ఎయిర్‌లిఫ్ట్ నుంచి వందే భారత్ వరకు..
ఆపరేషన్ వందే భారత్.. కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్. ఏడు రోజుల్లో పలు విమానాలు, ఓడల ద్వారా విదేశాల్లోని భారతీయులను తీసుకురావాలన్నది
ఆపరేషన్ వందే భారత్.. కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్. పలు విమానాలు, ఓడల ద్వారా విదేశాల్లోని భారతీయులను తీసుకురావాలన్నది ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం. ఇప్పటికే తొలి విడతగా కొంతమందిని స్వదేశానికి తీసుకొచ్చిన ప్రభుత్వం రెండో విడత కూడా ప్రారంభించింది. ఇప్పుడే కాదు.. గతంలోనూ వివిధ సందర్భాల్లో విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న భారతీయులను భారత ప్రభుత్వం స్వదేశానికి తీసుకొచ్చింది. ఇందుకోసం పలు ఆపరేషన్లు చేపట్టింది. వాటిలో కొన్ని ముఖ్యమైన వాటి గురించి తెలుసుకుందాం..
1990 ఎయిర్‌లిఫ్ట్
ఆగస్టు 2, 1990.. ఇరాక్ సైనిక బలగాలు కువైట్‌పై దాడి చేశాయి. ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలని భూ ఆక్రమణకు పాల్పడ్డాయి. ఇదే గల్ఫ్ యుద్ధానికి దారి తీసింది. ఈ పోరులో 1.70లక్షల మందికిపైగా భారతీయులు కువైట్‌లో చిక్కుకుపోయారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయపడిపోయారు. దీంతో స్పందించిన భారత ప్రభుత్వం యుద్ధం తీవ్రతరం కాకముందే భారతీయులను స్వదేశానికి రప్పించాలనుకుంది. కావాల్సిన అన్ని అనుమతులు తీసుకోని ‘ఆపరేషన్ ఎయిర్‌లిఫ్ట్’ను ప్రారంభించింది. ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్‌లైన్స్, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన 488 విమానాల్లో భారతీయులను తరలించింది. ఆగస్టు 13న మొదలుపెట్టిన ఈ ఆపరేషన్ అక్టోబర్ 20న ముగిసింది. ఈ ఘటన ఆధారంగా 2016లో బాలీవుడ్‌లో ‘ఎయిర్‌లిఫ్ట్’ చిత్రం తెరకెక్కింది. ఇందులో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించారు.
ఆపరేషన్ సుకూన్
జులై 12, 2006లో లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా మిలిటెంట్ బలగాలు ఇజ్రాయిల్‌లో అక్రమంగా చొరబడి దాడి చేశాయి. కొందరు ఇజ్రాయెల్ సైనికులను చంపి, పలువురిని అదుపులోకి తీసుకొని ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న లెబనీస్ ఖైదీలను విడుదల చేయాలని హెజ్బొల్లా డిమాండ్ చేసింది. దాడికి ప్రతికారంగా ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌పై బాంబులతో దాడి చేసింది. దీంతో యుద్ధం మొదలైంది. అదే సమయంలో పర్యటన నిమిత్తం లెబనాన్‌కు వెళ్లిన పలువురు భారతీయులు సహా అనేక మంది విదేశీయులు యుద్ధ క్షేత్రంలో చిక్కుకుపోయారు. వెంటనే పరిస్థితులను సమీక్షించిన భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సుకూన్’ ప్రారంభించింది. ఓడల ద్వారా లెబనాన్‌లో చిక్కుకున్న వారిని భారత్‌కు తీసుకొచ్చింది. లెబనాన్‌లో శ్రీలంక, నేపాల్‌కు చెందిన వారు కూడా చిక్కుకుపోయారు. అయితే ఆయా దేశాలకు వారి పౌరులు తీసుకొచ్చేంత శక్తి లేక భారత్ సాయం కోరాయి. దీంతో శ్రీలంక, నేపాల్‌కు చెందిన 2,200 మందిని కూడా భారత ప్రభుత్వం స్వదేశాలకు తరలించింది.
ఆపరేషన్ సేఫ్ హోంకమింగ్
2011లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా లిబియాలో ఆందోళనలు మొదలయ్యాయి. ఫిబ్రవరిలో ఆందోళనలు తారస్థాయికి చేరి అంతర్ యుద్ధం మొదలైంది. ఫిబ్రవరి 15న మొదలైన ఈ యుద్ధం అక్టోబర్ 22 వరకు జరిగింది. అయితే యుద్దం కారణంగా లిబియాలో పనిచేస్తున్న 18వేల మంది భారతీయుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎటూ వెళ్లలేక ఆందోళనకు గురయ్యారు. వారిని రక్షించేందుకు భారత ప్రభుత్వం వైమానిక, నేవీ సైన్యం సహాయంతో ‘ఆపరేషన్ సేఫ్ హోంకమింగ్’కు శ్రీకారం చుట్టింది.
మొదట విమానాల ద్వారా తరలింపు చేపట్టాలని భారత్ భావించింది. అయితే లిబియాలోని ఎయిర్‌పోర్టులో రన్‌వేలు ధ్వంసం కావడంతో అది సాధ్యపడలేదు. దీంతో ఫిబ్రవరి 26న ముంబయి నుంచి మూడు ఓడలను లిబియాకు పంపింది. రెండ్రోజుల ప్రయాణం అనంతరం ఓడలు లిబియాలోని బెంగాజీ ప్రాంతానికి చేరుకున్నాయి. ఓడలోని ఛార్టెడ్ షిప్స్ ట్రిపొలి, బెంగాజీ ప్రాంతాల నుంచి భారతీయులను ఈజిప్టులోని అలెగ్జాండ్రియాకు తరలించాయి. అక్కడి నుంచి వారిని విమానాల ద్వారా భారత్‌కు క్షేమంగా తీసుకొచ్చారు. వందల మంది భారతీయులు లిబియా యుద్ధానికి భయపడి దేశ సరిహద్దును దాటి పొరుగు దేశాలకు పారిపోయారు. అక్కడి భారత ఎంబసీకి విషయం చెప్పడంతో ఆయా దేశాల నుంచి వారిని ముంబయికి తరలించారు.
ఆపరేషన్ రాహత్
2015 మార్చి 27న యెమెన్‌పై సౌదీ అరేబియా దాడులకు పాల్పడింది. దీంతో యెమెన్‌లో సైనిక చర్యలు మొదలయ్యాయి. జనవరిలోనే యెమెన్-సౌదీ మధ్య యుద్ధ వాతావరణాన్ని గ్రహించిన భారత ప్రభుత్వం యెమెన్‌లోని భారతీయులు ఆ దేశాన్ని విడిచి వెళ్లాల్సిందిగా సూచన చేసింది. ఫిబ్రవరిలోనూ మరోసారి భారతీయులు ఆ దేశం వదిలి వెళ్లాలని, అలాగే యెమెన్‌కు ఎవరూ వెళ్లకూడదని సూచనలు చేసింది. యెమెన్‌పై సౌదీ దాడిచేసే రెండ్రోజుల ముందు కూడా భారత్ హెచ్చరికలు జారీ చేసినా కొందరు భారతీయులు మాట వినలేదు. ఆ ఇరుదేశాల ఘర్షణతో దాదాపు 5వేల మంది భారతీయులు యెమెన్‌లో చిక్కుకుపోయారు.
దీంతో యెమెన్‌లో చిక్కుకున్న భారతీయులను కాపాడేందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్ రాహత్ మొదలుపెట్టింది. యెమెన్‌లో విమాన రాకపోకలు నిలిపివేయడంతో మొదట నౌకల ద్వారా తరలింపు చేపట్టింది. ఏప్రిల్ 3న విమానాలకు అనుమతి ఇవ్వడంతో యెమెన్‌లోని సనా నుంచి జీబూటికి.. అక్కడి నుంచి ముంబయి, కొచ్చికి భారతీయులను తీసుకొచ్చారు. మొత్తంగా 18 విమానాల్లో 2,900 మందిని.. పలు నౌకల్లో 1,670 మందిని భారత్‌కు తీసుకొచ్చారు. భారతీయులనే కాదు.. దాదాపు 1200 మంది విదేశీయులను కూడా భారత ప్రభుత్వం వారి స్వదేశాలకు పంపింది. అయితే 11 మంది భారతీయులను పాకిస్థాన్ నేవీ కాపాడి కరాచీకి తీసుకెళ్లి.. అక్కడి నుంచి భారత్‌కు పంపడం గమనార్హం.
ఆపరేషన్ మైత్రి
2015 ఏప్రిల్ 25.. నేపాల్‌కు ఓ చీకటి రోజు. భూకంపం ఆ దేశాన్ని వణికించింది. భూకంపం ధాటికి దాదాపు 9వేల మంది మృత్యువాత పడ్డారు. 22వేల మంది గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన వెంటనే భారత్ స్పందించింది. మిత్రదేశమైన నేపాల్‌కు తన వంతు సాయం చేయాలని భావించి ఆపరేషన్ మైత్రి చేపట్టింది. దీనిలో భాగంగా నేపాల్‌కు భారత వాయుసేన విమానాల్లో నిత్యావసర సరకులు, సహాయక చర్యల కోసం సైన్యాన్ని పంపింది. అలాగే నేపాల్‌లో చిక్కుకున్న 43వేల మంది భారతీయులు, పలువురు విదేశీయులను రోడ్డు, విమాన మార్గాల్లో భారత్‌కు తరలించింది. దాదాపు 785 మంది విదేశీయులకు భారత్ నుంచి ట్రాన్సిట్ వీసా ఇప్పించి వారి స్వదేశాలకు పంపించింది.
బ్రస్సెల్స్ ఎయిర్‌లిఫ్ట్
2016 మార్చి 26న బెల్జియంలో ఉగ్రదాడులు చోటుచేసుకున్నాయి. బ్రస్సెల్స్ ఎయిర్‌పోర్టు సహా పలు చోట్ల మూడు ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ ఘటనలో 32 మంది ప్రాణాలు కోల్పోగా.. 300 మందికిపైగా గాయపడ్డారు. అయితే ఘటన జరిగిన ప్రాంతంలో 242 మంది భారతీయులు చిక్కుకున్నారు. అదే సమయంలో అక్కడే ఉన్న భారత్‌కు చెందిన జెట్ ఎయిర్‌వేస్ విమానాలు భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చాయి. వారిలో 28 మంది విమాన సిబ్బంది కూడా ఉన్నారు.
ఆపరేషన్ వందే భారత్
కరోనా.. లాక్‌డౌన్ నేపథ్యంలో అన్ని దేశాలు విమాన ప్రయాణాలను నిలిపివేశాయి. దీంతో అనేకమంది భారతీయులు విదేశాల్లో చిక్కుకుపోయారు. వారందరిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వాయు మార్గంలో ఆపరేషన్ వందే భారత్.. సముద్ర మార్గంలో ఆపరేషన్ సముద్రసేతు మొదలు పెట్టింది. తొలి విడతగా మే 7 నుంచి 14 వరకు 12 దేశాల నుంచి 64 విమానాల్లో 14,800 మంది భారతీయులను ప్రభుత్వం స్వదేశానికి తీసుకొచ్చింది. సముద్ర మార్గంలో 6,527 మందిని తీసుకొచ్చింది. తాజాగా మే 16 నుంచి 22 వరకు రెండో విడత ఆపరేషన్ చేపట్టింది. ఈ విడతలో 31 దేశాల నుంచి 30వేల మంది భారతీయులను భారత్‌కు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 149 విమానాలను వినియోగించనుంది. ఇవే కాదు, అనేక దేశాల్లో.. మన దేశంలోని రాష్ట్రాల్లో ఆపదలో చిక్కుకున్న వారిని రక్షించడానికి ప్రభుత్వం వాయుసేన, నౌకాదళం సాయంతో అనేక ఆపరేషన్లు చేపట్టింది. లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
- ఇంటర్నెట్ డెస్క్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Cm Kcr: రైతులను అన్నివిధాలా ఆదుకుంటాం.. ఎకరాకు రూ.10వేలు పరిహారం: సీఎం కేసీఆర్
-
Movies News
Samantha: అలాంటి పాత్రలో నటించినందుకు ఆనందంగా ఉంది: సమంత
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Sports News
IND vs AUS: సూర్య కుమార్ యాదవ్‌కు రోహిత్ మద్దతు
-
India News
Karnataka: టిప్పు సుల్తాన్‌పై రగులుకొన్న రాజకీయం
-
Movies News
‘ఆడియన్స్ ఈ ప్రశ్న నన్ను అడగలేదు’.. సిద్ధార్థ్‌తో రిలేషన్‌పై విలేకరి ప్రశ్నకు అదితి రియాక్షన్