Updated : 17 Apr 2020 11:18 IST

ప్రయోగం చేయబోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు

కొత్తగా ఏ వ్యాధి సోకినా.. దానికి ఔషధం కనిపెట్టేందుకు వైద్యులు, శాస్త్రవేత్తలు రంగంలోకి దిగుతారు. వ్యాధికి తగిన విరుగుడు కనిపేట్టేందుకు పరిశోధనలు చేస్తారు. ఇందులో భాగంగా ఔషధం పనిచేస్తుందా? లేదా? అని తెలుసుకోవడానికి మొదట ఎలుకలు, కోతులు తదితర జంతువులపై ప్రయోగాలు జరుపుతారు. కానీ, కొందరు శాస్త్రవేత్తలు, డాక్టర్లు తమ మీదే తాము ప్రయోగాలు చేసుకొని ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. వాళ్లెవరు? ఏం చేశారో మీరే చదవండి.

బ్యాక్టీరియాలున్న రసం తాగిన శాస్త్రవేత్త

బవేరియాకు చెందిన రసాయన శాస్త్రవేత్త మ్యాక్స్‌ జోసెఫ్‌ వొన్‌ పెట్టెంకొఫర్‌. పరిశుభ్రతపై ఎంతో కృషి చేసిన ఆయన.. బ్యాక్టీరియా వల్లే వ్యాధులు వస్తాయని నమ్మేవారు కాదు. కలరా వ్యాధిపై పరిశోధన చేసి... విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్లనే వ్యాధి సోకుతుందని రాబర్ట్‌ కోచ్‌ అనే జర్మన్‌ శాస్త్రవేత్త కనుగొన్నారు. అయితే ఆ సిద్ధాంతాన్ని జోసెఫ్‌ నమ్మలేదు. రాబర్ట్‌ కోచ్‌ చెప్పింది తప్పని నిరూపించేందుకు ఓ ప్రయోగం చేశారు. ఆయన ముందే విబ్రియో కలరా బ్యాక్టీరియాలను పెద్ద మొత్తంలో రసంలో కలుపుకొని తాగేశారు జోసెఫ్‌. కడుపులో ఇబ్బంది కలగకూదని రాబర్ట్‌ సలహా మేరకు సోడా కూడా తాగారు. ఆ తర్వాత కలరా లక్షణాలతో జోసెఫ్‌ ఆస్పత్రిలో చేరి వారం పాటు చికిత్స తీసుకున్నారు. ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డారు. అయినా జోసెఫ్‌ కలరాకు బ్యాక్టీరియా కారణం కాదని వాదించడం విడ్డూరం.


ప్రాణాలు పణంగా పెట్టారు

యల్లో ఫీవర్‌ రావడానికి దోమలే కారణమని ఇప్పుడు అందరికి తెలుసు. 1881లో డాక్టర్‌ కార్లోస్‌.. దోమల కారణంగా యల్లో ఫీవర్‌ వస్తుందని తేల్చారు. కానీ దాన్ని మరోసారి నిరూపించేందుకు అమెరికా ఆర్మీకి చెందిన ముగ్గురు డాక్టర్లు సాహసం చేశారు. 1900లో యల్లో ఫీవర్‌పై వాల్టర్‌ రీడ్‌ అనే వైద్య శాస్త్రవేత్త వద్ద జేమ్స్‌ కరోల్‌, అరిస్టైడ్స్‌ అగ్రామోంటె, జెస్సీ లేజర్‌ పరిశోధనలు చేసేవారు. ఈ క్రమంలో దోమల ద్వారానే ఈ జ్వరం వస్తుందని నిరూపించడానికి కరోల్‌, లేజర్‌ దోమలతో కాటు వేయించుకున్నారు. దీంతో ఇద్దరికి యల్లో ఫీవర్‌ వచ్చింది. కొన్ని రోజులకే లేజర్‌ మృతి చెందగా.. కరోల్‌ వ్యాధి నుంచి కోలుకున్నాడు. కానీ ఏడేళ్ల తర్వాత అదే వ్యాధితో కన్నుమూశాడు. వారి త్యాగం వల్లే యల్లో ఫీవర్‌ దోమల వల్ల వస్తుందని నిరూపితమైంది. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఆధారం లభించింది.


తనకు తానే ఆపరేషన్‌ చేసుకొని..

అప్పట్లో ఆపరేషన్‌ చేయాలంటే శరీరం మొత్తానికి మత్తు ఇచ్చేవారు. కానీ శరీరమంతా అనస్తీషియా ఎక్కించాల్సిన అవసరం లేదని నిరూపించాడో వృద్ధ వైద్యుడు. యూఎస్‌లోని పెన్సిల్వేనియాకు చెందిన డాక్టర్‌ ఒనీల్‌ కేన్‌ ఆపరేషన్‌ విధానంలో సంస్కరణలు తీసుకురావాలనుకున్నారు. ఆపరేషన్‌ సమయంలో శరీరమంతా అనస్తీషియా ఇవ్వక్కర్లేదని నిరూపించడం కోసం ఇన్‌ఫెక్షన్‌ వచ్చిన వేలుకు దగ్గర్లో మాత్రమే అనస్తీషియా ఇచ్చి ఆపరేషన్‌ చేయించుకున్నారు. ఆ తర్వాత 1921 ఫిబ్రవరి 15న కడుపు వద్ద అనస్తీషియా ఇచ్చుకొని అపెండెక్స్‌ ఆపరేషన్‌ను విజయవంతంగా చేసుకున్నారు. అప్పుడు ఆయన వయసు 60 ఏళ్లు. పదేళ్ల తర్వాత అంటే 70 ఏళ్ల వయసులోనూ మూడోసారి ఆపరేషన్‌ చేసుకొని 36 గంటల్లో మళ్లీ విధుల్లో చేరారు. ఆపరేషన్‌ విజయవంతమైంది కాబట్టి సరిపోయింది. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రాణాలు పోయేవి.


పునరుజ్జీవనం కల్పించాలనుకున్నాడు.. ప్రాణాలు కోల్పోయాడు

రష్యాకి చెందిన అలెగ్జాండర్‌ బొగ్డానొవ్‌ వైద్యుడే కాదు.. శాస్త్రవేత్త, ఆర్థిక, రాజకీయవేత్త కూడా. రచయితగానూ పేరుంది. అయితే ఆయనకో విచిత్రమైన ఆలోచన వచ్చింది. ముసలివారికి యువకుల రక్తం ఎక్కించి పునరుజ్జీవనం కల్పించాలనుకున్నారు. ఇందుకోసం హిమాటాలజీ అండ్‌ బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌ పేరుతో ఓ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేశారు. యువకుల నుంచి స్వచ్ఛందంగా రక్తం సేకరించడం మొదలుపెట్టారు. అయితే 1924లో ఓ యువకుడి నుంచి సేకరించిన రక్తాన్ని అలెగ్జాండర్‌ తన శరీరంలోకి ఎక్కుంచుకొని ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతికి కారణం ఆ రక్తం ఇచ్చిన యువకుడికి మలేరియా, టీబీ వ్యాధులు ఉండటమేనని తేలింది. అయితే ఆయన ఆత్మహత్య చేసుకోవడానికే అలా చేశారని కొందరు, రక్తంలో ఉండే రకాల గురించి తెలియక అలా జరిగిందని మరికొందరు వాదిస్తుంటారు. 


సాలె పురుగుతో కుట్టించుకున్నారు

కొన్ని రకాల సాలె పురుగులు కుడితే విపరీతమైన నొప్పి పుడుతుంది. కొన్నింటిలో ఉండే విషం మనిషి ప్రాణాలు సైతం తీయగలదని కొందరు.. అంత ప్రమాదకరం కాదని మరికొందరి వాదన. ఈ అంశంపై కొన్ని ప్రయోగాలు జరిపినా ఫలితం రాలేదు. 1933లో అలెన్‌ వాకర్‌ బ్లెయిర్‌ అనే వైద్యశాస్త్ర అధ్యాపకుడు సాలెపురుగు సంగతేంటో తేలుద్దామని నిర్ణయించుకున్నారు. సాలెపురుగు విషం మనిషి ప్రాణాలు తీస్తుందా లేదా తెలుసుకునేందుకు స్వయంగా తానే బ్లాక్‌ విడో స్పైడర్‌ రకానికి చెందిన సాలెపురుగుతో కుట్టించుకున్నారు. ఒక్కసారి కుట్టగానే బ్లెయిర్‌కు తీవ్ర నొప్పి వచ్చింది. రెండోసారి కుట్టించునే సాహసం చేయలేక ప్రయోగాన్ని మధ్యలోనే వదిలేసి ఆస్పత్రిలో చేరారు. రెండ్రోజులపాటు నొప్పితో బాధపడ్డ బ్లెయిర్‌ క్షేమంగానే బయటపడ్డారు. 


బ్యాక్టీరియా కారణమంటే వినలేదు.. తాగి చూపించారు

బెర్రీ మార్షల్‌, ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్‌. మైక్రోబయాలజీ ప్రొఫెసర్‌. రాయల్‌ పెర్త్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న సమయంలో బెర్రీ.. తోటి వైద్యుడు రాబిన్‌ వారెన్‌తో కలిసి హెలికోబాక్టర్‌ పైలోరీ బ్యాక్టీరియాపై పరిశోధనలు జరిపారు. కడుపులో అల్సర్‌, కేన్సర్‌ రావడానికి హె.పైలోరీ బ్యాక్టీరియానే కారణమని నిరూపించే ప్రయత్నం చేశారు. అయితే కడుపులో విడుదలయ్యే రసాయనాలకు బ్యాక్టీరియా బతికే అవకాశమే లేదని ఇతర శాస్త్రవేత్తలు, వైద్యులు వీరి వాదనను కొట్టిపారేశారు. దీంతో తన వాదన వాస్తవమని నిరూపించడం కోసం బెర్రి మార్షల్‌.. హె.పైలోరీ బ్యాక్టీరియాను కలిపిన రసాన్ని తాగేశారు. కొద్ది రోజులకే ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షలు నిర్వహించగా.. బాక్టీరియా కడుపులో స్థిరపడిందని, వాటి వల్లే అల్సర్‌ వచ్చినట్లు గుర్తించారు. ఆ తర్వాత యాంటీ బ్యాక్టీరియా మందులు వేసుకొని బెర్రీ సమస్య నుంచి కోలుకున్నారు. 1984లో బెర్రీ చేసిన ఈ ప్రయోగం వల్ల కడుపులో అల్సర్‌, కేన్సర్‌కు హె.పైలోరీ బ్యాక్టీరియా కారణమని తేలింది. బెర్రీతోపాటు అతని తోటి వైద్యుడు వారెన్‌కు కూడా 2005లో నోబెల్‌ బహుమతి లభించింది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Read latest Explained News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని