ఆ చెట్లను ఎలా ఎత్తుకెళ్లారో.. అలా తెచ్చిపెట్టారు

మ్యూజియంలో ఉన్న చెట్లను దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో ఆ మ్యూజియం సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.. దేవుణ్ని ప్రార్ధించారు.. సోషల్‌ మీడియా ద్వారా దేశ ప్రజలను విన్నపం పెట్టారు.. ఆ చెట్లు దొరికితే తిరిగి మ్యూజియంకు అప్పగించమని. అదేంటి చెట్లు పోతేనే అంతలా గాబరా పడాలా, మళ్లీ కొత్త చెట్లు తెచ్చుకొని

Updated : 21 Feb 2020 11:39 IST

సోషల్‌మీడియాలో వైరల్‌ అయిన మ్యూజియం విన్నపం

మ్యూజియంలో ఉన్న చెట్లను దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో ఆ మ్యూజియం సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.. దేవుణ్ని ప్రార్థించారు.. సోషల్‌ మీడియా ద్వారా దేశ ప్రజలకు విన్నపం పెట్టారు.. ఆ చెట్లు దొరికితే తిరిగి మ్యూజియంకు అప్పగించమని. అదేంటి చెట్లు పోతేనే అంతలా గాబరా పడాలా, మళ్లీ కొత్త చెట్లు తెచ్చుకొని పెంచుకోవచ్చు కదా అని తీసి పారేయకండి. ఆ చెట్లకు ఉన్న ప్రాముఖ్యత అలాంటిది మరి.. ఈ వార్తలో చెట్లు ఎంత విశేషమో.. ఆ చెట్లు తిరిగి క్షేమంగా మ్యూజియంకు రావడం అంతకు మించిన విశేషం.

వాషింగ్టన్‌లోని పసిఫిక్‌ బోన్సాయ్‌ చెట్ల మ్యూజియంలో గత వారం రెండు చెట్లు మాయమయ్యాయి. అవేం సాధారణ చెట్లు కాదు.. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బందీగా చిక్కిన ఓ జపనీస్‌-అమెరికన్‌ సైనికుడు జైలులో పెంచుకున్న చెట్లవి. వెల కట్టలేని, ఏడు దశాబ్దాల కాలం నాటి ఈ బోన్సాయ్‌ చెట్లను మ్యూజియం సిబ్బంది రోజువారి సంరక్షణతో కాపాడుతూ వస్తున్నారు. ఆ చెట్లకు జాగ్రత్తలు తీసుకోకపోతే ఎక్కువ రోజులు బతకలేవు. అలాంటి చెట్లు చోరీకి గురికావడంతో సిబ్బంది కంగారుపడ్డారు. పోయిన ఆ చెట్లు ఎక్కడైనా కనపడితే తెచ్చివ్వమని సోషల్‌ మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదికాస్త దేశవ్యాప్తంగా సంచలనమైంది.

అయితే మూడు రోజుల తర్వాత మ్యూజియంకు సమీపంలో ఆ చెట్లు ప్రత్యక్షమయ్యాయి. చెట్లను ఎత్తుకెళ్లిన దొంగలు భయపడ్డారో.. లేక చెట్ల ప్రాముఖ్యత తెలిసిందో తెలియదు కానీ.. ఎలా ఎత్తుకెళ్లారో అలాగే.. తెచ్చి పెట్టేసి వెళ్లారు. వాటిని గుర్తించిన మ్యూజియం సిబ్బంది సంతోషానికి అవధులు లేవు. ‘‘70ఏళ్ల కాలం నాటి ఈ చెట్లను రోజూ ఎంతో జాగ్రత్తగా సంరక్షిస్తున్నాం. ఇవి పోయి ఉంటే.. తీరని నష్టం జరిగేది’’ అని మ్యూజియం సిబ్బంది చెప్పుకొచ్చారు. దొరికిన రెండు చెట్లలో ఒక చెట్టు స్వల్పంగా దెబ్బతింది. అయినా రెండు చెట్లు క్షేమంగా ఉన్నాయని చెప్పారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని