ఆ వ్యాధులు ఎలా కనుమరుగయ్యాయి?

చరిత్రలో అతి భయంకరమైన వ్యాధుల్లో ప్లేగు వ్యాధి ఒకటి. క్రీస్తుశకం 541 కాలంలో ఆనాటి బిజంటైన్‌(ఈశాన్య యూరప్‌ రాజ్యం) రాజధాని కాన్‌స్టాంటినోపిల్‌లో మొదటిసారి ప్లేగు వ్యాధి వచ్చింది. ఈజిప్టు నుంచి మెడిటెర్రెనియన్‌ సముద్రం మీదుగా ఈ వ్యాధి పాకిందని చరిత్రకారులు చెబుతున్నారు. బిజంటైన్‌ రాజధానిలో ప్రబలిన ఈ ప్లేగు వ్యాధి.. యూరప్‌తోపాటు ఆసియా, నార్త్‌ అమెరికా, అరేబియా దే

Updated : 12 Jul 2021 12:28 IST

వైద్య రంగానికి ఎప్పుడూ సవాళ్లు ఎదురవుతూ ఉంటాయ్‌.. కొత్త రోగాలు వస్తే మందు కనిపెట్టాలి.. రాకుండా వ్యాక్సిన్లు కనుక్కోవాలి. ఎక్కడా ఎలాంటి వైరస్‌ పుట్టికొచ్చినా.. దాని అంతమొందించే ఆయుధాన్ని సిద్ధం చేయాలి. ప్రస్తుతం సాంకేతిక లోకంలో కొత్త వ్యాధులకు ఔషధం కనిపెట్టడం పెద్ద సమస్యేమీ కాదు.. కచ్చితంగా మందు అందుబాటులోకి వచ్చేస్తుంది. ప్రస్తుతం కరోనా వైరస్‌ విషయంలోనూ అదే జరుగుతోంది. ఇప్పటికే పరిశోధనలు జరుగుతున్నాయి. కొంచెం ఆలస్యమైనా ఔషధం అందుబాటులోకి వచ్చి తీరుతుంది. ఇప్పుడంటే వైద్యులు, పరిశోధకులు అధికంగా ఉన్నారు. కాబట్టి ప్రజలు ఏ వ్యాధినుంచైనా బయటపడగలుతున్నారు. మరి వైద్యులు, పరిశోధనలు సరిగా లేని కాలంలో వ్యాధులు ఎలా తగ్గాయి? లక్షల మంది ప్రాణాలు బలిగొన్న వైరస్‌లు, బాక్టీరియాలను ప్రజలు ఎలా తరిమికొట్టారు? చరిత్రలో భయంకరంగా విరుచుకుపడిన కొన్ని సూక్ష్మక్రిములు కాలక్రమంలో ఎలా మాయమయ్యాయో చూద్దాం.. 

జస్టీనియన్‌ ప్లేగు.. రోగ నిరోధక శక్తే ఆయుధం

చరిత్రలో అతి భయంకరమైన వ్యాధుల్లో ప్లేగు వ్యాధి ఒకటి. క్రీస్తుశకం 541 కాలంలో ఆనాటి బిజంటైన్‌(ఈశాన్య యూరప్‌ రాజ్యం) రాజధాని కాన్‌స్టాంటినోపిల్‌లో మొదటిసారి ప్లేగు వ్యాధి వచ్చింది. ఈజిప్టు నుంచి మెడిటెర్రెనియన్‌ సముద్రం మీదుగా ఈ వ్యాధి పాకిందని చరిత్రకారులు చెబుతున్నారు. బిజంటైన్‌ రాజధానిలో ప్రబలిన ఈ ప్లేగు వ్యాధి.. యూరప్‌తోపాటు ఆసియా, నార్త్‌ అమెరికా, అరేబియా దేశాలకు వ్యాపించింది. అప్పట్లో ఈ వ్యాధికి సరైన మందు లేకపోవడంతో ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. ప్రాణాలు కాపాడమని దేవుణ్ణి ప్రార్థించడం తప్ప ఏం చేయలేకపోయారు. దీంతో ప్లేగు కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 కోట్ల నుంచి 5 కోట్ల మంది ప్రజలు చనిపోయి ఉంటారని అంచనా. అంటే దాదాపు ఆ కాలంలో అప్పటి ప్రపంచ జనాభాలో సగం అన్నమాట. క్రీస్తుశకం 541-542 కాలంలో దీని తీవ్రత ఎక్కువగా ఉండగా.. ఇది క్రీస్తుశకం 750 వరకు ఈ ప్లేగు విలయ తాండవం ఆడింది. ఆ తర్వాత నెమ్మదిగా కనుమరుగైంది. అయితే ఈ అంటువ్యాధి బారి నుంచి ఇతరులు ఎలా బయటపడ్డారన్న ప్రశ్నకు చరిత్రకారుల వద్దా సమాధానం లేదు. కానీ.. రోగనిరోధక శక్తి సామర్థ్యం ఎక్కువగా ఉన్నవాళ్లు మాత్రమే రోగం నుంచి బయటపడి ఉంటారని డిపాల్‌ యూనివర్శిటీ చరిత్ర అధ్యాపకులు థామస్‌ మోకైటీస్‌ చెప్పారు. చక్రవర్తి జస్టీనియన్‌ పాలించిన సమయంలో వ్యాధి రావడం, జస్టీనియన్‌కు ప్లేగు సోకి.. కోలుకోవడంతో దీనిని జస్టీనియన్‌ ప్లేగు అని పిలుస్తున్నారట. 

 

బ్లాక్‌డెత్‌(బుబోనిక్‌ ప్లేగు).. క్వారంటైన్‌కు నాంది

జస్టీనియన్‌ ప్లేగుకు కారణమైన యెర్సీనియా పెస్టిస్‌ బాక్టీరియా 800 సంవత్సరాల తర్వాత రూపాంతరం చెంది బుబోనిక్‌ ప్లేగుగా మళ్లీ ప్రజలపై విరుచుకుపడింది. బ్లాక్‌డెత్‌గా పిలిచే ఈ వ్యాధి 1347లో యూరప్‌ మొత్తం వ్యాపించింది. దీని బారిన పడి నాలుగేళ్లలో 20 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. చరిత్రలో ఇదొక భయానక సంఘటన. అయితే ఈ వ్యాధిని ఎలా నయం చేయాలో తెలియకపోయినా ఒకరి నుంచి మరొకరిని వ్యాపిస్తుందని తెలుసుకున్న ప్రజలు వ్యాధిగ్రస్తులను ఐసోలేషన్‌ చేయడం మొదలుపెట్టారు. వ్యాధి నిర్థారణ అయిన వ్యక్తులను ఇతరులతో కలవనీయకుండా ప్రత్యేక ప్రాంతాలకు తరలించారు. అంతేకాదు.. అప్పటి అధికారులు రోమన్‌ అధీనంలో ఉన్న ఓడరేవు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. ఓడల ద్వారా వచ్చిన వ్యక్తులను తొలుత ఐసోలేషన్‌లో ఉంచారు. 40 రోజులపాటు క్వారంటైన్‌ చేసిన తర్వాత వారికి వ్యాధి లక్షణాలు లేవని తేలితేనే రాజ్యంలోకి అనుమతిచ్చేవారు. అలా వ్యాధి సోకిన వాళ్లు మరణించగా.. ముందు జాగ్రత్తలు తీసుకున్నవారు బతికి బట్టగట్టారు. అయితే ఈ ప్లేగు అంత త్వరగా అంతం కాలేదు. పలుమార్లు యూరప్‌ దేశంపై పగబట్టినట్లు దాడి చేసింది. లక్షలమంది ప్రాణాలు బలితీసుకుంది.

 

ది గ్రేట్‌ ప్లేగు ఆఫ్‌ లండన్‌.. హోం క్వారంటైన్‌

యూరప్‌లో ప్లేగు వ్యాధి తాత్కాలికంగా మాయమైనా 1347-1666 మధ్య కాలంలో ప్రతీ 20 ఏళ్లకోసారి తన ఉనికి చాటుకునేది. 300 ఏళ్లలో 40 సార్లు ప్లేగు వ్యాధి సోకింది. ప్లేగు వచ్చిన ప్రతీసారి లక్షల మంది ప్రాణాలు కోల్పోయేవారు. క్రీస్తుశకం 1665లో ఇంగ్లాడ్‌లో ప్లేగు వ్యాధి విజృంభించింది. ఆ దేశ రాజధాని లండన్‌లో ఏడు నెలల వ్యవధిలో ఈ ప్లేగుకు లక్ష మంది బలయ్యారు. దీంతో ఆ దేశం కఠిన చర్యలు తీసుకుంది. ఈ ప్లేగు వ్యాధి వ్యాప్తికి కుక్కలు, పిల్లులు కారణమని భావించి.. లక్షల సంఖ్యలో ఉన్న వాటిని చంపేశారు. (నిజానికి యెర్సీనియా పెస్టిస్‌ బాక్టీరియా సోకిన ఎలుక మనుషుల్ని కరిచినప్పుడు దాని ద్వారా ఈ ప్లేగు వ్యాధి వస్తుంది.)  ప్లేగు సోకిన వ్యక్తిని ఐసోలేట్‌ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ల ఇంటికి అధికారులు గుర్తులు పెట్టేవారు. ప్రజలను బయటకు రావొద్దని హెచ్చరించారు. అలా తొలిసారి ఇళ్లలో ఉండే ప్రజలు హోం క్వారంటైన్‌ అయ్యారు. ఎవరైనా వ్యాధితో చనిపోతే వారిని ఇళ్లలోనే పూడ్చిపెట్టేవారు. వ్యాధి నిర్మూలనకు ఇంతకుమించిన మార్గం వారికి లేకుండాపోయింది. దీంతో క్రమేణా వ్యాధి వ్యాప్తి చెందడం తగ్గుముఖం పట్టింది.

 

మశూచి.. తొలిసారి వ్యాక్సిన్‌ వాడకం

 యూరప్‌, ఆసియా, అరేబియా దేశాల్లో మాత్రమే మశూచి ఎక్కువుగా వస్తుండేది. మశూచి సోకిన ప్రతి పది మందిలో ముగ్గురు చనిపోతే.. మిగతా వారికి ఒంటినిండా చారలు పడి ప్రాణాలు దక్కేవి. అయితే 15వ శతాబ్దంలో యూరప్‌ అన్వేషకుల ద్వారా మశూచి అమెరికా, మెక్సికో దేశాలకు వ్యాపించింది. అక్కడి వారికి మశూచిని ఎదుర్కొనేంత రోగనిరోధక శక్తి లేకపోవడంతో కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని శతాబ్దాల తర్వాత అంటే 1796 బ్రిటన్‌కు చెందిన వైద్యుడు ఎడ్వర్డ్‌ జెన్నర్‌ తొలిసారి మశూచికి వ్యాక్సిన్‌ కనుగొన్నారు. ఈ వ్యాక్సిన్‌ మశూచితో పోరాడే విధంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ వ్యాక్సిన్‌ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రావడంతో మశూచి తగ్గుముఖం పట్టింది. అయితే ఈ వ్యాధి పూర్తిగా కనుమరుగు అవడానికి రెండు శతబ్దాలు పట్టింది. 1980లో ప్రపంచ ఆరోగ్య సంస్థ  భూమిపై మశూచి వ్యాధి పూర్తిగా తొలగిపోయిందని ప్రకటించింది. చరిత్రలో మనిషి కనిపెట్టిన వ్యాక్సిన్‌ ద్వారా వ్యాధి తగ్గడం ఇదే ప్రథమం.

 

కలరా.. పరిశుభత్రతోనే మాయం

19వ శతాబ్దం మొత్తం కలరా వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపింది. అన్ని దేశాల్లో విస్తరించి లక్షల మంది ప్రాణాలు బలితీసుకుంది. 1846 నుంచి 1860 మధ్య కలరా యూరప్‌లో కూడా ప్రబలింది. యూరప్‌తోపాటు ఆఫ్రికా, అమెరికాకు కూడా పాకింది. మొదట్లో ఇది చెడు గాలుల ద్వారా వస్తుందని అందరు భావించారు. కానీ జాన్‌ స్నో అనే డాక్టర్‌ మాత్రం తాగు నీరులోనే వ్యాధి కారక క్రిములు ఉన్నాయని అనుమానించారు. అసలు కలరా ఎలా వస్తుందనే అంశంపై పరిశోధన ప్రారంభించారు. ఆస్పత్రుల్లో కలరా రోగుల రికార్డులు పరిశీలించారు. ఎక్కడెక్కడ అధిక సంఖ్యలో కలరా వ్యాపించిందో ఆ ప్రాంతాల్లో పర్యటించి పరిశీలించారు. చివరకు ఒక ఆధారం లభించింది. లండన్‌లోని ఓ ప్రాంతంలో వీధి కుళాయి చుట్టుపక్కల నివసిస్తున్న 500 మంది కలరా బారిన పడటం స్నో గమనించారు. వీధి కుళాయిని పరిశీలించిన ఆయన నీరు కలుషితం కావడం వల్లే కలరా వస్తోందని గుర్తించారు. నిజానికి కలరా విబ్రియో కలరా అనే బాక్టీరియా ద్వారా వస్తుంది. ఈ బాక్టీరియా కలుషితమైన నీళ్లను ఆవాసం చేసుకుంటుంది. అలాంటి కలుషితమైన నీటిని తాగడంతో వ్యక్తుల్లోకి బ్యాక్టీరియా చేరి కలరా వస్తుంది. బాక్టీరియాపై అవగాహన లేకపోయినా స్నో స్థానిక అధికారులతో మాట్లాడి కుళాయిని తొలగించాడు. దీంతో స్థానికంగా కలరా వ్యాప్తి ఆగిపోయింది. స్నో ప్రయత్నం.. ఒక్కరాత్రిలో కలరాను అంతం చేయకపోయినా.. పరిశుభత్ర, మంచి నీరు కలుషితం కాకుండా చూడాల్సిన అవసరాన్ని ప్రపంచానికి తెలియజెప్పింది. తద్వారా పరిశుభ్రత పెరిగి.. కలరా వ్యాధి నిర్మూలనకు నాంది పలికింది.

 

స్పానిష్‌ ఫ్లూ.. వైద్యుల కృషా.. వైరస్‌ లక్షణమా!

స్పానిష్‌ ఫ్లూ.. ప్రపంచ చరిత్రలో ఇదో దారుణ అంకం. 1918లో స్పెయిన్‌ మొదలైన ఈ ఫ్లూ ప్రపంచవ్యాప్తంగా సోకింది. రెండేళ్ల పాటు అన్ని దేశాలపై విరుచుకుపడి 5 కోట్ల మంది ప్రాణాలు తీసింది. అయితే కాలక్రమేణా ఈ ఫ్లూ కనుమరుగైంది. ఫిలిడెల్ఫియాలో ఫ్లూ వ్యాప్తించిన కొత్తలో 4,597 మంది మృతి చెందారు. అయితే నెల రోజులలోపే ఫ్లూ పూర్తిగా తొలగిపోయింది. అయితే వైరస్‌ సోకిన తర్వాత బాధితులకు వచ్చే న్యూమోనియాకు వైద్యులు సరైన చికిత్స అందించి నయం చేశారని.. అందువల్లనే ఫ్లూ ప్రభావం తగ్గిందని కొందరు వాదిస్తుంటే.. ఫ్లూ రావడం.. కొన్నాళ్లపాటు ప్రభావం చూపించి వెళ్లడం సాధారణ విషయమేనని మరికొందరు వాదిస్తున్నారు. ఏదీ ఏమైనా రెండేళ్లలో ఈ స్పానిష్‌ ఫ్లూ పూర్తిగా కనుమరుగైంది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌ 

Read latest Explained News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts