయామం చేసే వారిలో గ్యాస్‌ సమస్యలు తక్కువగా ఉంటాయి.

గ్యాస్‌ ట్రబుల్‌కు కారణాలు

గ్యాస్‌ ట్రబుల్‌ సమస్యకు ఎన్నో కారణాలు కనిపిస్తాయి. కొద్దిపాటి ఖాళీ లేకుండా పొట్ట పగిలేలా తినడం, తిన్న వెంటనే పడుకోవడం, కొవ్వుపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, ఉప్పు.. కారం.. మసాలా పదార్థాలు అధికంగా తీసుకోవడం.. అతిగా ఆందోళన, ఒత్తిడికి గురవడం ఇవన్నీ పొట్టలో గ్యాస్‌ బాధల్ని పెంచుతాయి. ఆహారనాళం, జీర్ణకోశం కలిసే జంక్షన్‌లో ఓ మూతలాంటి నిర్మాణం ఉంటుంది. దీన్ని వైద్య పరిభాషలో జీఈ జంక్షన్‌ అంటారు. ఒక్కసారి జీర్ణకోశంలోకి వెళ్లిన ఆహారం మళ్లీ పైకిరాకుండా ఈ జీఈ మూత అడ్డుగా నిలుస్తుంది. కొన్ని సందర్భాల్లో అది బలహీనంగా ఉండటం వల్ల గొంతులోకి ఆహారపు మెతుకులు, దాంతోపాటు యాసిడ్‌ రావడంతో గ్యాస్‌ బాధలు, ఛాతీలో మంట వంటి ఇబ్బందులు పెరుగుతాయి. కొన్నిసార్లు మనం నిత్యం వేసుకునే మందుల వల్ల కూడా గ్యాస్‌ ట్రబుల్‌ వస్తుంది.

పరిష్కారమేంటి?

గ్యాస్‌ ట్రబుల్‌ బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు. గ్యాస్‌ ట్రబుల్‌కు అప్పుడే తయారు చేసిన మజ్జిగను తీసుకోవడం ఒక మంచి పరిష్కారం. మజ్జిగకు క్షార గుణం ఉంటుంది. ఇది కడుపులోని యాసిడ్‌తో కలవగానే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. ఫలితంగా ఆమ్లం తన ప్రభావాన్ని కోల్పోతుంది. అయితే, ఇందుకు పులిసిన మజ్జిగ కాకుండా అప్పటికప్పుడు తయారు చేసిన మజ్జిగనే తీసుకోవాలి. పులిసిన మజ్జిగకు క్షార గుణం కన్నా ఆమ్ల గుణం పెరుగుతుంది. దీంతో గ్యాస్‌ ట్రబుల్‌ తగ్గకపోగా.. మరింత తీవ్రం కావొచ్చు. తాజా పెరుగు, తీయటి పెరుగు కూడా గ్యాస్‌ బాధల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వీటిలోని ప్రోబయోటిక్‌ ఫ్యాక్టర్స్‌ పొట్టలోని బ్యాక్టీరియాను నియంత్రించి కడుపులో మంటను, గ్యాస్‌ బాధను తగ్గిస్తాయి. గ్యాస్‌ ట్రబుల్‌కు మనలో చాలా మంది ‘రజో-డీ’, ‘జెంటాక్‌’ వంటి మాత్రల్ని వాడుతుంటారు. వీటి విషయంలో డాక్టర్‌ సలహా తీసుకోవడం మేలు.

ఈ ఓవర్‌ ది కౌంటర్‌ మందుల్ని వాడుకోవచ్చు. కానీ, వాడే ముందు మనకు ఉన్నది గ్యాస్‌ సమస్యే అని నిర్థారించుకోవడం మేలు. ఏ మాత్రం అనుమానం ఉన్నా డాక్టర్లు సంప్రదించి.. వారి సూచన మేరకు పరీక్షలు చేయించుకొని ఆ తర్వాత మందులు వాడాలి. ఎవరికైతే బరువు తగ్గడం, రక్తపు వాంతులు లేదా విరేచనాలు, జ్వరం, నొప్పులు వంటివి ఉంటే కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి. 

గ్యాస్‌‌ ట్రబుల్‌తో బాధపడుతున్నప్పుడు జీవనశైలిలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వేళకు భోజనం చేయాలి. చిన్న చిన్న మోతాదులో ఎక్కవ సార్లు తినడాన్ని అలవాటు చేసుకోవాలి. పొద్దుపోయాక తినకూడదు. రాత్రి భోజనాన్ని పెందలాడే ముగించాలి. రాత్రివేళ చిరుతిండ్లకు దూరంగా ఉండాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి. పొగ, మద్యం వంటి అలవాట్లను మానుకోవాలి. పక్కమీద ఎడమవైపు తిరిగి పడుకోవాలి. కుడివైపు తిరిగి పడుకున్నప్పుడు ఆహారనాళం మూత తెరుచుకొని ఆహారపదార్థాలు, పొట్టలోని ఆమ్లం వెనక్కు తన్నుకొచ్చే అవకాశాలుంటాయి. తలకింద కాస్త ఎత్తుగా ఉండే దిండు పెట్టుకుంటే మేలు చేస్తుంది. గ్యాస్ బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు కొంతకాలం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు