Updated : 27/04/2020 14:57 IST

షేక్‌హ్యాండ్స్‌-నమస్కారం-సెల్యూట్‌ ఎలా వచ్చాయ్‌?

కరోనా వైరస్‌ను కట్టడి చేసే క్రమంలో కరచాలనం(షేక్‌ హ్యాండ్‌) చేయడం మానేశాం. షేక్‌ హ్యాండ్స్‌తో ఒకరిని నుంచి మరొకరికి కరోనా వ్యాపించే అవకాశం ఉండటంతో ఆ పద్ధతిని దూరం పెట్టాం. ఇప్పుడు ఎదుటివారిని పలకరించాల్సి వస్తే నమస్కారం పెట్టి పలకరిస్తున్నాం. మనకన్నా ముందుండి కరోనాపై యుద్ధం చేస్తున్న వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులకు మనమంతా సెల్యూట్‌ చేసి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అది సరే.. అసలు షేక్‌హ్యాండ్స్‌, నమస్కారం, సెల్యూట్‌ మనకు ఎలా అలవాటయ్యాయి? వీటికున్న చరిత్రేంటీ? తెలుసుకోవాలని ఉందా? అయితే ఇది చదవండి..

షేక్‌హ్యాండ్స్‌

ఎవరినైనా కలిసినప్పుడు మనం మొదట చేసే పని వారికి షేక్‌హ్యాండ్‌ ఇవ్వడం. ప్రపంచవ్యాప్తంగా అందరికి అలవాటుగా మారిన ఈ సంప్రదాయం.. ఇప్పటిది కాదు. క్రీస్తు పూర్వమే గ్రీక్‌లో ఈ షేక్ ‌హ్యాండ్స్‌ సంస్కృతి మొదలైందని పురాతత్వ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆ కాలం నాటి కొన్ని శిలాఫలకాల ఆధారంగా దీనిని ధ్రువీకరిస్తున్నారు. క్రీ.పూ 4 శతాబ్దంలో లభ్యమైన ఓ శిలా స్తూపంపై త్రాసీస్‌ అనే వీరుడు.. అతడి భార్యకు షేక్‌హ్యాండ్స్‌ ఇచ్చినట్లుగా చెక్కిన చిత్రాలున్నాయి. టర్కీలోని ఓ మ్యూజియంలో ఉన్న క్రీ.పూ 5వ శతాబ్దానికి చెందిన ఓ శిలపై ఇద్దరు సైనికులు కరచాలనం చేస్తున్న చిత్రాలు కనిపిస్తాయి. గ్రీక్‌ పురాణాల ప్రకారం.. షేక్‌హ్యాండ్‌ ఇవ్వడమంటే ఇరువురూ సమానమే అన్న సందేశం ఇవ్వడమట. అలాగే తమ చేతుల్లో ఎలాంటి మారణాయుధాలు లేవని, శాంతిని కోరుకుంటున్నామని చెప్పడం కోసం షేక్‌హ్యాండ్స్‌ ఇచ్చేవారట. క్రీ.శ 17వ శతాబ్దంలో వివాహా వేడుకలో వధూవరులు షేక్‌హ్యాండ్స్‌ ఇచ్చుకుంటే వివాహం జరిగినట్లుగా భావించేవారట.


నమస్కారం

నమస్కారం చేయడం భారత సంస్కృతిలో ఒక భాగం. కేవలం భారత్‌లోనే కాదు.. హిందుత్వ మూలాలు ఉన్న ఆగ్నేయ ఆసియా దేశాల్లోనూ నమస్కారం చేసే సంప్రదాయం ఉంది. నమస్కారం అంటే.. ఈ సమకాలీన యుగంలో ‘మీలోని దైవత్వానికి వందనం’ అని అర్థం. భారతదేశంలోని వివిధ ప్రాంతాలను బట్టి.. నమస్కారం, నమస్తే, నమస్కార్‌ అని అంటుంటారు. ఈ పదాలు సంస్కృతం నుంచి వచ్చాయి. రుగ్వేదంలో పేర్కొన్న ‘నమస్కృత’కు ఆరాధన అని అర్థం. అధర్వణ వేదంలో పేర్కొన్న ‘నమస్కారా’కు భక్తి, ఆరాధన, గౌరవించడం అని అర్థాలున్నాయి. ప్రాచీన కాలంలో నిర్మించిన ఆలయాల్లో కొన్ని విగ్రహాలు నమస్కారం పెట్టిన భంగిమలో కనిపిస్తాయి. అయితే ఈ సమాకాలీన యుగంలో నమస్తేకు మరో అర్థం ఉంది. నమః అంటే వందనం అని, తే అంటే మీకు అని అర్థం. భారతీయులు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు కనుక.. నమస్తే అంటే ‘మీలోని దైవత్వానికి వందనం’ అని అర్థమట. ఇక వీటికి ఆధారాలు గమనిస్తే.. క్రీ.పూ 3000 నుంచి 2000 మధ్య సింధు లోయ నాగరికతపై పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్న సమయంలో నమస్కారం చేసి ఉన్న భంగిమలో ఉన్న అనేక విగ్రహాలను గుర్తించారు. ఈ నమస్కార భంగిమని అంజలి ముద్ర అని పిలుస్తారు. ప్రణమాసన యోగాలో అంజలి ముద్రతో భంగిమ ఉంటుంది. 


సెల్యూట్‌

ఎవరినైనా గొప్పగా గౌరవించాలంటే సెల్యూట్‌ చేస్తాం. సైన్యంలో సెల్యూట్‌ చేసే సంప్రదాయం ఎక్కువగా ఉంటుంది. ఈ సెల్యూట్‌ ఎలా మొదలైందనడానికి చరిత్రకారులు పలు సిద్ధాంతాలను చూపిస్తున్నారు. అవేంటంటే.. ప్రాచీన కాలంలో ఫ్రాన్స్‌ యోధులు ఒకరినొకరు తారసపడినప్పుడు పలకరింపుగా తమ ముఖ కవచాన్ని కుడి చేతితో పైకి జరిపేవారట. అలాగే యోధుల సమావేశాల్లో తన ముఖం చూపించడానికి ముఖ కవచం తీసేవారట. కాలక్రమంలో కవచం జరపడం, తీయడం బదులు కేవలం చేతితో దాన్ని తాకేవారు. అలా సెల్యూట్‌ పెట్టడం మొదలైందని చెబుతున్నారు. 

అమెరికా సైన్యంలోనే సెల్యూట్‌ సంప్రదాయం ప్రారంభమైందని యూఎస్‌ క్వార్టర్‌ మాస్టర్‌ స్కూల్‌ అంటోంది. సైనికులు తమ ఉన్నతాధికారి వచ్చినప్పుడు తమ టోపీని తీసేసేవారట. ఆ తర్వాత బ్రిటన్‌ సైనికులు కూడా తమ ఉన్నతాధికారులను గౌరవించే సమయంలో తమ టోపీ తీసేవారు. కాలక్రమంలో తలపై టోపీని తీయకుండా కేవలం కుడి చేతితో దానిని తాకి వందనం చేసేవారట. అలా అది ప్రస్తుత సెల్యూట్‌గా రూపాంతరం చెందిందని చెబుతున్నారు. 

1745 కాలంలో బ్రిటీష్‌ ఆర్డర్‌ బుక్‌ ప్రకారం.. ఉన్నతాధికారులు వచ్చినప్పుడు సైనికులు తమ టోపీ తీయకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి. రెండు చేతులతో టోపీ వద్ద చప్పట్లు కొట్టి కాస్త వంగి వందనం చేయాలని అధికారులు సూచించారు. రాను రాను.. చప్పట్లు కాస్త కేవలం ఒక్క చేత్తో టోపీని తాకడం ఆ తర్వాత.. ఇప్పటి సెల్యూట్‌గా మారిందని వాదన ఉంది. అలాగే ఆస్ట్రేలియా సైన్యం కూడా టోపీ తీసే పద్ధతిని మానేసి ఒక్క చేత్తో టోపీని తాకి సెల్యూట్‌ చేయడం మొదలుపెట్టారట.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Read latest Explained News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని