Updated : 13 Apr 2020 15:16 IST

చేతుల శుభ్రత అవసరాన్ని చెప్పిందెవరు?

కరోనా (కొవిడ్‌-19) వైరస్‌ వల్ల పరిశుభ్రతకు ప్రాధాన్యం మరింత పెరిగింది. ఇప్పుడు మనమంతా వైరస్‌ దరిచేరకుండా చేతులను శానిటైజర్లతో శుభ్రం చేసుకుంటున్నాం. సాధారణంగానే భోజనం చేసేముందు.. బయటకు వెళ్లి వచ్చాక చేతులు కడుకుంటాం. శుభ్రం చేసుకోకపోతే చేతుల్లో ఉండే సూక్ష్మక్రిములు శరీరంలో చేరి అనారోగ్యానికి గురవుతామని చిన్నప్పుడు మన పెద్దలు చెప్పేవారు. డాక్టర్లు చెబుతున్నారు. అది నిజమే కానీ.. దాన్ని ఎవరు నిరూపించారు? చేతులపై సూక్ష్మక్రిములను చంపడానికి శానిటైజర్‌ వాడాలని ఎవరు చెప్పారు? ఈ సందేహాలు మీకెప్పుడైన కలిగాయా.. అయితే ఇది చదవండి..

1846లో ఓ డాక్టర్‌కి వచ్చిన ఆలోచనే ఇప్పుడు మనం శానిటైజర్లతో చేతులు శుభ్రంగా కడుక్కోనే అలవాటుకు కారణమైంది. ఆ సమయంలో డాక్టర్‌ ఇగ్నజ్‌ సెమ్మెవైస్‌ ఆస్ట్రియాలోని వియన్నా ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వహించేవారు. అక్కడ రెండు ప్రసూతి వార్డులు ఉండేవి. ఒక దాంట్లో పురుష వైద్యులు, వైద్యవిద్యార్థులు సేవలు అందిస్తుండగా.. మరో వార్డులో నర్సులు, ఆయాలు ఉండేవాళ్లు. అయితే ప్రసూతి కోసం ఆ ఆస్పత్రిలో చేరే చాలా మంది గర్భిణులు పురుడుపోసుకునే సమయంలో మరణించేవారు. ఈ ఘటనలు డాక్టర్‌ ఇగ్నజ్‌ సెమ్మెవైస్‌కు బాధ కలిగించాయి. తన ఆస్పత్రిలో ఒకరికి ప్రాణం పోసే తల్లులు.. ప్రాణాలు కోల్పోవడం అతడిని కదిలించింది. ఎలాగైనా మరణాలకు గల కారణాలను తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆస్పత్రికి సంబంధించిన విషయాలను క్షుణ్ణంగా పరిశీలించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఒక విషయం స్పష్టమైంది. పురుష వైద్యులు, వైద్య విద్యార్థులు ఉన్న వార్డులో మరణాల సంఖ్య ఎక్కువగా, నర్సులు, ఆయాలున్న వార్డులో మరణాల సంఖ్య తక్కువగా ఉండటాన్ని ఇగ్నజ్‌ గమనించారు. ఈ విషయంపై మరింత లోతుగా పరిశోధన చేసిన అతడికి మరో షాకింగ్‌ విషయం తెలిసింది. 

ప్రసూతి వార్డులో ఉండే పురుష వైద్యులు, వైద్య విద్యార్థులు వార్డు పక్కనే ఉండే మార్చురీ భవనంలో పోస్టుమార్టం చేసే బాధ్యతలు కూడా నిర్వర్తించేవారు. అక్కడ మృతదేహాలకు పోస్టుమార్టం చేసి నేరుగా ప్రసూతి వార్డులోకి వచ్చి గర్భిణులకు పురుడు పోసేవారు. పోస్టుమార్టం సమయంలో కత్తులు, మృతదేహాలకు ఉన్న రక్తపు మరకలు, ఇతర సూక్ష్మజీవులు వైద్యుల చేతులకు అంటుకునేవి. వాళ్లు అలాగే గర్భిణులకు పురుడు పోస్తుండటంతో వైద్యుల చేతులకు అంటుకున్న సూక్ష్మజీవులు గర్భిణుల శరీరంలో చేరి ఇన్‌ఫెక్షన్‌ అయ్యేది. ఆ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా గర్భిణులు మృతి చెందేవారు. మరో వార్డులో ఉన్న నర్సులు, ఆయాలు పోస్టుమార్టం, ఆపరేషన్లు లాంటివి చేయరు కాబట్టి ఆ వార్డులో ఉన్న గర్భిణులకు ఇన్‌ఫెక్షన్‌ సోకట్లేదు. తద్వారా అక్కడ మరణాల సంఖ్య చాలా స్వల్పంగా ఉండేది. ఈ విషయాన్ని నిర్ధారించుకున్న ఇగ్నజ్‌ ఆస్పత్రుల్లో పరిశుభ్రతకు నాంది పలికాడు. ఆపరేషన్‌ చేసేముందు వైద్యులు చేతులను క్లోరిన్‌ సొల్యూషన్‌తో శుభ్రంగా కడగాలని నిబంధన పెట్టారు. ఈ నిబంధన పకడ్బందీగా అమలు కావడంతో ఫలితం లభించింది. క్రమంగా ఆ ఆస్పత్రిలో గర్భిణుల మరణాలు తగ్గుముఖం పట్టాయి. చేతుల శుభ్రత, శానిటైజేషన్‌పై ఆయన చేసిన కృషితో రెండేళ్లలో ఆ ఆస్పత్రిలో ఒక్క మరణమూ సంభవించలేదు. అలా చేతులపై సూక్ష్మక్రిముల వల్ల ప్రాణాపాయం ఉంటుందని ఇగ్నజ్‌ నిరూపించడంతోపాటు చేతులను శానిటైజర్లతో శుభ్రపర్చుకోవాలని ప్రపంచానికి చాటాడు. ఈ విషయం కాలకమ్రంలో ప్రజలకు చేరింది. శానిటైజర్ల వాడకం పెరిగింది. 

ఇన్‌ఫెక్షన్‌పై పోరాడి.. ఇన్‌ఫెక్షన్‌తోనే మృతి

పరిశుభ్రత విషయంలో కఠినంగా ఉన్న ఇగ్నజ్‌తో తోటి డాక్టర్లు విసుగుచెందారు. చేతులు శుభ్రంగా లేకపోవడం వల్లే మరణాలు సంభవిస్తున్నాయన్న ఇగ్నజ్‌ వాదనను వ్యతిరేకించారు. తెరవెనుక రాజకీయాలు జరగడంతో ఆయన్ను ఆ ఆస్పత్రి నుంచి డిస్మిస్‌ చేశారు. అయినా ప్రజలకు పరిశుభ్రత గురించి, వైద్యుల నిర్లక్ష్యం గురించి ఇగ్నజ్‌ బహిరంగ లేఖలు రాయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో విమర్శలు, ప్రతివిమర్శలు ఎదుర్కొన్నారు. 1861లో ఇగ్నజ్‌కు నరాల సమస్య వచ్చింది. దీంతో కాస్త విచిత్రంగా ప్రవర్తించేవారు. ఇదంతా చూసిన కుటుంబసభ్యులు, సన్నిహితులంతా ఆయనకు పిచ్చి పట్టిందనుకొని పిచ్చాస్పత్రిలో చేర్పించారు. అక్కడి సిబ్బంది ఆయన్ను కొట్టడంతో చేతులకు గాయమైంది. ఆ గాయం కారణంగా రక్తం ఇన్‌ఫెక్షన్‌ కావడంతో 1865 ఆగస్టు 13న ఇగ్నజ్‌ కన్నుముశారు.

విగ్రహాలు.. సినిమాలు.. నవలలు

ఇగ్నజ్‌ సెమ్మెవైస్‌ కృషిని గుర్తించి హంగేరిలో బుడాపెస్ట్‌ (ఇగ్నజ్‌ స్వస్థలం)లోని సెయింట్‌ రొకూస్‌ ఆస్పత్రి ముందు 1904లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇరాన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ టెహ్రాన్‌లోనూ ఆయన విగ్రహం ఏర్పాటైంది. ఇగ్నజ్‌ జీవితంపై ఏడు సినిమాలు తెరకెక్కాయి. 1938లో ఇగ్నజ్‌పై తీసిన ‘దట్‌ మదర్స్‌ మైట్‌ లైవ్‌’ అనే షార్ట్‌ ఫిలింకు ఆస్కార్‌ లభించింది. ఇగ్నజ్‌ జీవితం ఆధారంగా ‘ది క్రై అండ్‌ ది కొవెనెంట్‌’, ‘మదర్‌ కిల్లర్స్‌’ వంటి పలు నవలు కూడా వచ్చాయి.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Read latest Explained News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని