Updated : 05 May 2020 18:39 IST

లాక్‌డౌన్‌.. ఏ దేశంలో ఏం జరుగుతోంది?

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో మన దేశంతోపాటు ప్రపంచంలోని చాలా దేశాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. దీని ప్రకారం కాలేజీలు, కార్యాలయాలు, వ్యాపారాలు, దుకాణాలు మూతపడ్డాయి. నిత్యావసరాల దుకాణాలు, కూరగాయల మార్కెట్లు పరిమిత సమయంలో అందుబాటులో ఉంటున్నాయి. అత్యవసర పనులుంటే గానీ ఎవరూ బయటకు రావొద్దంటూ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. దాదాపు అన్ని దేశాల్లో లాక్‌డౌన్‌ అంటే ఇలాగే ఉంటుంది. అయితే కొన్ని దేశాలు లాక్‌డౌన్‌తోపాటు వినూత్న చర్యలు చేపట్టాయి. అవేంటో చూద్దాం పదండి.


రెండు గంటలు మాత్రమే.. అదీ ఒక్కసారే

పనామాలో రెండు వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ముందస్తు జాగ్రత్తగా లాక్‌డౌన్‌ విధించిన అక్కడి ప్రభుత్వం ప్రజలు బయటకు రావడంపై ఆంక్షలు విధించింది. మన దేశ రాజధాని దిల్లీలో సరి-బేసి విధానంలాగా.. లింగ భేదంతో ప్రజలను బయటకు వెళ్లేందుకు అక్కడ అనుమతిస్తున్నారు. స్త్రీలు, పురుషులు వేర్వేరుగా నిర్దేశించిన రోజుల్లో బయటకు వెళ్లాలి. ఒక్కరోజు ఒకేసారి రెండు గంటలు మాత్రమే బయట ఉండే అవకాశముంటుంది. రెండు గంటలు ముగిశాయంటే ఆ రోజు మళ్లీ బయటకు వెళ్లకూడదు. అదే ఆదివారం రోజున ఎవరూ బయటకు రాకూడదని ప్రభుత్వం నిబంధన విధించింది. ఇది వచ్చే బుధవారం నుంచి అమల్లోకి రానుంది.


జాతీయ గుర్తింపు కార్డు చివరి సంఖ్యను బట్టి..

కొలంబియాలో మరో విచిత్ర ఆంక్ష అమలు చేస్తున్నారు. ఆ దేశంలో 1500 మంది కరోనా బారిన పడ్డారు. దేశం నుంచి కరోనాను తరిమికొట్టాలని నిశ్చయించుకున్న కొలంబియా.. ఈ క్రమంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. జాతీయ గుర్తింపు కార్డులో ఉండే సంఖ్యల్లో చివరి సంఖ్య ఆధారంగా ముఖ్యమైన నగరాల్లో ప్రజలను బయటకు వెళ్లడానికి అనుమతిస్తోంది. బరంకాబెర్మెజా నగరంలో ఐడీ నంబర్‌లో చివరి సంఖ్య 0, 7, 4 ఉన్నవాళ్లు సోమవారం రోజున.. 1, 8, 5 ఉన్నవాళ్లు మంగళవారం రోజున బయటకు వెళ్లొచ్చన్నమాట.. బొలివియా దేశంలోనూ ఇలాంటి విధానాన్నే అమలు చేస్తున్నారు.


శునకాల కోసం నిబంధన పెట్టారు.. తీసేశారు

సెర్బియాలో 1600 మందికిపైగా కరోనా బాధితులున్నారు. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నా.. దాదాపు ఆ దేశంలో పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయి. లాక్‌డౌన్‌ విధించిన మొదట్లో శునకాలను వాకింగ్‌ తీసుకెళ్లడంపై ఆ దేశ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సాయంత్రం పూట కాకుండా రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్య మాత్రమే శునకాలను వాకింగ్‌కు తీసుకెళ్లాలని నిబంధన పెట్టింది. దీనిపై శునకాల యజమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. శునకాలను సాయంత్రం పూట బయటకు తీసుకెళ్లకపోతే.. వాటికి మూత్ర సంబంధ వ్యాధులు వస్తాయని, పరిశుభ్రత లోపిస్తుందని పశు వైద్యులు చెబుతున్నారు. దీంతో ఈ ఆంక్షను ప్రభుత్వం ఎత్తేసింది.


యూరప్‌ అంతా ఒకలా.. స్వీడన్‌ మరోలా..

చైనా, అమెరికా తర్వాత యూరప్‌ దేశాలే అత్యధికంగా కరోనా బారిన పడ్డాయి. దీంతో యూరప్‌ ఖండం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంది. స్వీడన్‌ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఆ దేశంలో లాక్‌డౌన్‌ ఉన్నా.. చాలా ఆంక్షలను కుదించారు. అన్ని దేశాలు ఏ ఇద్దరు కలిసి ఉండకూడదంటుంటే.. స్వీడన్‌లో మాత్రం 50 మంది వరకు ఒకే చోట ఉండొచ్చని అంటోంది. 50 మందికి మించి గుమ్మిగూడటాన్ని నిషేధించింది. అదీ కేవలం ఆదివారాలు మాత్రమే. దాదాపు అన్ని దేశాలు విద్యా సంస్థలను మూసివేస్తే.. ఈ దేశంలో మాత్రం 16 ఏళ్ల వయసులోపు విద్యార్థుల కోసం పాఠశాలలను తెరిచే ఉంచారు. పబ్‌లు, రెస్టారెంట్లు తెరిచే ఉంటున్నాయి. దీంతో ప్రజలు ఎప్పటిలాగే సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు.


ఓ సూచన.. ప్రజలకు ఆగ్రహం తెప్పించింది

మలేసియాలో 3500 మందికిపైగా కరోనా సోకి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే అక్కడి ప్రభుత్వం పాక్షికంగానే లాక్‌డౌన్‌ విధించింది. ఈ నేపథ్యంలో కరోనా, క్వారంటైన్‌పై ప్రజలకు అవగాహన, సూచనలు ఇచ్చే క్రమంలో ఆ దేశ మహిళా సంక్షేమ శాఖ ప్రచురించిన ఓ కార్టూన్‌ పోస్టర్‌ వివాదస్పమైంది. ఇళ్లలో ఉండే భార్యలందరూ చక్కగా దుస్తులు ధరించండి.. మేకప్‌ వేసుకోండి.. భర్తలను మాత్రం ఇబ్బందులు పెట్టకండి అంటూ తీసుకొచ్చిన కార్టూన్‌ పోస్టర్‌ ఆన్‌లైన్‌లో వైరల్‌ అయింది. నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రభుత్వం క్షమాపణలు చెప్పింది. పోస్టర్‌ను తొలగించింది. 


ఆరోగ్యంగా ఉన్నా మాస్కులు ధరించాలి

కరోనా విజృంభిస్తున్న సమయంలో ఆసియా దేశాల్లోని ప్రజలు అందరూ మాస్కులు ధరిస్తున్న విషయం తెలిసిందే. అయితే సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వాళ్లు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించడంతో యూరప్‌లో ప్రజలు పెద్దగా మాస్కులు ధరించట్లేదు. చెక్‌ రిపబ్లిక్‌, స్లోవకియా, బోస్నియా అండ్‌ హెర్జోగోవియా, ఆస్ట్రియా దేశాల్లో ఆరోగ్యంగా ఉన్నా మాస్కులు ధరించాల్సిందేనని ప్రభుత్వాలు నిబంధన పెట్టాయి. ఆస్ట్రియాలో ప్రస్తుతం 11వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 


ఏకంగా ఎమర్జెన్సీ విధింపు

హాంగేరిలో కరోనా బాధితుల సంఖ్య వెయ్యికి కూడా చేరలేదు. అయినా ఆ దేశ ప్రభుత్వం అప్రమత్తమై మార్చి 11వ తేదీనే దేశవ్యాప్తంగా నిరవధిక ఎమర్జెన్సీ విధించింది. ఈ సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కరోనాపై తప్పుడు ప్రచారాలు చేసిన వారికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తామని తెలిపింది. కర్ఫ్యూ, క్వారంటైన్‌ను ఉల్లంఘించిన వారికి ఎనిమిదేళ్ల వరకు జైలు శిక్ష విధించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రజలు గుంపులుగా చేరకుండా తమ రోజువారీ విధులు నిర్వర్తించే వెసులుబాటును అధికారులు కల్పించారు. ఉక్రెయిన్‌, చెక్‌ రిపబ్లిక్‌ దేశాలూ కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఎమర్జెన్సీ విధించాయి. 


- ఇంటర్నెట్‌ డెస్క్‌

Read latest Explained News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని