Updated : 04/04/2020 22:29 IST

నియంత రాజ్యంలో కరోనా వస్తే కాల్చేస్తున్నారా?

కొవిడ్‌-19ను ఉత్తర కొరియా ఎలా కట్టడి చేసిందంటే..

జనవరిలోనే కఠిన చర్యలకు ఆదేశించిన కిమ్‌ జాంగ్‌ ఉన్‌ 

నావెల్‌ కరోనా వైరస్‌ గతేడాది చివర్లో వుహాన్‌లో పురుడు పోసుకుంది. చైనాలోని ప్రధాన నగరాల్లో సంక్రమణ చెందింది. సరిహద్దులు దాటింది. విదేశాల్లో అడుగుపెట్టింది. దేశం మారినప్పుడల్లా దాడి చేసే పద్ధతిని మార్చుకుంది. ఇప్పుడు సమస్త భూమండలాన్నీ తన గుప్పిట బంధించింది. నగరాలు, రాష్ట్రాలు, దేశాలని లాక్‌డౌన్‌ చేయించింది.

ఆధునిక వైద్య సదుపాయలకు పేరెన్నికగన్న అగ్రరాజ్యాలను వణికిస్తున్న కొవిడ్‌-19 వ్యాప్తిని చిన్న చిన్న దేశాలు సమర్థంగా అడ్డుకున్నాయి. తజికిస్థాన్‌, దక్షిణ సుడాన్‌, యెమెన్‌, బురుండి, మాలవి, లెసెథో వంటి దేశాల్లో వైరస్‌ వ్యాప్తి లేదు. ప్రపంచానికి ఓ కొరకరాని కొయ్యగా మారిన ఉత్తర కొరియాలోనూ కరోనా కేసులు నమోదు కాలేదు. చైనాకు పక్కనే ఉండే ఈ దేశం ఇంతకీ ఏం చేసిందో తెలుసా!?


కాల్చేయడం నిజమా?

ఉత్తర కొరియా అంటే గుర్తొచ్చేవి ఆ దేశ నియంత పాలకుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌, క్షిపణి ప్రయోగాలు. అక్కడేం జరుగుతుందో ఎవరికీ తెలియదు. వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో సమాచారం ఉండదు. ప్రజల జీవిన విధానం, స్వేచ్ఛ, హక్కుల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రపంచ దేశాలతో ఉత్తర కొరియాకు ఉన్న దౌత్య సంబంధాలు అంతంత మాత్రమే. దాదాపుగా చైనాతోనే 90% వాణిజ్య ఒప్పందాలు ఉంటాయి. నేరుగా ఆ దేశానికి వెళ్లలేరు. చైనా నుంచే అక్కడికి చేరుకోవాలి. విదేశీ పర్యాటకులు ఎక్కడ పడితే అక్కడ ఫొటోలు తీసుకోవడానికి వీల్లేదు. స్థానికులతో మాట్లాడేందుకు అవకాశం ఉండదు. అక్కడి వ్యవస్థ గురించి ఆరాతీస్తే ఇక అంతే సంగతులు. మరి ఇలాంటి దేశం కొవిడ్‌-19 మహమ్మారిని అడ్డుకోవడం ఆశ్చర్యమే. అయితే.. ఎవరికైనా కరోనా సోకితే తుపాకీతో కాల్చి చంపేస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న చిత్రాలు మాత్రం అవాస్తవమే.


సరిహద్దులు బంద్‌

చైనాలో గతేడాది చివర్లోనే నావెల్‌ కరోనా వైరస్‌ విజృంభించింది. ఈ విషయం తెలియగానే కిమ్‌ కఠిన చర్యలకు ఆదేశించారు. జనవరి నుంచే దేశ సరిహద్దులను మూసేయించారు. అంతర్జాతీయ విమాన, రైలు ప్రయాణాలను నిషేధించారు. వాస్తవంగా 90 శాతం ప్రయాణాలన్నీ చైనాకే ఉంటాయి. సరిహద్దుల్లోని విమానాశ్రయాలు, పోర్టులు, రైల్వే స్టేషన్లు బంద్‌ చేయించారు. విదేశాలకు వెళ్లేందుకు స్థానికులకు అనుమతి ఇవ్వలేదు. బయట నుంచి వచ్చేవారికి కఠిన వైద్య పరీక్షలు, తనిఖీలు నిర్వహించాకే అనుమతించారు. ఆ వచ్చేవారినీ ఎక్కువ రోజులు ఉండనివ్వలేదు. ఇక ఆ దేశానికి వెళ్లే విదేశీయులు ఎవ్వరైనా ప్రతి రోజూ అధికారుల వద్ద రిపోర్ట్‌ చేయాల్సిందే. కాబట్టి సమస్య రాలేదు. జనవరిలో కొరియాలో పర్యటిస్తున్న విదేశీయుల్ని క్వారంటైన్‌ చేశారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించారు.


ఎప్పట్నుంచో ఐసోలేషన్‌

ఉత్తర కొరియాలో నియంత ఆంక్షలు ఎంత కఠినంగా ఉంటాయో అందరికీ తెలుసు. ఎవరైనా క్రమశిక్షణ తప్పినా, నిబంధనలు ఉల్లంఘించినా మెడపై కత్తి వేలాడటం ఖాయం. నిజానికి ఆ దేశంలో ఎప్పట్నుంచో సోషల్‌ డిస్టెన్స్‌ ఉంది! అవసరం లేకుండా ప్రజలెవ్వరూ వీధుల్లోకి రాకూడదు. అంటే ఉపాధి నిమిత్తం పనుల్లోకి వెళ్లేటప్పుడు తప్ప బయటెవరూ కనిపించరు. ఇతరులతో మాట్లాడేటప్పుడూ జాగ్రత్తలు, వ్యక్తిగత దూరం పాటించాల్సిందే. ఏ పనీ లేకుంటే ప్రజలు ఇంట్లోనే ఉండాలి. అంటే ఇష్టంగానో అయిష్టంగానో ప్రజలెప్పట్నుంచో వీటిని పాటిస్తున్నారు. ఇవన్నీ కరోనా వ్యాప్తికి నిరోధాలే కదా మరి! ఇక ప్రపంచంలోని ఎన్నో దేశాలు ఉత్తర కొరియాను ఎప్పుడో ఒంటరిని (ఐసోలేట్‌) చేశాయి. దాంతో ఇక్కడికి రాకపోకలు చాలా చాలా తక్కువ. అలాంటప్పుడు వైరస్‌ వచ్చే అవకాశాలూ తక్కువే.


కరోనా సోకితే కల్లోలమే

ఇక్కడి ప్రజలు ఎక్కువగా పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ఆరోగ్య పరంగానూ మెరుగ్గా లేరు. దేశంలో అత్యాధునిక వైద్యసదుపాయాలు లేవు. ఆ మధ్య కిమ్‌కు అనారోగ్యం సోకగా విదేశాల నుంచి వైద్య పరికరాలను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వ వైద్య సదుపాయాలు నగరాలు, పట్టణాలకే పరిమితం. అందులోనూ పేదలను పట్టించుకోరని కొందరు విశ్లేషకులు అంటున్నారు. ఎలా చూసినా కరోనా వ్యాపిస్తే ఉత్తర కొరియా అల్లకల్లోలం కావాల్సిందే. అందుకే ఈ కరోనా విపత్తు ‘జాతి మనుగడ’కే ముప్పని కిమ్‌ అన్నట్టు సమాచారం. ఇప్పటికైతే అక్కడ ఎలాంటి పాజిటివ్‌ కేసులు లేవని ప్రభుత్వ మీడియా చెప్పింది. ముందు జాగ్రత్తగా కఠిన చర్యలు చేపట్టారని వెల్లడించింది. కరోనా లక్షణాలేంటో ప్రజలకు వివరించింది.

ప్రభుత్వ ఉద్యోగులు రక్షణ దుస్తులు ధరించి బస్సులు, రైళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ఆస్పత్రులు, ప్రజలు సంచరించే ప్రాంతాల్లో రసాయాలను పిచికారీ చేసిన చిత్రాలు బయటకు వచ్చాయి. ఆ దేశ ప్రధాని కిమ్‌ జే ర్యాంగ్‌ మాస్క్‌ ధరించి మహమ్మారి కట్టడి చర్యలు చేయిస్తున్న చిత్రాలూ వైరల్‌ అయ్యాయి. ప్రభుత్వ పనులను చిత్రీకరించి ‘నావెల్‌ కరోనా వైరస్‌ను పూర్తిగా అడ్డుకుందాం’ అని కేసీటీవీ ఓ ప్రత్యేక కార్యక్రమం రూపొందించి ప్రసారం చేసింది. ఏదేమైనప్పటికీ ఒక మహమ్మారిని కట్టడి చేసే శక్తియుక్తులు ఉత్తర కొరియాకు లేవని జాన్‌ హప్‌కిన్స్‌ తన గ్లోబల్‌ హెల్త్‌ సెక్యూరిటీ ఇండెక్స్‌ వెల్లడించడం గమనార్హం.

- ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌

Read latest Explained News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్