ఒలింపిక్స్‌... ఆరోసారి రద్దవుతాయా? 

క్రీడాపోటీల్లో అతిపెద్ద వేదిక ఒలింపిక్స్‌. టోక్యోలో ఈ ఏడాది ఆగస్టులో ఒలింపిక్స్‌ ప్రారంభం కావాల్సి ఉండగా.. కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో జపాన్‌ ప్రభుత్వం వచ్చే ఏడాది జులైలో పోటీలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ ఏడాది ఆఖరుకల్లా

Published : 30 Apr 2020 16:34 IST

క్రీడాపోటీల్లో అతిపెద్ద వేదిక ఒలింపిక్స్‌. టోక్యోలో ఈ ఏడాది ఆగస్టులో ఒలింపిక్స్‌ ప్రారంభం కావాల్సి ఉండగా.. కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో జపాన్‌ ప్రభుత్వం వచ్చే ఏడాది జులైలో పోటీలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ ఏడాది చివరికల్లా కరోనా ప్రభావం తగ్గకపోతే ఒలింపిక్స్‌ రద్దు చేస్తామని టోక్యో గేమ్స్ 2020 అధ్యక్షుడు యోషిరో మోరీ ఇటీవల అన్నారు. ఇలా వేర్వేరు కారణాలతో గతంలోనూ ఒలింపిక్స్‌ రద్దయ్యాయి. ఎప్పుడు, ఎలాగో ఓసారి చూద్దాం!

1916 ఒలింపిక్స్‌

నాలుగో ఒలింపిక్స్‌(1916) జర్మనీలోని బెర్లిన్‌లో జరగాల్సింది. బిడ్స్‌ సమయంలో ఈజిప్ట్‌, నెదర్లాండ్స్‌, బెల్జియం, హంగేరి, యూఎస్‌లను దాటుకొని బెర్లిన్‌లో మహాక్రీడలను జరపడానికి జర్మనీ అవకాశం కొట్టేసింది. అయితే 1914లో ప్రారంభమైన మొదటి ప్రపంచ యుద్ధం కొనసాగుతూనే ఉండటంతో ఆ ఏడాది ఒలింపిక్స్‌ను అధికారులు రద్దు చేశారు. మళ్లీ 20ఏళ్ల తర్వాత అంటే 1936లో బెర్లిన్‌లో ఒలింపిక్స్‌ నిర్వహించారు.

1940 ఒలింపిక్స్‌

పన్నెండో ఒలింపిక్స్‌ జపాన్‌లోని టోక్యోలో 1940 సెప్టెంబర్‌ 21 నుంచి అక్టోబర్‌ 6 వరకు నిర్వహించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే రెండో ప్రపంచ యుద్ధం ఉద్ధృతంగా సాగుతున్న నేపథ్యంలో క్రీడా వేదికను ఫిన్‌లాండ్‌లోని హెల్సింకి ప్రాంతానికి మార్చారు. ఆ తర్వాత కూడా పోటీలను నిర్వహించే అవకాశం లేకపోవడంతో రద్దు చేశారు. అదే ఏడాది జపాన్‌లోనే వింటర్‌ ఒలింపిక్స్‌ నిర్వంహిచాలనుకున్నా.. యుద్ధం కారణంగా రద్దయింది.

1944 ఒలింపిక్స్‌

15వ ఒలింపిక్స్‌(1944)ను లండన్‌లో నిర్వహించాలని అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ (ఐవోసీ) నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్‌ సిద్ధమైంది. కానీ రెండో ప్రపంచయుద్ధం కారణంగా ఈ క్రీడలు రద్దయ్యాయి. అయితే క్రీడాకారులు, క్రీడాభిమానులు నిరుత్సాహపడకూడదని ఐవోసీ ఒలింపిక్స్‌ 15వ వార్షికోత్సవాన్ని వేడుకగా నిర్వహించింది. ఆ ఏడాది నుంచే ఒలింపిక్‌ టార్చ్‌ రీలే ప్రారంభమైంది. అదే ఏడాదిలో ఇటలీలో జరగాల్సిన వింటర్‌ ఒలింపిక్స్‌ కూడా యుద్ధం కారణంగా రద్దయింది. 

2020 ఒలింపిక్స్‌

పై ఒలింపిక్స్‌ అన్నీ ప్రపంచయుద్ధాల కారణంగా రద్దు కాగా.. ఈ సారి క్రీడోత్సవం మాత్రం కరోనా వల్ల వాయిదా పడింది. ప్రపంచవ్యాప్తంగా 2లక్షల మంది ఈ కరోనా వైరస్‌ బారిన పడి మృతి చెందారు. 30లక్షలుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ ఇప్పట్లో అంతం కాకపోతే.. వచ్చే ఏడాది కూడా ఒలింపిక్స్‌ నిర్వహించడం కష్టమే కాదు.. రద్దయ్యే అవకాశాలూ ఉన్నాయి. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని