Published : 29 Jan 2020 18:52 IST

కరోనాతో చైనాకు కలవరమే!

‘కరోనా’.. చైనా సహా ప్రపంచ దేశాలను వణికిస్తున్న వైరస్‌. చైనాలోని వుహాన్‌ నగరంలో బయటపడిన ఈ వైరస్ వల్ల 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ నగరం గుండా ప్రయాణాలపై చైనా నిషేధం విధించింది. కరోనాపై పోరాడేందుకు శతవిధాలా పోరాడుతోంది. ఒకవేళ ఈ వైరస్‌ మరింత వృద్ధి చెందితే చైనా ఆర్థిక వ్యవస్థపైనే ప్రభావం చూపుతుందన్నది కాదనలేని వాస్తవం. కారణం.. వుహాన్‌ నగరం. అభివృద్ధిలో దూసుకుపోతూ.. దేశ వృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తుండడమే ఇందుక్కారణం. మోదీ-జిన్‌పింగ్‌ భేటీకి ఇదే నగరం వేదిక అయ్యింది. దీనిబట్టి ఈ నగరానికి ఉన్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ వుహాన్‌కు ఎందుకు అంత ప్రాధాన్యం? ఆ దేశ ఆర్థికంలో దాని పాత్ర ఎంత?

* చైనాకు మధ్యలో ఉన్న హుబెయ్‌ ప్రావిన్స్‌ రాజధాని నగరం వుహాన్‌. యాంగ్టేజే నదీ తీరంలో ఉన్న విస్తరించిన ఉన్న అతి పెద్ద నగరం.  సుమారు 1.1కోట్ల మంది నివసిస్తున్నారు.


* 1927లో చైనాకు ఈ నగరం రాజధానిగానూ ఉంది. రోడ్లు, రైల్వే, నౌకాయానం కలిగి చైనాలోని అన్ని నగరాలతోనూ ఈ నగరం అనుసంధానమై ఉంది. రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తూ ట్రాన్స్‌పోర్ట్‌ హబ్‌గా నిలుస్తున్న ఈ నగరానికి ‘చికాగో ఆఫ్‌ చైనా’ అని కూడా పేరుంది.


* ఉత్తర- దక్షిణంగా ఉండే బీజింగ్‌-గాంగ్జౌ, తూర్పు-పశ్చిమంలో ఉండే షాంగై-చెంగ్డూ మధ్య నడిచే అతి పొడవైన హైస్పీడ్‌ రైళ్లు ఇక్కడ ఆగుతాయి. అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఈ నగరం సొంతం. మధ్య చైనా నుంచి ఐదు ఖండాలకు ఇక్కడి నుంచి విమాన సదుపాయం ఉంది. లండన్‌, మాస్కో, రోమ్‌, న్యూయార్క్‌ వంటి సుమారు 109 నగరాలకు ఇక్కడి నుంచి నాన్‌స్టాప్‌ విమాన సర్వీసులు ఉన్నాయి.


* ప్రపంచంలో టాప్‌-500 కంపెనీల్లో మైక్రోసాఫ్ట్‌, ఎస్‌ఏపీ, ఫ్రెంచ్‌ కార్ల తయారీ కంపెనీ పీఎస్‌ఏ వంటి సుమారు 300కు పైగా కంపెనీలు ఇక్కడ కొలువుదీరాయంటే.. ఈ నగరానికి ఉన్న ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చు.


* 53కు పైగా యూనివర్సిటీలు ఈ నగరంలో ఉన్నాయి. వుహాన్‌ యూనివర్సిటీ అందులో అతిపెద్దది. ఈ ఒక్క యూనివర్సిటీలోనే సుమారు 60వేలమంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వుహాన్‌ ప్రముఖ పర్యాటక ప్రాంతం కూడా.


* అందుకే రాజధాని బీజింగ్‌ నగరం అయినప్పటికీ.. 2018లో వుహాన్‌లో మోదీ-జిన్‌పింగ్‌ ఇక్కడ సమావేశమవ్వడం గమనార్హం. వివిధ దేశాల దౌత్య కార్యాలయాలు కూడా ఇక్కడ కొలువుదీరుతున్నాయి.


ఆర్థికంగా ప్రభావం..

* రెండో ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాకు కరోనా కలవరపెడుతోంది. ఇప్పటికే కనిష్ఠ స్థాయికి చేరిన వృద్ధిరేటుపై కరోనా తాటి పండు రూపంలో మూలిగే నక్కపై పడడమనే చెప్పాలి. 2019లో వుహాన్ జీడీపీ 7.8గా నమోదైంది. ఇది జాతీయ సగటుతో పోలిస్తే 1.7శాతం అధికం. వైరస్‌ ప్రభావం వల్ల దేశ జీడీపీలో 0.5 నుంచి 1 శాతం కోత పడే అవకాశం ఉందని వృద్ధి రేటు అంచనాల సంస్థ ‘ద ఎకనామిస్ట్‌’కు చెందిన ఇంటిలిజెన్స్‌ విభాగం అంచనా వేసింది.


* ఈ వైరస్‌ మరింత విస్తరిస్తే వైద్యంపై ఆ దేశం మరింత ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వానికి తలకుమించిన భారం కానుంది.


*  ప్రయాణాలపై నిషేధం ఆర్థికంగా ప్రభావం పడుతుంది. ఈ నగరానికి దేశం, ప్రపంచంలోని చాలా నగరాలతో రవాణా అనుసంధానం కలిగి ఉండడమే ఇందుకు కారణం. 


* ఒక్క లూనర్‌ నూతన సంవత్సర వేడుకలకు హాజరయ్యేందుకు ఈ నగరం గుండా సుమారు 1.5 కోట్ల మంది ప్రయాణించాల్సి ఉండగా.. ప్రయాణాలపై నిషేధం విధించడంతో వారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. దీంతో రెస్టారెంట్లు, షాపింగ్‌ మాల్స్‌ వెలవెలబోయాయి.
* 2013లో కరోనా తరహాలో అప్పట్లో సార్స్‌ పడగ విప్పడంతో చైనాలో రిటైల్‌ వ్యాపారంపై పెద్ద ఎత్తున ప్రభావం పడింది.  వృద్ధి సగానికి పడిపోయింది. అయితే, ఇది తాత్కాలికమేనని ఆ దేశ ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

Read latest Explained News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని