కరోనా శుభ్రత: మరి మంచం సంగతేంటి?

బయటకు వెళ్తే కరోనా సోకకుండా... మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తున్నారు. శానిటైజర్లతో చేతులను శుభ్రంగా కడుగుతున్నారు. అలా పగలంతా ఎంతో జాగ్రత్త ఉంటున్నారు. కానీ రోజులో కనీసం 8 గంటలు మనం మంచంపైనే నిద్రిస్తాం. మరి దాని గురించి ఆలోచించారా? ఓ నివేదిక

Published : 02 May 2020 09:53 IST

బయటకు వెళ్తే కరోనా సోకకుండా... అందరూ మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తున్నారు. శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకుంటున్నారు. అలా పగలంతా ఎంతో జాగ్రత్త ఉంటున్నారు. కానీ రోజులో కనీసం 8 గంటలు మనం మంచంపైనే నిద్రిస్తాం. మరి దాని గురించి ఆలోచించారా? ఓ నివేదిక ప్రకారం.. టాయిలెట్‌ సీట్‌పై ఉండే బ్యాక్టీరియా కంటే.. 17,400 రేట్లు అధికంగా దిండుపై ఉంటాయట. అందుకే మంచాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. మరి మంచాన్ని ఎలా.. ఎప్పుడు శుభ్రపర్చుకోవాలో చూద్దాం.

దిండు కవర్లే.. ప్రమాదకరం

నిద్రిస్తున్న సమయంలో బ్యాక్టీరియాలు, సూక్ష్మక్రిములు మొదట చేరేది దిండుపైకే. కాబట్టి దిండుకు తొడిగే కవర్లను వారానికోసారి కచ్చితంగా ఉతకండి. దీని వల్ల సూక్ష్మక్రిములు నశించడమే కాదు.. శుభ్రమైన దిండుతో హాయిగా నిద్ర పడుతుంది. 

బెడ్‌ షీట్లు.. నిర్లక్ష్యం తగదు

పరుపుపై వేసే బెడ్‌షీట్లపై కూడా సూక్ష్మక్రిములు తిష్ట వేస్తాయి. శరీరంపై చెమట అంతా బెడ్‌షీట్‌కు అంటుకుంటుంది. దీంతో పడుకున్నప్పుడు చిరాకుగా అనిపించొచ్చు. కాబట్టి వాటిని 15 రోజులకోసారి అయినా కచ్చితంగా ఉతకండి.

దుప్పట్లు

పరుపుపై వేసుకునే కంఫర్టర్స్‌, బెడ్‌స్ప్రెడ్స్‌, దుప్పట్లను కనీసం నెలకోసారి ఉతకాలి. ఈ విషయంలో వస్త్రం రకాలను బట్టి, ఆయా కంపెనీల సూచనలను బట్టి ఉతకాల్సి సమయం వేర్వేరుగా ఉండొచ్చు. కానీ నెలకొసారి ఉతకడం తప్పనిసరి.

పరుపు ప్యాడ్స్‌
కొందరు పరుపులకు ప్రత్యేకంగా ప్యాడ్స్‌ ఉపయోగిస్తారు. వాటిని మూడు నెలలకోసారి ఉతకాలి. కాటన్‌, వినైల్‌-బ్యాక్డ్‌ లేదా డౌన్‌ మ్యాట్రెస్‌ ప్యాడ్స్‌ను వాషింగ్‌ మిషన్‌లోనూ ఉతకొచ్చు. 

దిండ్లనూ ఉతకాల్సిందే..
వారానికోసారి దిండు కవర్లను ఉతకడంతో సరిపోదు.. కనీసం ఆరు నెలలకోసారి అయినా దిండును ఉతకాలి. ఉతికి ఆరబెట్టడంతోపాటు దిండును కొంచె వేడి చేయండి. దీని వల్ల దిండులో ఉన్న సూక్ష్మక్రిములు నశిస్తాయి.

పరుపును వదిలేయొద్దు

బెడ్‌షీట్లు వేస్తున్నాం కదా అని పరుపును పట్టించుకోవడం మానేయొద్దు. పరుపును ఆరు నెలలకోసారి శుభ్రం చేయాలి. ఇందుకోసం పరుపును ఆరు బయటకు తీసుకెళ్లి బాగా దులపండి. లేదా వ్యాక్యూమ్‌ క్లీనర్‌తో శుభ్రం చేయొచ్చు. దుర్వాసన, మరకలు పోవాలంటే బేకింగ్‌ సోడా చల్లి ఎండలో ఆరబెట్టండి.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని