Updated : 17 Apr 2020 15:53 IST

‘నకిలీ కరోనా’పై యుద్ధభేరి

ప్రజల్లో అపోహలు పోగొట్టేందుకు కృషి

నకిలీ వార్తలపై 500+ భారతీయ శాస్త్రవేత్తల పోరాటం

కరోనా వైరస్‌ ఎలా సోకుతుంది?మద్యం సేవిస్తే అదేం చేయలేదా? ఏసీ గదుల్లో కొవిడ్‌ సోకుతుందా? ఒకరి నుంచి ఎందరికి సోకుతుంది? ఇటలీలో ఏమైంది? అమెరికాలో ఏం జరగబోతోంది? సోషల్‌ మీడియాలో ఇలాంటి సమాచారం విస్తృతంగా వ్యాపిస్తోంది. ఇందులో 50శాతం నకిలీ సమాచారమే కావడం కలవరపెడుతోంది. ఎంత ప్రయత్నిస్తున్నా దాని వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. అందుకే ఈ నకిలీ కరోనాపై సమర భేరీ మోగించేందుకు ముందుకొచ్చింది ‘500’ యోధుల బృందం. ఇంతకీ వీరేం చేశారంటే..


శాస్త్రవేత్తల స్వచ్ఛంద వేదిక

ఎక్కువ సార్లు సబ్బునీటితో చేతులు శుభ్రం చేసుకోవాలి. చేతులతో ముఖాన్ని తడుముకోవడాన్ని మానేయాలి. ఒకరికొకరు వ్యక్తిగత దూరం పాటించాలి. మాస్క్‌ లేకుండా బయటకు రావొద్దు. ఇవన్నీ పాటిస్తే వైరస్‌తో ఇబ్బంది ఉండదని ప్రభుత్వం, అధికారులు, వైద్యులు ఎంత చెబుతున్నా సోషల్‌ మీడియాలో వ్యాప్తి చెందుతున్న నకిలీ సమాచారంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వుహాన్‌లో ఓ వైద్యుడు ఇలా చేయమని చెప్పారు. ఫలానా మత పెద్ద ఇలా చేస్తే కరోనా మనల్ని ఏమీ చేయలేదని నొక్కి చెప్పారు. ఇవన్నీ సైంటిఫిక్‌ వంటి సందేశాలు నిజమేనేమోనని భ్రమింపజేస్తున్నాయి. వాస్తవంగా వీటి వెనక శాస్త్రీయత ఉందా? లేదా? లేకుంటే ఎలా? వైరస్‌ ఏ రేటుతో వ్యాపిస్తోంది? ప్రజలు ఏం చేయాలి? ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందో సలహాలిస్తోంది ‘కొవిడ్‌-19 భారతీయ శాస్త్రవేత్తల స్పందన బృందం’ (ఐఎస్‌ఆర్‌సీ). ఇది పూర్తిగా స్వచ్ఛందమే.


500+ యోధులు

స్పందనా బృందంలో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు, వైద్యులు, ప్రజా ఆరోగ్య పరిశోధకులు, సైన్స్‌ కమ్యూనికేటర్లు, జర్నలిస్టులు, విద్యార్థులు కలిపి 500+ ఉన్నారు. వీరంతా ఎన్‌సీబీఎస్‌, ఐఐఎస్‌సీ, టీఐఎఫ్‌ఆర్‌, ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌, నిమ్‌హన్స్‌ వంటి ప్రఖ్యాత సంస్థలకు చెందినవారే కావడం గమనార్హం. పాలకులు, వైద్యులు, పోలీసులు, ఇంకా మరెందరో కొవిడ్‌-19పై ప్రత్యక్షంగా పోరు సలుపుతున్నారు. ఈ క్రమంలో సమాజానికి ఏమైనా చేయగలమా అనే సదుద్దేశంతో వీరు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. కృష్ణస్వామి (మధురై కామరాజ్‌ విశ్వవిద్యాలయం- చెన్నై), సంధ్యా కౌశిక (టీఐఎఫ్‌ఆర్‌-ముంబయి), గౌతమ్‌ మేనన్‌ (ఐఎంఎస్‌సీ-చెన్నై), నిరుజ్‌ మోహన్‌ రామానుజన్‌ (ఆస్ట్రోనామికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా), రీతికా సుద్‌ (నిమ్‌హన్స్‌-బెంగళూరు) వంటి శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల చొరవతో ఈ మిషన్‌ ఏర్పాటైంది. సైన్స్‌ ప్రాముఖ్యం, అపోహల నివారణ, భారతీయ భాషల్లోకి అనువాదం, మేథమేటికల్‌ మోడలింగ్‌, యాప్స్‌-టెక్నాలజీ అభివృద్ధి, హార్డ్‌వేర్‌, డిజైన్‌-ఇలస్ట్రేషన్‌, వెబ్‌-మీడియా బృందాలుగా విడిపోయి వీరు పనిచేస్తున్నారు. నకిలీ సమాచారంపై పోరాడుతున్నారు.


ఆధార సహితంగా వివరణ

వైరస్‌ పుట్టుక, వ్యాప్తి, కట్టడి, నివారణపై అందుబాటులో ఉన్న సమాచారంతో నకిలీలపై పోరాడుతున్నామని హోమీబాబా కేంద్రానికి చెందిన సైన్స్‌ కమ్యూనికేటర్‌ అనికెత్‌ సూలె అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తిగా తాను చేయగలిగిన సాయం ఇదేనని పేర్కొన్నారు. నెల రోజుల క్రితమే ఐఎస్‌ఆర్‌సీలో అపోహల నివారణ బృందం మొదలైంది. ప్రస్తుతం రాష్ట్రాలు, దేశవ్యాప్తంగా ఉన్న సమాచారాన్ని వీరు విశ్లేషిస్తున్నారు. అందరికీ సులువుగా అర్థమయ్యే రీతిలో ఆధారాల సహితంగా వివరిస్తున్నారు. వ్యాధి ఎలా సోకుతుంది? ఎలా వ్యాప్తి చెందుతుందో చెప్పేందుకు మేథమేటికల్‌ మోడలింగ్‌ను ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుతం అన్ని బృందాలూ ఆన్‌లైన్‌ ద్వారానే చర్చలు, సంభాషణ కొనసాగిస్తున్నాయి. ‘వైరస్‌ ఎలా సోకుతుందన్నది జీవశాస్త్ర సమస్య. కానీ సమాజంలోని ఎందరికి సోకుతుంది? ఏ స్థాయిలో వ్యాప్తి చెందుతుందో తెలుసుకొనేందుకు మేథమేటికల్‌ మోడలింగ్‌ ఉపయోగపడుతుంది’ అని కంప్యూటేషనల్‌ బయాలజిస్ట్‌ రాహుల్‌ సిద్ధార్థన్‌ అన్నారు.


ప్రభుత్వాలకూ సలహాలు

కొవిడ్‌-19పై విజయం సాధించేందుకు శాస్త్రవేత్తలు, విశ్లేషకులు ఎలా ఆలోచిస్తున్నారు? ఏం చేయాలని భావిస్తున్నారు? తమ చర్చల సారామేంటో ప్రభుత్వానికి ఐఎస్‌ఆర్‌సీ తెలియజేస్తోంది. అట్నుంచి సైతం మంచి స్పందన లభిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు సమాచారాన్ని ఇంగ్లిష్‌ నుంచి హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠి, పంజాబి సహా 16 భాషల్లోకి అనువదిస్తున్నారు. క్లిష్టంగా అనిపించిన విషయాన్ని కొంత హాస్యాన్ని జోడించి వివరిస్తున్నారు. వ్యక్తిగత దూరం, వ్యక్తిగత పరిశుభ్రతపై కథలు రాసి అందులో శాస్త్రీయతను జోడిస్తున్నారు. అందరినీ ఇవన్నీ బాగా ఆకట్టుకుంటున్నాయి. వైరస్‌కు సంబంధించిన శాస్త్రీయ సమాచారాన్ని శాస్త్రవేత్తలు ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పలేకపోవచ్చు. అందుకని భాషా నిపుణులు, సైన్స్‌ కమ్యూనికేటర్లు ఆ పనిని నిర్వరిస్తున్నారు. ప్రస్తుతం ఐఎస్ఆర్‌సీ కృషి మంచి పేరు లభిస్తోంది.

- ఇంటర్నెట్‌డెస్క్‌

Read latest Explained News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని