నీరో నిజంగానే ఫిడేల్‌ వాయించాడా?

‘‘రోమ్‌ తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయించాడట’’ ఓ సమస్య వెంటాడుతుంటే.. దాన్ని పట్టించుకోవడం మానేసిన సందర్భాల్లో ఈ వ్యాఖ్యని ఎక్కువగా వాడుతుంటారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యను కొందరు దేశాధినేతలకు ఆపాదిస్తూ విమర్శలు 

Updated : 02 Jun 2020 17:50 IST

‘‘రోమ్‌ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయించాడట’’ ఓ సమస్య వెంటాడుతుంటే.. దాన్ని పట్టించుకోవడం మానేసిన సందర్భాల్లో ఇలా వ్యాఖ్యానిస్తుంటారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యను కొందరు దేశాధినేతలకు ఆపాదిస్తూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో వైరస్‌ నియంత్రణకు అనేక దేశాలు పటిష్ఠమైన చర్యలు తీసుకుంటుంటే అమెరికా, రష్యా, పాకిస్థాన్‌, చైనా వంటి పలు దేశాలు అసలు మా దేశంలో కరోనా లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాయట. ఆయా దేశాల్లో కేసులు పెరిగి, పౌరులు చనిపోతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయా దేశాధినేతలు డొనాల్డ్‌ ట్రంప్‌, వ్లాదిమిర్‌ పుతిన్‌, ఇమ్రాన్‌ ఖాన్‌, జిన్‌ పింగ్‌.. రోమ్‌ నగరం తగలబడిపోతుంటే ఫిడేల్‌ వాయించిన నీరో చక్రవర్తిలాగా వ్యవహరిస్తున్నారంటూ కొందరు విమర్శిస్తున్నారు. వీరి గురించి అటుంచితే అసలు రోమ్‌ తగలబడుతుంటే నిజంగానే నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయిస్తూ కూర్చొన్నాడా? కాల క్రమంలో ఒక జాతీయంగా మారిపోయిన ఈ వ్యాఖ్యలో నిజమెంతా? ఓ సారి చూద్దాం..

రోమ్‌ రాజ్యం తగలబడటం నిజం.. క్రీస్తుశకం 64 జులై 18 అర్ధరాత్రి చిన్నగా చెలరేగిన మంటలు రోమ్‌ మొత్తం దావానలంలా వ్యాపించాయి. వారంపాటు కొనసాగిన దావానలం రోమ్‌లో ఉన్న 14 జిల్లాల్లో 3 జిల్లాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఏడు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇళ్లు, భవంతులు, పాకలు అన్ని ధ్వంసమయ్యాయి. వందల మంది మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. రోమ్‌లో దాదాపు సగం జనాభా నిరాశ్రయులయ్యారు. రోమ్‌లో ఇంత జరుగుతుంటే నీరో చక్రవర్తి స్పందించలేదని అప్పటి ప్రజలు భావించారు. వారు అలా అనుకోవడంలో తప్పు లేదు. నీరో.. అనేక మంది ప్రాణాలు తీసిన చెడ్డ చక్రవర్తి. ఆయనపై అప్పట్లో ఎవరికీ సదాభిప్రాయం లేదు. దీంతో రోమ్‌ కాలిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయించుకుంటూ కూర్చుకున్నాడు అని అందరూ వ్యంగ్యంగా అనుకున్నారు. 

ఫిడేల్‌ కాదు.. సితార

అయితే రోమ్‌ కాలిపోతున్నప్పుడు నీరో ఏం చేస్తున్నాడనే దానిపై పలు వాదనలు ఉన్నాయి. నిజానికి ఫిడేల్‌ ఆ కాలంలో లేదు. ఇది 11వ శతాబ్దంలో ఆవిష్కరించబడిన సంగీత వాయిద్యం. కాబట్టి నీరో చక్రవర్తి ఫిడేల్‌ను కాదు. సితార వంటి వాయిద్యాన్ని వాయిస్తూ ఉండొచ్చని.. కాలక్రమంలో దాన్ని ఫిడేల్‌గా పలికి ఉంటారని కొందరు చెబుతున్నారు. లేదు.. లేదు నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయించలేదు.. ట్రాయ్‌ (ఇప్పటి టర్కీలోని హిసర్లిక్‌) నగరం కాలిపోవడంపై రచించిన ఓ పాట పాడుతూ కూర్చుకున్నాడు అని మరికొందరు పేర్కొంటున్నారు. మరికొందరైతే నీరో చక్రవర్తే రోమ్‌కు నిప్పంటించాడని, ఇళ్లన్ని నేలమట్టం అయిన తర్వాత తన గోల్డెన్‌ హౌస్‌ (డోమస్‌ అరియా)ను నిర్మించుకున్నాడని వాదించారు. అందుకే ప్రజలు ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ‘రోమ్‌ తగలబడుతుంటే ఫిడేల్‌ వాయిస్తూ కూర్చొన్నాడు’అని వ్యాఖ్యానించేవారట. అయితే అసలు నిజాన్ని ఆధారాలతో నిరూపించలేకపోయినా ఈ జాతీయం మాత్రం జనాల్లో బాగా ప్రాచుర్యం పొందింది.

ఫిడేల్‌ వాయించలేదు.. పాట పాడలేదు

కానీ ప్రముఖ రోమన్‌ చరిత్రకారుడు టాసిటస్‌ చెప్పిన ప్రకారం.. రోమ్‌ తగలబడుతున్నప్పుడు నీరో రోమ్‌కు 35 కి.మీ దూరంలో ఉన్న అంటియమ్‌లోని తన భవంతిలో ఉన్నాడట. అగ్నిప్రమాదం గురించి తెలుసుకొని వెంటనే రోమ్‌కు వెళ్లి సహాయక చర్యల్లో స్వయంగా పాల్గొన్నాడట. మంటలు అదుపులోకి వచ్చాక నిరాశ్రయులైన వారందరికి తన రాజ భవనాల్లో ఆశ్రయం కల్పించాడని టాసిటస్‌ పేర్కొన్నారు. ఫిడేల్‌ వాయించాడు అనడానికి గానీ, పాట పాడాడు అనడానికి గానీ ఎలాంటి సాక్ష్యాలు లేవని టాసిటస్‌ అన్నారు. మంటలకు భవనాలు నేలమట్టమైన ప్రాంతంలో నీరో.. డోమస్‌ అరియా పేరుతో పెద్ద భవన సముదాయాన్ని నిర్మించాడు. రోమ్‌లో ఇప్పటికీ డోమస్‌ అరియా కట్టడం ధ్వసంమైన స్థితిలో కనిపిస్తుంది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు