Updated : 20/04/2020 14:07 IST

కరోనాపై ఆందోళన వద్దు.. అతిగా కొనొద్దు

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్కులు, శానిటైజర్ల వినియోగం పెరిగింది. ఇది మంచి పరిణామమే.. కానీ, కరోనా వ్యాప్తిపై సరైన అవగాహన లేక.. సోషల్‌ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలు చూసి కొందరు అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాధారణ మాస్కులకు బదులు ఎన్‌-95‌ మాస్కులు వాడుతున్నారు.. సొంత వైద్యం, సొంత శానిటైజర్‌ తయారు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికోసం అతిగా ఖర్చు చేస్తున్నారు. కరోనా భయంతో ఇలాంటి వాటిపై ఖర్చులు చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. 

ఎన్‌-95 మాస్కులు సాధారణ వ్యక్తులకు కాదు

కరోనా సోకకుండా మాస్కులు వాడమని ప్రభుత్వం సూచిస్తున్న నేపథ్యంలో సాధారణ ప్రజలు ఎన్-95, సర్జికల్‌ మాస్కులు కొనుక్కొని వాడుతున్నారు. కరోనా సోకిన వారికి చికిత్స అందించే వైద్య సిబ్బందికి ఆ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారికి ఈ మాస్కులు ఎంతో అవసరం. ప్రస్తుతం వీటి ఉత్పత్తి.. సరఫరా చాలా తక్కువగా ఉంది. అందుకే వీటిని వైద్య సిబ్బందికే ఇవ్వడం మంచిది. మనం సాధారణ మాస్కులు, ఇంట్లో తయారు చేసుకున్న మాస్కులు, అవీ సాధ్యం కాకపోతే చేతి రుమాలను వాడితే సరిపోతుంది.

గ్లౌజులు ఎల్లవేళలా అవసరమా...

కరోనా దెబ్బకు మనంతా ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉండిపోయాం. రోజూ చేసిన పనులే చేస్తుంటాం. మరి ఇంట్లో గ్లౌజులు వాడటం ఎందుకు? ఒకవేళ బయటకు వెళ్లి సరుకులు తెచ్చుకునే సమయంలో గ్లౌజులు వాడొచ్చు. అయితే వాటిని రీయూజ్ చేయడం అంత శ్రేయస్కరం కాదు. చేతులకు ఎలా వైరస్‌ అంటుకుంటుందో.. గ్లౌజులకు అలాగే అంటుకుంటుంది. కాబట్టి సర్జికల్‌ గ్లౌజులు వాడకుండా, సింగిల్ యూజ్‌ గ్లౌజ్‌లు వాడటం, ఏదైనా పని చేసినప్పుడు వెంటనే చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవడం మంచిది. వైద్య సిబ్బందికి ఆ గ్లౌజులు తప్పనిసరి. వాటిని వారికే ఉండనిద్దాం.

అవసరానికి మించి కొనొద్దు..

కరోనా సంక్షోభం.. హోం క్వారంటైన్‌ కారణంగా దుకాణాల్లో సరకులు నిండుకుంటాయని, ధరలు పెరుగుతాయని చాలా మంది భ్రమపడి అవసరానికి మించి వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. అందుకే ఏ సూపర్‌ మార్కెట్‌కి వెళ్లినా ఖాళీ అరలు కనిపిస్తున్నాయి. నిజానికి నిత్యావసరాల ఉత్పత్తి.. సరఫరా ఎక్కడా నిలిచిపోలేదు. కాబట్టి మీ అవసరాలకు తగ్గట్టు వస్తువులు కొనుగోలు చేయండి. అవసరం లేకపోయినా.. పడుంటాయిలే అని తెగ కొనేయకుండా... అందరికీ అందుబాటులో ఉండేలా చూడండి. 

శానిటైజర్‌ కొనేముందు జాగ్రత్త

ప్రస్తుతం శానిటైజర్లకు చాలా డిమాండ్‌ ఉంది. దీంతో కొన్ని నకిలీ శానిటైజర్లు మార్కెట్లోకి వస్తున్నాయి. కనీసం 60 శాతం ఇథనాల్‌ లేదా 70 శాతం ఐసోప్రొపైల్‌ లేని శానిటైజర్లు వైరస్‌ను చంపలేవని సెంటర్‌ ఫర్‌ డీసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) చెబుతోంది. అందుకే శానిటైజర్‌ కొనే ముందు ఆల్కాహాల్‌ శాతాన్ని చెక్‌ చేయండి. నకిలీ శానిటైజర్లు కొని ఇబ్బందులు కొని తెచ్చుకోకండి. 

విటమిన్ ట్యాబ్లెట్‌లపై ఆధారపడకండి

కరోనాను ఎదుర్కొనేందుకు కొంతమంది విటమిన్స్‌ ఉన్న మందులను వేసుకుంటున్నారు. వీటితో రోగనిరోధక శక్తి పెరుగుతుందని భావిస్తున్నారు. నిజానికి ఆరోగ్యంగా ఉన్న వారికి ఈ విటమిన్స్‌ ఎలాంటి అదనపు లాభాన్ని చేకూర్చవు. ఇవి కేవలం పౌష్టికాహారం లోపం ఉన్నవారికే ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అనవసరంగా విటమిన్‌ టాబ్లెట్లు మందులు వేసుకోవద్దు. వాటికి బదులు రోగనిరోధక శక్తి పెంచే పండ్లు కొని తినండి. అలాగే కొందరు యాంటీ బయోటిక్స్‌ మందులు వాడుతున్నారు. ఇవి కేవలం బ్యాక్టీరియాలను మాత్రమే చంపుతాయి.. వైరస్‌ని కాదని గుర్తుంచుకోండి.

శుభ్రత కోసం అధిక ఖర్చులొద్దు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరిశుభ్రత పాటించాల్సిన అవసరముంది. అయితే దీనికోసం ప్రత్యేక క్లీనర్స్‌ను కొనాల్సిన పనిలేదు. నిత్యం మనం ఉపయోగించే వస్తువులను సాధారణ క్లీనర్లతోనే శుభ్రపర్చుకోవచ్చు. ముఖ్యంగా తలుపులకు, డ్రాలకు ఉండే హ్యాండిల్స్‌, బ్యాగ్స్‌, వేసుకునే బట్టలు తదితర వస్తువులను ప్రతి రోజు శుభ్రం చేయాలి. 

జుట్టు, ముఖంపై సొంత ప్రయోగాలు వద్దు

లాక్‌డౌన్‌తో సెలూన్‌ షాపులు, బ్యూటీ పార్లర్లు మూతపడ్డాయి. దీంతో హోం క్వారంటైన్‌లో ఉంటున్న చాలా మందికి జుట్టు పెరిగిపోయి, ముఖంలో మెరుపు తగ్గిపోయి ఉండొచ్చు. దీంతో కొంత మంది దుకాణాల్లో దొరికే సాధారణ నూనె, ఫేస్‌ క్రీమ్‌లతో ఇంట్లోనే జుట్టు, ముఖంపై ప్రయోగాలు చేస్తున్నారట. దీనివల్ల లేనిపోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. కాబట్టి లాక్‌డౌన్‌ ఎత్తివేసే వరకు వేచి ఉండండి. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Read latest Explained News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని