ముఖం తాకకుండా ఉండండిలా...

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా(కొవిడ్‌-19)వైరస్‌ మహమ్మారి పట్టి పీడిస్తోంది. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకే ఈ వైరస్‌ బారి నుంచి బయటపడాలంటే సామాజిక దూరం పాటించాలి, సబ్బుతో చేతులు కడగాలి, శుభ్రత పాటించాలి, ముఖంపై చేతులు పెట్టకూడదని నిపుణులు సలహాలిస్తున్నారు. మనమూ జాగ్రత్త వహిస్తూ తుమ్ము వచ్చినప్పుడు రుమాలు అడ్డు పెట్టుకుంటున్నాం. శానిటైజర్లతో చేతులు

Updated : 31 Mar 2020 13:31 IST

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా (కొవిడ్‌-19) వైరస్‌ మహమ్మారి పట్టి పీడిస్తోంది. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకే ఈ వైరస్‌ బారి నుంచి బయటపడాలంటే సామాజిక దూరం పాటించాలి.. సబ్బుతో చేతులు కడగాలి.. శుభ్రత పాటించాలి.. ముఖంపై చేతులు పెట్టకూడదని నిపుణులు సలహాలిస్తున్నారు. మనమూ జాగ్రత్త వహిస్తూ తుమ్ము వచ్చినప్పుడు రుమాలు అడ్డు పెట్టుకుంటున్నాం. శానిటైజర్లతో చేతులు శుభ్రపర్చుకుంటున్నాం.. మరి ముఖంపై చేతులు పెట్టకుండా ఉంటున్నామా? చేతులకు అంటిన వైరస్‌ కళ్లు, ముక్కు, నోరు ద్వారా త్వరగా శరీరంలోకి ప్రవేశిస్తుంది. అందుకే అన్నింటికన్నా ముఖ్యంగా మన చేతులు మన ముఖాన్ని తాకకుండా జాగ్రత్త పడాలి. 

సాధారణంగా ఆత్రుత, ఇబ్బంది, ఒత్తిడి, దురద లాంటివి ఉన్నప్పుడు కళ్లు తుడుచుకోవడం, గోళ్లు కొరకడం, జుట్టు సవరించుకోవడంలాంటి పనులు ఎక్కువగా చేస్తుంటాం. అలాగే దిగులుగా ఉన్నా.. పుస్తకాలు చదువుతున్నా చెంప కింద చేతులు పెట్టుకుంటాం. మన ప్రమేయం లేకుండా ఇలాంటివి జరుగుతుంటాయి. ఇలా సుమారు గంటకు 9 నుంచి 23సార్లు మనం ముఖాన్ని తాకుతామని, ఇది ఒక అలవాటుగా మారిపోయిందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ అలవాటును మార్చుకోవాలంటే  ఏం చేయాలి?

అలవాట్లను గుర్తించండి

మీకున్న అలవాట్లను మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఎప్పటి నుంచో ఉన్న అలవాటు ఉన్నట్టుండి మారాలంటే కష్టమే, కానీ ప్రయత్నించొచ్చు. మార్చుకోవాలంటే ముందు వాటిని గుర్తించాలి. మీరు ఏ సందర్భాల్లో మీ ముఖాన్ని తాకుతున్నారు? ఎన్నిసార్లు తాకుతున్నారు? లాంటివి ఓ పేపరుపై రాసుకోండి. వీలుంటే మీ స్నేహితుల సహాయం తీసుకోండి. ఎప్పుడెప్పుడు మీరు ముఖాన్నితాకుతున్నారో వారిని గమనించి చెప్పమనండి. 

అలవాట్లకు బదులుగా..

అలవాట్లను మార్చుకోవడం చెప్పినంత సులువు కాదు. తరచుగా చేసే కొన్ని అలవాట్లకి బదులుగా ఇలాంటివి చేయండి.

* తుమ్ము వచ్చినా.. దగ్గు వచ్చినా అడ్డు పెట్టడానికి మన చేయి మన ప్రమేయం లేకుండానే ముఖానికి తాకుతుంటుంది. అలా కాకుండా మన మోచేయిని అడ్డుకోవడం అలవాటు చేసుకోవాలి. మోచేయి మన ముఖానికి తాకే అవకాశమే లేదు.. దీంతో వైరస్‌ సోకే ప్రసక్తే ఉండదు.
* మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు, ముఖంపై చేతులు పెట్టాల్సి వస్తే వెంటనే చేతులకు మరో పని చెప్పండి.. స్ట్రెసింగ్‌ బాల్‌ని నొక్కుతుండడం, రెండు చేతులతో పిడికిలి బిగించి తొడల కింద పెట్టుకోవడం చేయాలి. 

* అప్పుడప్పుడు మీ కళ్లద్దాలు ముక్కుపై నుంచి జారిపోతుంటాయి. అలా జారిపోకుండా ఉండటానికి చెవి హుక్స్‌ లేదా హెయిర్‌ బ్యాండ్‌లను జారిపోకుండా పెట్టొచ్చు.

* మీకు గోళ్లు కొరికే అలవాటు ఉంటే గోళ్లని చిన్నగా కత్తిరించండి. మీ గోళ్లను కత్తిరించడం ఇష్టం లేకపోతే గ్లౌజ్‌లు లేదా ఫింగర్‌ బ్యాండేజీలను వేసుకుంటే, గోళ్లు కొరకాలనిపించినా
ఆ పని చేయలేరు.

* మీ కళ్లు, ముక్కు, చర్మంపై అలర్జీ ఉన్నా.. దురద వచ్చినా వాటిని తగ్గించే ఔషధాలను వాడడం మంచిది.

* ఏదైనా తిన్న తరువాత..  ఒక్కోసారి పళ్ల సందుల్లో ఆహారం ఇరుక్కుంటుంది. వాటిని చేతులతో తీయకుండా తిన్న తరువాత పళ్లు తోముకోవడం మంచి అలవాటు.

* అప్పుడప్పుడు తల వెంట్రుకలు కళ్లలోకో, నోటిలోకో వెళ్తుంటాయి. ప్రతిసారీ జుట్టు సవరించుకోవడం కన్నా హెయిర్‌ బ్యాండ్‌, స్కార్ప్‌ లాంటివాటితో వెనక్కి పెట్టేస్తే సరి. మీరు ఇలాంటివి చేయడం ద్వారా ముఖాన్ని తరుచూ తాకే అలవాటు పోతుంది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Read latest Explained News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని