Published : 29/02/2020 09:59 IST

ఫిబ్రవరి 29.. ఆసక్తికర విషయాలు

 

2020.. కొత్త దశాబ్ధం  ప్రారంభమే కాదు.. మరో విశేషం కూడా ఉంది, అదేంటో తెలుసా? ఒక్కసారి ఈ నెలలో చివరి తేది ఏంటో చూడండి? గుర్తొచ్చిందా... ఇది లీపు సంవత్సరం. సాధారణంగా ఫిబ్రవరి నెలలో 28 రోజులే ఉంటాయి. భూపరిభ్రమణానికి 365రోజుల మీద పావురోజు పడుతుంది. నాలుగేళ్లకోసారి ఆ పావు రోజులు కలిసి ఒక రోజు అదనంగా చేరుతోంది. అలా ఫిబ్రవరిలో 29 రోజులు వచ్చిన ఏడాదిని లీపు సంవత్సరం అంటారు. మరీ ఈ లీపు సంవత్సరంలో ఫిబ్రవరి 29కి ఉన్న విశేషాలు.. వింతలు ఒకసారి చూద్దామా? 

* ఫిబ్రవరి 14 (ప్రేమికుల రోజు)న అబ్బాయిలు తమ ప్రేయసికి ప్రేమను వ్యక్తపర్చడం చూస్తుంటాం.. మరి అమ్మాయిలకూ అలాంటి రోజు ఒకటుంది. అదే.. ఫిబ్రవరి 29. ఈ రోజున అమ్మాయిలు తమకు నచ్చిన వ్యక్తికి ప్రపోజ్‌ చేయొచ్చట. ఈ రోజు ప్రపోజ్‌ చేస్తే.. అబ్బాయిలు కచ్చితంగా ఒప్పుకొంటారని నమ్మకం.. ఒకవేళ అబ్బాయికి నచ్చకపోతే ఆ అమ్మాయికి ముద్దు.. కొత్త దుస్తులు, 12 జతల గ్లౌవ్స్‌లో ఏదో ఒక్కటి ఇవ్వాల్సి ఉంటుందట. 

* ఫిబ్రవరి 29న పుట్టిన వారిని లీప్లింగ్స్‌ లేదా లీపర్స్‌ అంటారు. ఇలాంటి వారు ప్రపంచంలో దాదాపు 30 కోట్ల మంది ఉంటారని అంచనా. ఈ రోజు పుట్టిన వారి కోసం ‘ద హానర్‌ సొసైటీ ఆఫ్‌ లీప్‌ ఇయర్‌ బేబీస్‌’ పేరుతో ఓ క్లబ్‌ ఏర్పాటైంది. ఇప్పటి వరకు అందులో 10వేల మంది సభ్యులు ఉన్నారు. 

* ఫిబ్రవరి 29న పుట్టిన వారు, వారి పుట్టిన రోజును సాధారణ సంవత్సరాల్లో ఫిబ్రవరి 28 లేదా మార్చి 1న జరుపుకొంటారు. ఈ రోజున పుట్టిన వారికి పికాసోలా పెయింటింగ్‌ వేసే నైపుణ్యం ఉంటుందట.

* ఫ్రాన్స్‌లో ‘లా బూగీ డు సపర్‌’ అనే ఓ వార్త పత్రిక ఉంది. అది కేవలం లీపు సంవత్సరంలోని ఫిబ్రవరి 29వ తేదీన మాత్రమే ప్రచురితమవుతుంది. ఈ వార్త పత్రికను 1980లో ప్రారంభించారు. అంటే ఇప్పటి వరకు ఆ పత్రికా సంస్థ ప్రచురించిన సంచికల సంఖ్య కేవలం 10 అన్నమాట. ఇవాళ 11వ సంచిక వెలుబడింది.

* టెక్సాస్‌లోని ఆంథోని పట్టణానికి ‘లీప్‌ ఇయర్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ది వరల్డ్‌’గా పేరుంది. ప్రతి లీపు సంవత్సరంలో ఫిబ్రవరి 29న ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు పుట్టిన వారు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటారు. మరెక్కడా ఇలాంటి కార్యక్రమం జరగదు. అందుకే ఈ పట్టణాన్ని లీప్‌ ఇయర్‌ క్యాపిటల్‌ ఆఫ్ ది వరల్డ్‌ అని పిలుస్తుంటారు.

* ఈ రోజును అరుదైన వ్యాధుల దినంగా పేర్కొంటారు. ప్రతి 2వేల మందిలో ఒక్కరికి వచ్చే అరుదైన వ్యాధులపై అవగాహన పెంచడానికి ఈ రోజు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. 2008 నుంచి ఈ రోజును అరుదైన వ్యాధుల దినంగా జరుపుతున్నారు. లీపు సంవత్సరం కాకపోతే ఫిబ్రవరి 28నే ఈ జరుపుతారు.

* 2010లో హాలీవుడ్‌లో ‘లీప్‌ ఇయర్‌’ అనే సినిమా విడుదలైంది. ఇందులో హీరోయిన్‌ ఒంటరిగా ఐర్లాండ్‌కు వెళ్లి హీరోని పెళ్లి చేసుకోమని అడుగుతుంది. ఫిబ్రవరి 29న అమ్మాయిలు ప్రపోజ్‌ చేస్తే.. అబ్బాయిలు నిరాకరించకూడదన్న సంప్రదాయం ఉంది. దాన్ని ఆధారంగా చేసుకొనే ఈ చిత్రం తెరకెక్కించారు.

* ఆస్ట్రేలియాలోని టస్మానియా స్టేట్‌ రాజకీయ నాయకుడు జేమ్స్‌ విల్సన్‌ పుట్టుక.. చావు ఫిబ్రవరి 29వ తేదీనే జరిగింది. 1812 ఫిబ్రవరి 29న జన్మించిన జేమ్స్‌ విల్సన్‌.. 1880 ఫిబ్రవరి 29న మరణించాడు.

* భారతదేశంలో ఆషాడం నెల ఎలాగో.. లీపు సంవత్సరంలోని ఫిబ్రవరి నెలను తైవాన్‌ వాసులు అలా భావిస్తారు. పెళ్లై అత్తవారింట్లో ఉన్న కూతురు ఈ నెలలో పుట్టింట్లో ఉండాలి. లేకపోతే ఆమె తల్లిదండ్రులకు ప్రాణహాని జరుగుతుందని అక్కడి వారి నమ్మకం. కూతుళ్లు తండ్రికి పంది మాంసంతో చేసిన నూడిల్స్‌ను వండిపెట్టి ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థించాలట.

Read latest Explained News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్