కరోనాకు బలహీనులం కావొద్దు.. కర్ఫ్యూ ధ్యేయమిదే

బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్‌ ఫర్‌ ఏ ఛేంజ్‌. ఆ బలహీనుడి పక్కనా ఓ బలముంది. జనతా గ్యారేజ్‌. ఇచట అన్ని రిపేర్లూ చేయబడును. ఇదో సినిమా డైలాగ్‌ అని అందరికీ తెలిసిన సంగతే. కానీ ప్రస్తుత పరిస్థితులకు ఒక్కసారి అన్వయించి చూసుకుంటే.......

Updated : 20 Mar 2020 17:35 IST

ప్రజల కోసం ప్రజల చేత మహమ్మారి కట్టడికి వ్యూహం

ఇళ్లు దాటాలనిపిస్తే ఇటలీని గుర్తు తెచ్చుకోండి

మున్ముందు చర్యలకు దిక్సూచి ‘జనతా కర్ఫ్యూ’ 

‘బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్‌ ఫర్‌ ఏ ఛేంజ్‌. ఆ బలహీనుడి పక్కనా ఓ బలముంది. జనతా గ్యారేజ్‌. ఇచట అన్ని రిపేర్లూ చేయబడును’ ఇదో సినిమా డైలాగ్‌ అని అందరికీ తెలిసిన సంగతే. కానీ ప్రస్తుత పరిస్థితులకు ఒక్కసారి అన్వయించి చూసుకుంటే..

విశ్వం సంగతెందుకు గానీ ఈ భూమ్మీద మాత్రం అత్యంత బలవంతుడు మనిషే. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం ఉంది. ఆలోచించే తెలివితేటలూ ఉన్నాయి. కరోనా వైరస్‌ కంటికి కనిపించని ఓ సూక్ష్మక్రిమి. పరిమాణం ప్రకారం అత్యంత బలహీనం. ఇప్పుడా బలవంతుడినే బలహీనుడిగా మార్చేసిందది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే అతలాకుతలం చేస్తూ మానవాళి మనుగడకే సవాల్‌ విసురుతోంది కొవిడ్‌-19. బలహీనులమని భయపడుతున్న మనకిప్పుడు ఓ బలం అవసరం. అదే సంకల్పం, సంయమనం. ఇక స్వీయ నిర్బంధం ఇప్పుడు చేయాల్సిన మొదటి రిపేరు. ప్రధాని మోదీ సూచించిన ప్రజల చేత ప్రజల కోసం ప్రజలే చేయాల్సిన ‘జనతా కర్ఫ్యూ’ వెనుక శాస్త్రీయత చాలానే ఉందంటున్నారు నిపుణులు. మున్ముందు తీసుకోబోయే చర్యలకూ ఇదో మేలి మలుపని అంటున్నారు.


నొక్కి చెబుతున్నా ప్రబలుతోంది

సబ్బుతో చేతులు కడుక్కోండి. సబ్బు, నీరు అందుబాటులో లేనిచోట శానిటైజర్‌ రాసుకోండి. చేతులతో కళ్లు, ముక్కు, నోరు, ముఖాన్ని తాకకండి. ఇవన్నీ సరిగ్గా చేస్తే కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా అన్ని ప్రభుత్వాలు పదేపదే నొక్కి చెబుతున్నాయి. చాలా వరకు మేలు చేస్తున్నాయి. కానీ మరోవైపు కొవిడ్‌-19 కేసులు ప్రపంచ వ్యాప్తంగా రెండు లక్షలు దాటిపోయాయి. వారం రోజుల్లో ఈ సంఖ్య ఐదు లక్షలు దాటినా ఆశ్యర్యపోనవసరం లేదు. ఎందుకంటే వైరస్‌ వ్యాప్తి గొలుసుకట్టులా ఉంది. ఇటలీలోనైతే మరణ మృదంగమే మోగుతోంది. వైరస్‌ పుట్టిన చైనాలో కన్నా ఎక్కువ మరణాలు అక్కడ నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది.

వయసు మళ్లిన వృద్ధులకు వైద్యం అందించలేమని ఇటలీ ప్రభుత్వమే చెప్తోందంటే పరిస్థితిని ఒక్కసారి అర్థం చేసుకోండి. ఓ యువతి తల్లిదండ్రులిద్దరికీ కరోనా సోకింది. ఐసోలేషన్‌లో వేర్వేరుగా పెట్టి చికిత్స అందిస్తున్నారు. తండ్రి చనిపోయాడు. ఈ సంగతి అతడి భార్యకూ తెలియదు. ఇంట్లో ఉన్న బిడ్డకు సమాచారం అందించారు. అయితే కనీసం తండ్రి ఆఖరి చూపునకూ నోచుకోలేని పరిస్థితి. పౌరులెవరూ బయటకు రావొద్దని ప్రభుత్వ శాసనం. శ్మశాన వాటికకు తీసుకెళితే అక్కడా మృతదేహాల వరుస. ఏ సమయంలో విద్యుత్‌ దహనం చేస్తారో తెలియని ఆవేదన. అమ్మ బతుకుతుందో లేదోనన్న బెంగ. ఈ పరిస్థితులను ఒక్కసారి ఊహించుకోండి. ఇప్పుడు మన దేశం ఎంత భద్రంగా ఉందో తలచుకోండి. మనమిలాగే సురక్షితంగా ఉండాలంటే స్వీయ నిర్బంధమే మనముందున్న ఏకైక మార్గం.


నెలల తరబడి ఐసోలేషన్‌

వైరస్‌పై విజయం సాధించేందుకు చైనా యుద్ధ ప్రాతిపదికన పనిచేసింది. కఠిన ఆంక్షలు విధించింది. వైరస్‌ పుట్టిన వుహాన్‌ను మొత్తం ఐసోలేట్‌ చేసింది. శక్తిమంతమైన శుభ్రకాలతో నగరాలన్నీ కడిగేసింది. భారీ యంత్రాలు, రవాణా సాధనలను ఇందుకు ఉపయోగించింది. సాంకేతికను సమర్థంగా వినియోగించింది. ఇంటర్నెట్‌, బిగ్‌డేటా, సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌, క్లౌడ్‌.. ఇలా అన్ని సేవలను వాడుకొంది. వైద్యులు, వైద్య సిబ్బంది నిద్రలేని రాత్రులు గడిపారు. వారు ధరించిన వైద్య రక్షణ మాస్క్‌ల అచ్చులు పడి ముఖకవళికలే మారిపోయిన చిత్రాలు కలవరపరిచాయి. అయినా వారేమీ వెనుకడుగు వేయలేదు. నెలల తరబడి పౌరులను నిర్బంధంలోనే ఉంచారు. వ్యాపార సంస్థలేవీ నడవలేదు. కేవలం వైద్యం, ఔషధ తయారీ సంస్థలనే తెరిచారు. ఎవ్వరూ అడుగు బయటపెట్టిందే లేదు. చైనా అంతటా సోషల్‌ డిస్టెన్స్‌ పాటించారు. మరి అలాంటి పరిస్థితులను మన దేశంలో రోజుల తరబడి అనుభవించకూడదంటే చేయాల్సింది ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించడం. సామాజిక దూరం అనుసరించడం. పటిష్ఠ జాగ్రత్తలు తీసుకోవడం. ఆదివారం జనతా కర్ఫ్యూను విజయవంతం చేయడం.


జనతా కర్ఫ్యూతో తెగనున్న కరోనా గొలుసు

భారత్‌లో కొవిడ్‌-19 కేసులు ఎక్కువగా నమోదేమీ కావడం లేదని నిర్లక్ష్యం వహించొద్దు. ఈ విశ్వ మహమ్మారి విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే సోకిందని, ఇక్కడున్న వారికెవరికీ సోకలేదని అప్రమత్తత వీడొద్దు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం జాతినుద్దేశించిన చేసిన ప్రసంగంలో ఇదే చెప్పారు. ఆదివారం రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 వరకు జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు. జనతా కర్ఫ్యూ అంటే ఎవరికి వారే ఇంటివద్ద ఐసోలేట్‌ కావడం. దీనివల్ల జరిగే లాభాలు చాలా ఉన్నాయి. కరోనా వైరస్‌ గాల్లో 3 గంటలు, రాగి పాత్రలపై 4 గంటలు, కార్డ్‌బోర్డులపై 24 గంటలు, స్టీల్‌ పాత్రలపై 2-3 రోజులు, ప్లాస్టిక్‌ పాత్రలపై 3 రోజులు బతికుంటుందని న్యూ ఇంగ్లాండ్‌ జర్నల్‌లో వచ్చిన పరిశోధన వెల్లడించింది. ఆదివారం రోజు 14 గంటలు అందరం ఇంట్లోనే ఉండటం వల్ల గాల్లోని వైరస్‌ ఎవరికీ సోకే ప్రమాదం ఉండదు. వైరస్‌ వ్యాప్తి గొలుసు తెగిపోతుంది. అంటే మూడో దశను దాదాపు అడ్డుకున్నట్టు అవుతుంది. ఆ తర్వాత కరోనా సోకిన వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తే పరిస్థితి మెరుగుపడుతుంది.


మున్ముందు చర్యలకు నాందీవాచకం

ఇంట్లో ఉన్న వారూ తమ ఇంటిని, పాత్రలను డిసిన్ఫెక్టెడ్‌ క్రిమి సంహారకాలతో శుభ్రం చేసుకొంటే మంచిది. పెద్దలు పిల్లలకు వైరస్‌లు సంక్రమించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పించాలి. ఇక ఉద్యోగులు, ఇంటి యజమానులు తమ తల్లిదండ్రులు కష్టకాలంలో ఎలా నెట్టుకొచ్చారో వంటి వివరాలు తెలుసుకొంటే ప్రేరణ లభిస్తుంది. మున్ముందు ప్రభుత్వం తీసుకొనే కఠిన చర్యలను అమలు చేసేందుకు స్ఫూర్తి కలుగుతుంది. రాత్రి 9 గంటల తర్వాత బయటకు వెళ్లడం తక్కువగానే ఉంటుంది. అవసరాలు ఏమీ లేకుంటే వెళ్లకపోవడమే మేలు. దాంతో ఉదయం వరకు ఐసోలేట్‌ అయినట్టు ఉంటుంది. మనం పాటించే ‘జనతా కర్ఫ్యూ’ ద్వారానే ప్రజలెంత సంకల్ప బలం, సంయమనంతో ఉన్నారో ప్రభుత్వాలకు అవగాహన లభిస్తుంది. పరిస్థితిని సమీక్షించి ఆంక్షలను ప్రకటించేందుకు విధించేందుకు ఆస్కారం ఉంటుంది. మున్ముందు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుస్తుంది. ఆ..! నేను బాగానే ఉన్నా. బయటకు ఎందుకెళ్లొద్దు అన్న నిర్లిప్తతకు తావివ్వొద్దు. ఇటలీలో ప్రభుత్వం చెప్పినా తమ సన్నిహితులను కలుస్తూ గుమిగూడుతూ పరిస్థితిని పీకలమీదకు తెచ్చుకున్నారు. గుర్తుంచుకోండి! మనం పాటించే స్వచ్ఛంద కర్ఫ్యూ కరోనాను అడ్డుకోవడానికి చేస్తున్న ఒక రిపేరు. ఇలాంటి రిపేర్లు మరిన్ని జరగకుండా ముందే కరోనా సూక్ష్మక్రిమిని పెద్దకర్రతో కొడదాం. మహమ్మారిపై భారత్‌ విజయం సాధించేలా చేద్దాం.

-ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని