Updated : 14 Apr 2020 15:18 IST

కరోనా ఆంక్షల తర్వాత ‘సరికొత్త సాధారణం’

సడలిస్తే విఫలమయ్యే అవకాశాలు ఎక్కువ: WHO

మన భవిష్యత్తు కోసం మన అలవాట్లు మార్చుకోక తప్పదు

అనుకోని ఉపద్రవమేదో సంభవించినప్పుడు అందరికీ ఏమనిపిస్తుంది? జీవితం మళ్లీ ఎన్నాళ్లకు సాధారణ స్థితికి చేరుకుంటుందో అనే కదా! ఈ భూ ప్రపంచం ఇప్పటి వరకు ఎన్నో ఉత్పాతాలను చవిచూసింది. రెండు ప్రపంచ యుద్ధాలు, ఆర్థిక మాంద్యాలు, సునామీ తరహా ప్రకృతి విపత్తులను మానవాళి ధైర్యంగా ఎదుర్కొంది. కొన్ని రోజులకు జీవనం మునుపటి స్థాయికి చేరుకుంది.

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. సంఘజీవి అయిన మానవుడిపై లాక్‌డౌన్‌ తరహా ఎన్నో ఆంక్షలకు కారణమైంది. ఆర్థిక వ్యవస్థలను చిధ్రం చేసింది. మనుషుల మధ్య భౌతిక దూరం పెంచింది. ఇంట్లోంచి బయటకు రాకుండా చేసింది. సన్నిహితులతో రాకపోకలు బందు పెట్టింది. ఎప్పుడో అప్పుడు ఈ ఆంక్షలు సడలించక తప్పదు. అయితే గత విపత్తుల తర్వాత ఉన్నట్టు జీవితం వెంటనే మారిపోదట. అసాధారణంగానే ఉండనుంది.


కొమ్ములు విరిచేందుకు

కరోనా వైరస్‌. కంటికి కనిపించని ఈ శత్రువు కొమ్ములు విరిచేందుకు ప్రపంచమంతా ఏకధాటిగా యుద్ధం చేస్తోంది. ప్రభుత్వాలు ఆంక్షలు విధించి ప్రజలను కాపాడుకొంటున్నాయి. వాటిని అమలు చేసేందుకు ప్రభుత్వాధికారులు, పోలీసులు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. విరామమెరుగని వైద్యులు రోగులకు సేవ చేస్తున్నారు. శాస్త్రవేత్తలు, ఫార్మా పరిశ్రమ టీకామందు కనుగొనేందుకు శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నాయి! లాక్‌డౌన్‌ కాలంలో ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. సంస్థల రాబడి తగ్గింది. ఉద్యోగాలు పోతాయన్న భయం మొదలైంది. భర్త, పిల్లలకు సేవచేస్తూ గృహిణులకు భారం పెరిగింది. ఏదేమైనప్పటికీ వైరస్‌ను కట్టడి చేసేందుకు చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం, వ్యక్తిగత దూరం పాటించడం వంటివి అలవాటయ్యాయి. అయితే లాక్‌డౌన్‌ ఆంక్షలు ఎలా సడలించాలి? ఆ తర్వాత సాధారణ జీవితం అసాధారణంగా ఎలా ఉంటుందో ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరించింది.


వ్యూహాత్మకంగా సడలింపు

ఒకేసారి లాక్‌డౌన్‌ ఎత్తివేయొద్దని ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. కొవిడ్‌-19 కేసులు తక్కువగా నమోదవుతున్న దేశాలు ఆంక్షల్ని వ్యూహాత్మకంగా, మెల్లమెల్లగా సడలించాలని తెలిపింది. ఇంకొన్నాళ్లు ఇంట్లోనే ఉండటం మంచిదని వెల్లడించింది. ప్రజలు సుదీర్ఘ కాలం వ్యక్తిగత దూరం పాటించేలా, సబ్బు నీటితో చేతుల్ని తరచూ కడుక్కొనేలా చూడాలంది. ‘దాదాపుగా సగం ప్రపంచం లాక్‌డౌన్‌లో ఉంది. ఎప్పుడెప్పుడు ఆంక్షలు సడలిస్తారా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. పక్కాగా నియంత్రించిన, కేసులు అతిగా నమోదు కాని దేశాలు ఇందుకు పూనుకోవచ్చు. సహనం, నిఘా, అప్రమత్తత మాత్రం ఎప్పటికీ అవసరమే. అన్ని ఆంక్షలూ ఒకేసారి కాకుండా ప్రజలను నిదానంగా ఆర్థిక వ్యవస్థ వైపు మళ్లించడం కీలకం’ అని ఆరోగ్య సంస్థ ప్రతినిధి డాక్టర్‌ మరియా వాన్‌ కెర్‌ఖోవ్‌ అంటున్నారు.


ఈ నిబంధనలకు లోబడే

ఆంక్షలను ఎలా సడలించాలి? లాక్‌డౌన్‌ను ఎలా ఎత్తివేయాలి? అందుకు వేటిని కొలమానంగా తీసుకోవాలి?తదితర మార్గదర్శకాలను అతిత్వరలో విడుదల చేస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ అధానోమ్‌ గెబ్రియేసస్‌ అంటున్నారు. లాక్‌డౌన్‌ సడలించే దేశాలు దిగువ నిబంధనలకు లోబడి ఉండాంటున్నారు.

1) కరోనా వ్యాప్తి నియంత్రణలో ఉండాలి.

2) వైద్య వ్యవస్థకు కొవిడ్‌-19 కేసుల్ని గుర్తించి, పరీక్షించి, ఏకాంతంలోకి పంపించి, చికిత్స చేయలిగే సామర్థ్యం ఉండాలి. బాధితుడు కలిసిన వారందరినీ పట్టుకొని పరీక్షించగలగాలి.

3) ఆస్పత్రులు, నర్సింగ్‌హోమ్స్‌ వంటి కేంద్రాల్లో వైరస్‌ ఎవరికీ సోకుండా చూడాలి.

4) పాఠశాలలు, కార్యాలయాలు, జన సంచారం ఉండే బహిరంగ ప్రదేశాల్లో కట్టడి, నియంత్రణ చేసే వ్యవస్థ ఉండాలి.

5) ప్రమాదాల (రిస్క్‌)ను మేనేజ్‌ చేయగలగాలి.

6) అన్ని వర్గాలకు అవగాహన కల్పించాలి. కొత్త నిబంధనలు పాటించేలా, సాధికారతతో నడుచుకొనేలా చేయాలి.


విఫలమయ్యేది ఇక్కడే

కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు తగ్గినంత మాత్రాన హీనదశను దాటేశామని దేశాలు విశ్వసించొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. నిరంతర నిఘా అవసరమని వెల్లడించింది. లాక్‌డౌన్‌ ఎత్తేసినా వ్యక్తిగత దూరం పాటించడం, చేతులు కడగడం వంటివి సుదీర్ఘ కాలం అనుసరించాలంది. ‘భవిష్యత్తు కోసం మనం మన అలవాట్లు, ప్రవర్తనను మార్చుకోవాలి’ అని డబ్ల్యూహెచ్‌వో అత్యయిక కార్యక్రమ చీఫ్‌ మైకేల్‌ జే రియాన్‌ అంటున్నారు. ఆంక్షలు సడలించినా ఆస్పత్రుల్లో పెంచిన సామర్థ్యాన్ని తగ్గించొద్దని సూచించారు. రక్షణ వస్తువులు, ఐసీయూ పడకలు అలాగే ఉంచాలన్నారు. ‘లాక్‌డౌన్‌ సడలించాక కేసుల్లో ఒక్కసారిగా పెరుగుదలను చూడొచ్చు. లాక్‌డౌన్‌ ఫలితాలను వృథా చేయొద్దు. మనం మరింతగా విఫలమయ్యేది ఇక్కడే. మరింత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇదే’ అని రియాన్‌ పేర్కొన్నారు.

- ఇంటర్నెట్‌డెస్క్‌

Read latest Explained News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని