Published : 28/03/2020 15:32 IST

చైనా మహమ్మారిని వారి పద్ధతిలోనే తరిమేయాలి

అలా చేస్తేనే 21 రోజుల లాక్‌డౌన్‌ విజయవంతమవుతుందన్న నిపుణులు

కరోనా వైరస్‌ ఇప్పుడు ప్రపంచమంతా వణికిస్తోంది. దేశాలన్నీ క్రమంగా లాక్‌డౌన్‌ అయిపోతున్నాయి. వైరస్‌పై సమగ్ర సమాచారం ఇవ్వలేదని ప్రపంచ దేశాలన్నీ చైనాపై విమర్శలు గుప్పిస్తున్నాయి. భూ మండలమంతా విస్తరించిన కొవిడ్‌-19ను చైనా కేవలం వుహాన్‌ లాక్‌డౌన్‌తో కట్టడి చేసింది. ముల్లును ముల్లుతోనే తీయాలి. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అన్నట్టు చైనా వైరస్‌ను చైనా పద్ధతుల్లోనే కట్టడి చేయాలని భారత వైద్యులు, నిపుణులు అంటున్నారు. అప్పుడే 21 రోజుల లాక్‌డౌన్‌ విజయవంతం అవుతుందంటున్నారు.


చైనా ఎలా చేసింది?

కొవిడ్‌-19తో ఇటలీ, స్పెయిన్‌, అమెరికా, బ్రిటన్‌లో భయానక పరిస్థితి తలెత్తింది. అగ్రరాజ్యం అమెరికా ఏకంగా వైరస్‌కు కేంద్రమైన చైనాను దాటేసింది. ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఇందుకు కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. వైరస్‌ ఉనికి పెరుగుతోందని భావించిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల లాక్‌డౌన్‌ ప్రకటించారు. కానీ చైనా 5.6 కోట్లున్న వుబెయ్‌ ప్రావిన్స్‌ను మాత్రమే లాక్‌డౌన్‌ చేసి విజయం సాధించింది. జనవరి 23 నుంచి అక్కడ 81,340 కేసులు నమోదవ్వగా ఒక్క వుహాన్‌లోనే 68వేలు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 3,292. అయితే అందరికీ అర్థం కానిది ఒకే ఒక్క సంగతి. తక్కువ జనాభా గల ఐరోపా దేశాలన్నీ లాక్‌డౌన్‌ ప్రకటిస్తే వుహాన్‌కు మాత్రమే తాళమేసి మిగతా రాష్ట్రాల్లో వైరస్‌ను ఎలా కట్టడి చేసింది?


విదేశాలకు వెళ్లడంతోనే వ్యాప్తి

చైనా సంప్రదాయ కొత్త సంవత్సరానికి రెండు రోజుల ముందు వుహాన్‌ను లాక్‌డౌన్‌ చేశారు. కంటి వైద్యుడొకరు ఈ వైరస్‌ గురించి సోషల్‌ మీడియాలో పంచుకున్న సంగతి తెలిసిందే. దాంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడు చెప్పిన సమయంలోనే ఈ సూక్ష్మక్రిమి వుహాన్‌ మొత్తం వ్యాపించింది. ఎక్కువ మందిలో లక్షణాలు కనిపించినా అక్కడి ఆస్పత్రులు పట్టించుకోలేదు. కొందరిలో ఈ లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయి. కొత్త ఏడాది వేడుకల సందర్భంగా సెలవులు రావడంతో చాలామంది చైనీయులు విదేశాలకు వెళ్లారు. ఇటలీ, స్పెయిన్‌, అమెరికా, బ్రిటన్‌ సహా ఎన్నో దేశాలకు చేరుకున్నారు. ఇక వుహాన్‌లో చదువుకుంటున్న మన విద్యార్థులు కొందరు భారత్‌కు వచ్చారు. కేరళలో కేసులు నమోదు కాగా వైద్యులు విజయవంతంగా వారికి నయం చేశారు. దాంతో మనపై ప్రభావం ఉండదేమో అనుకున్నారు. మహమ్మారిగా ప్రకటించ ముందే విదేశాలకు వెళ్లిన చైనీయులు, స్థానికులు అక్కడ సమూహ వ్యాప్తితో విశ్వవ్యాప్తం చేసేశారు. చైనా మాత్రం ఇతర రాష్ట్రాలకు వుహాన్‌ నుంచి ఎవరినీ రానివ్వలేదు.


కృత్రిమ మేథ + మానవ మేథ

కరోనాను చైనా చక్కని ప్రణాళికతో కట్టడి చేసింది. ముందు వుహాన్‌కు తాళమేసింది. జనాలను బయటకు రానివ్వకుండా వైరస్‌ గొలుసు తెంపేసింది. యుద్ధ ప్రాతిపదికన వైద్య సేవలు అందించింది. కిట్లు, పరికరాలు లేకపోవడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంది. హుబెయ్‌ ప్రావిన్స్‌ లాక్‌డౌన్‌ అయినా ఆహార సరఫరా, ఈ-కామర్స్‌ సంస్థలు పనిచేసేలా చూసింది. కేసులు పెరిగినప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వైద్యులను రప్పించింది. ఆర్మీని బరిలోకి దించి ఎక్కడికక్కడ తాత్కాలిక ఆస్పత్రులను నిర్మించేసింది. అన్ని రాష్ట్రాలు, నగరాల్లో కృత్రిమ మేథ, స్థానిక వైద్యసిబ్బంది సహకారంతో ప్రజల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొంది. వుహాన్‌ నుంచి ఎవరెవరు ఎక్కడికి వెళ్లారో పక్కగా గుర్తించింది. వారు దేశంలో మరెక్కడైనా పర్యటించారో లేదో గుర్తించి ఎక్కడికక్కడ క్వారంటైన్‌ చేసింది. బీజింగ్‌, షాంఘై వంటి పెద్ద, చిన్న నగరాల్లో ప్రజల శరీర ఉష్ణోగ్రతలను పరీక్షించింది. సోషల్‌ డిస్టెన్స్‌ నిబంధనలు అమలు చేసి వైరస్‌ వ్యాప్తి లేకుండా చేసింది. రహస్య పద్ధతిలో వైద్యం చేసినట్లూ వార్తలు వస్తున్నాయి.


21 లాక్‌డౌన్‌ విజయవంతమే!

ప్రస్తుతం చైనాపై ఎన్నో అనుమానాలు ఉన్నా వారి పద్ధతిలోనే విపత్తును ఎదుర్కోవాలని నిపుణులు భారత్‌కు సూచిస్తున్నారు. చైనాలో ప్రధాని లీ కెకియాంగ్‌ నేతృత్వంలో అన్ని మంత్రిత్వ శాఖలు, అధికారులతో కమిటీలు వేసి ఎక్కడా పాలన, సేవా లోపాలు లేకుండా పనిచేశారు. వెంటవెంటనే అవసరమైన చర్యలు తీసుకున్నారు. మనమూ ఇలాగే చేయాలని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులతో సమన్వయం ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతి రోజూ అన్ని రాష్ట్రాల పరిస్థితిని ఆయన ఆరా తీస్తున్నారు. రాష్ట్రాలకు కేంద్ర మంత్రులను పర్యవేక్షకులుగా నియమించారు. మొదట చైనాలో సరైన వైద్య పరికరాలు, గ్లోవ్స్‌, రక్షణ దుస్తులు లేకపోవడంతో 3000 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. వెంటనే వారు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడంతో పరిస్థితి చక్కబడింది. మన దేశంలో అలాంటి కొరత రానీయకుండా చూడాలి. అక్కడ వైరస్‌ ప్రధాన కేంద్రం వుహాన్‌ ఒక్కటే. ఆ దేశమంతా దానిపైనే దృష్టిసారించింది. భారత్‌లో వుహాన్‌ తరహా కేంద్రాలేమీ లేవు. సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటే 21 రోజుల లాక్‌డౌన్‌ విజయవంతమై వైరస్‌ వ్యాప్తి దాదాపుగా అంతమవుతుందని విశ్లేషకులు అంటున్నారు. అందుకే ప్రజలెవ్వరూ బయటకు రావొద్దు.

-ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌

Read latest Explained News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని