Published : 05/05/2020 17:19 IST

..రెక్కలు విచ్చుకొని ఎగరాలంటే!

ప్రయాణికులకు వైద్య ధ్రువపత్రం అవసరం?

ఒకే బ్యాగుకు అనుమతి.. ఇంకా మరెన్నో మార్పులు

కరోనా.. కనిపించని శత్రువు. చైనాలోని వుహాన్‌లో పురుడు పోసుకున్న ఈ వైరస్‌ నేడు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఎందరి జీవితాలనో చిదిమేసింది. ఎన్నో వ్యాపారాలను చిధ్రం చేసింది. కొవిడ్‌-19 కొట్టిన దెబ్బకు రెక్కలు తెగిన పక్షిలా విలవిల్లాడుతోంది విమానయాన పరిశ్రమ. సంస్థలకు ఆదాయం లేదు. ఉద్యోగులకు జీతాల్లేవు. లాక్‌డౌన్‌ ఎత్తేశాక ఈ రంగం ఎన్నో మార్పులను సంతరించుకోనుంది.


ఎంత నష్టం.. ఎంత కష్టం

లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చాక లోహ విహంగాలు రెక్కలు తెగిన పక్షుల్లా మారాయి. గాల్లోకి ఎగరలేదు. కేవలం సరకు రవాణా, ప్రత్యేక విమానాలకు మాత్రమే ప్రభుత్వం అనుమతినిచ్చింది. దేశంలో విమాన ప్రయాణాలు పెరుగుతున్న తరుణంలోనే కరోనా వైరస్‌ ముప్పుగా పరిణమించింది. దీంతో విమానాలన్నీ విమానాశ్రయాల్లోనే నిలిచిపోయాయి. వాస్తవానికి చాలా సంస్థలు రుణాలు తీసుకొనే వ్యాపారాలు చేస్తున్నాయి. ఊహించని రీతిలో ఆదాయం పడిపోవడంతో ఉద్యోగులకు జీతాల చెల్లింపే కష్టంగా మారింది. భారత వైమానిక రంగం జీడీపీకి 72 బిలియన్‌ డాలర్లు అందిస్తుంది. 25% రాబడి తగ్గితే దాదాపు 1.5-2 బిలియన్‌ డాలర్ల మేరకు నష్టపోతుంది. ప్రస్తుత పరిస్థితులు దీన్ని ప్రతిబింబిస్తున్నాయి.


ఇకపై ఒక్క బ్యాగే!

లాక్‌డౌన్‌ ఎత్తేయగానే వైమానిక రంగానికి జవసత్వాలు కల్పించాలని సంస్థలు కంకణం కట్టుకున్నాయి! విమానాల లోపల, విమానాశ్రయంలో, అనుబంధ పరిశ్రమలో విపరీతమైన మార్పులు రానున్నాయి. వైరస్‌ ముప్పు పొంచే ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఇకపై విమానాశ్రయాల్లోకి ప్రవేశించేందుకు, నిష్క్రమించేందుకు వేర్వేరు ద్వారాలు ఉపయోగిస్తారని తెలిసింది. ప్రయాణికులు తమ విమానం ఎగిరేందుకు రెండు, మూడు గంటల ముందే రావాల్సి ఉంటుంది. ఒకరికొకరు కనీసం 1.5మీటర్ల దూరం నిలబడాలి. థర్మల్ స్కానింగ్‌ చేస్తారు. బహుశా ప్రయాణికులకు ఇకపై ఒకే ఒక్క బ్యాగునే అనుమతిస్తారు. ఎక్కువ బ్యాగేజ్‌ ఉంటే వైరస్‌ వ్యాప్తికి అవకాశాలు ఎక్కువని భావిస్తున్నారు.


వైద్య ధ్రువపత్రం తప్పదేమో?

విమానంలో ప్రయాణించాలంటే వైద్య ధ్రువీకరణ పత్రాలు తెమ్మని సంస్థలు అడిగే అవకాశం ఉంది. ఈ అంశంపై అన్ని కంపెనీలు సమాలోచనలు చేస్తున్నాయని తెలిసింది. విమానాశ్రయంలోని రాగానే మాస్క్‌, గ్లోవ్స్‌ అందజేయాలని అనుకుంటున్నాయి. ఆరోగ్యశాఖతో చర్చించి పౌర విమానయాన శాఖ త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేయనుంది. టేకాఫ్‌కు రెండు గంటల ముందే ప్రయాణికులు రావాలని, గంట ముందుగానే సెక్యూరిటీ గేట్లు మూసేయాలని ప్రభుత్వానికి సీఐఎస్ఎఫ్‌ ప్రతిపాదించిందని సమాచారం. సోషల్‌ డిస్టెన్స్‌ కోసం విమానాల్లో ఎకానమీ తరగతిలో సీట్ల మధ్య ఖాళీ వదులుతారని తెలిసింది.


విమానాశ్రయంలోనే క్వారంటైన్‌ కేంద్రం

విమానాశ్రయాల్లోనూ మార్పులు రానున్నాయి. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే దిల్లీ విమానాశ్రయంలో అన్ని బ్యాగులను శానిటైజ్‌ చేసేందుకు అతినీల లోహిత కిరణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఒక టన్నెల్‌ ద్వారా ట్రాలీలన్నీ వెళ్తాయని తెలుస్తోంది. పెద్ద ఎయిర్‌ పోర్టులున్న నగరాల్లోనే ఎక్కువ కేసులు ఉండటంతో జాగ్రత్తలు కఠినంగా తీసుకోవాల్సి ఉంటుంది. దిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌లో ప్రవేశం, నిష్ర్కమణ ద్వారాల వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ తప్పనిసరి. ద్వారాలు, చెకిన్‌ కౌంటర్లు, స్వీయ తనిఖీ కియోస్కులు, సెక్యూరిటీ చెక్‌పాయింట్లు, ఆహార శాలలు, లాంజ్‌, బోర్డింగ్‌ ప్రాంతాల్లో ప్రత్యేకంగా మార్కింగ్‌ చేస్తారు. అందులోనే ప్రయాణికులు నిలబడాలి. ముంబయి విమానాశ్రయంలో ఏకంగా క్వారంటైన్‌ కేంద్రాలే ఏర్పాటు చేశారు. లక్షణాలు కనిపిస్తే అక్కడే ఉంచేస్తారు. ప్రయాణికులను తరలించేందుకు వీలున్నచోట బస్సులు కాకుండా ఎయిరోబ్రిడ్జిలు ఉపయోగిస్తారు. ఇలాంటి మార్పులు ఇంకా మరెన్నో మనం చూడబోతున్నాం!

-ఇంటర్నెట్‌డెస్క్‌

Read latest Explained News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్