కరోనా వారియర్స్‌కి అండగా నిలవండిలా..

కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులపై కొందరు వివక్ష చూపిస్తున్నారు. ఇటీవల పలువురు కరోనా వైద్యులను సొంత ఇంట్లోకి కూడా వెళ్లనీయకుండా అపార్ట్‌మెంట్‌ వాసులు అభ్యంతరం చెప్పిన ఘటనలు చూశాం. మరి కొందరు వైద్యులు ఇంటికి వెళ్లకుండా కార్లలో నిద్రిస్తున్న

Published : 02 May 2020 09:56 IST

మన ప్రాణాలు కాపాడేందుకు వారి ప్రాణాలను పణంగా పెడుతున్నారు.

మనం క్షేమంగా ఉండాలని వాళ్లు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.

మనం ఇంట్లో హాయిగా ఉంటే.. వాళ్లు బయట కష్టపడుతున్నారు.

వాళ్లే కరోనా మహమ్మారిపై అలుపెరుగని పోరాటం చేస్తున్న కరోనా వారియర్స్‌. కరోనా సోకిన వారికి చికిత్స అందిస్తున్న వైద్యులు ఒకవైపు, కరోనా సోకకుండా పరిసరాలను శుభ్రపరుస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మరోవైపు.. కరోనా వ్యాప్తి విస్తృతం కాకుండా.. ప్రజలను అప్రమత్తం చేస్తున్న పోలీసులు ఇంకోవైపు. వీరంతా తమ సుఖదుఃఖాలను పక్కనపెట్టి కరోనా కట్టడిలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మరి మనం ఏం చేస్తున్నాం? సమాజం శ్రేయస్సు కోసం వాళ్లు అంత కష్టపడుతుంటే మనమూ మనకు తోచిన విధంగా  సాయం అందించాలిగా.. ఎలా అంటారా? ఇలా చేయండి.

* కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులపై కొందరు వివక్ష చూపిస్తున్నారు. ఇటీవల పలువురు కరోనా వైద్యులను సొంత ఇంట్లోకి కూడా వెళ్లనీయకుండా అపార్ట్‌మెంట్‌ వాసులు అభ్యంతరం చెప్పిన ఘటనలు చూశాం. మరి కొందరు వైద్యులు ఇంటికి వెళ్లకుండా కార్లలో నిద్రిస్తున్న హృదయవిదారక ఘటనలూ చూశాం. మరికొన్ని చోట్ల కరోనా పరీక్షలు చేయడానికి వచ్చిన వైద్యులపై దాడులు జరిగాయి. ప్రాణాలు పోసే వైద్యులకు ఆ పరిస్థితి ఎందుకు? మనం వారికి అండగా నిలవాల్సిన అవసరముంది. వారిపై దాడులు చేయడం.. వివక్ష చూపడం మాని వారికి తోడ్పాటు అందించాలి. వారిని వాళ్ల ఇళ్లకు వెళ్లకుండా అభ్యంతరం చెప్పకండి. వీలైతే ఇంటికి దూరంగా ఉంటున్న వైద్యులను మీ ఇంట్లోనే నిద్రించడానికి చోటు ఇవ్వండి. 

* పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులకూ తగినన్ని మాస్కులు లేక కరోనా ప్రమాదానికి దగ్గరగా ఉంటున్నారనే వార్తలొస్తున్నాయి. ఇప్పటికే చాలామంది మాస్కులను కుట్టి అందిస్తున్నారు. మీకు వీలైతే.. మాస్కులు కొనుగోలు చేసి లేదా.. ఇంట్లోనే మాస్కులు కుట్టి వారికి ఇవ్వండి. ఇప్పటికే మీరు ఎన్‌95 వంటి మాస్కులు కొనుగోలు చేసి ఉంటే.. వాటిని వైద్యులకు ఇచ్చి మీరు సాధారణ మాస్కులు ధరించండం మంచిది.

* వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు కరోనాను తరిమికొట్టడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. వారికి సమయానికి ఆహారం లభించే అవకాశమే లేదు. అందుకే కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆహారం అందజేస్తున్నాయి. వీలైతే మీరూ ఆహారం వండిపెట్టండి. వారి ఆరోగ్యం బాగుండేందుకు పండ్ల రసాలు అందజేయండి. 

* ఒకవేళ మీరు కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులైతే.. స్వచ్ఛందంగా మీ ప్లాస్మాను దానం చేయండి. కరోనా చికిత్సలో భాగంగా రోగులకు ప్లాస్మా థెరపీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదివరకే కరోనా నుంచి కోలుకున్న వారి ప్లాస్మాతో రోగులకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో ప్లాస్మా అవసరం చాలా ఉంది. కాబట్టి ముందుకు రండి.

* సమాజానికి.. కరోనా వారియర్స్‌కు మన వంతుగా చేసే అతిపెద్ద సాయం ఏదైనా ఉందంటే.. అది మనం బయటకు రాకుండా ఇంట్లోనే ఉండటం. అత్యవసరం అయితే తప్ప రోడ్లపైకి రావొద్దు. కరోనా బారిన పడొద్దు... వైరస్‌ వ్యాప్తికి కారణమవొద్దు. బయటకు వచ్చి వారికి తలనొప్పిగా మారడం సబబుకాదు. కాబట్టి ఇంట్లోనే క్షేమంగా ఉండండి.

* మనల్ని కరోనా నుంచి కాపాడటం కోసమే పోలీసులు రోడ్లపై గస్తీ కాస్తున్నారు. వారికి వీలైతే మాటసాయం, నీటి సాయం, ఆహార అందించండి. అంతేకానీ వారికి అపాయం తలపెట్టాలని చూడకండి. పోలీసులపై దాడులు జరిగిన ఘటనలు ఇటీవల కొన్ని చూశాం కూడా. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Read latest Explained News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని