క్రికెట్లో బంధుప్రీతి ఉంటే సన్నీ కొడుకు ఆడాలి కదా!

జాతీయ, అంతర్జాతీయ క్రికెట్లో బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతానికి ఆస్కారం లేదని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అన్నారు. అలా ఉండుంటే సునీల్‌ గావస్కర్‌ కుమారుడు రోహన్‌, సచిన్‌ తెందూల్కర్‌ కుమారుడు అర్జున్‌ సులువుగా.....

Published : 27 Jun 2020 23:57 IST

అత్యున్నత స్థాయిలో ఆశ్రిత పక్షపాతానికి తావులేదన్న ఆకాశ్‌ చోప్రా

ముంబయి: జాతీయ, అంతర్జాతీయ క్రికెట్లో బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతానికి ఆస్కారం లేదని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అన్నారు. అలా ఉండుంటే సునీల్‌ గావస్కర్‌ కుమారుడు రోహన్‌, సచిన్‌ తెందూల్కర్‌ కుమారుడు అర్జున్‌ సులువుగా భారత జట్లలో చోటు సంపాదించేవారని పేర్కొన్నారు. అండర్‌-15 కన్నా తక్కువ స్థాయిలో ఒకవేళ బంధుప్రీతికి ఆస్కారం ఉండొచ్చని వెల్లడించారు.

‘లేదు, అందుకు అవకాశం లేదు. ఒకసారి సునిల్‌ గావస్కర్‌ కుమారుడు రోహన్‌ గావస్కర్‌ను చూడండి. సన్నీ కొడుకైనందుకు అతడు ఎంతో క్రికెట్‌ ఆడాలి. ఎక్కువ టెస్టులు, వన్డేల్లో అవకాశం రావాలి. కానీ అది కుదర్లేదు’ అని తన యూట్యూబ్‌ ఛానల్లో ఆకాశ్‌ చోప్రా అన్నారు. ‘బెంగాల్‌ తరఫున నిలకడగా రాణించాడు కాబట్టే అతడు జాతీయ జట్టుకు  ఎంపికయ్యాడు. ఇంకా చెప్పాలంటే.. ముంబయి రంజీ జట్టులోనే తన కొడుక్కి సన్నీ చోటివ్వలేదు. గావస్కర్‌ అనే ఇంటి పేరున్నా ముంబయిలో రోహన్‌కు చోటు దొరకలేదు’ అని పేర్కొన్నారు.

సచిన్‌ తెందూల్కర్‌ కుమారుడు అర్జున్‌ గురించీ ఆకాశ్‌ వివరించారు. ‘సచిన్‌ కుమారుడు అర్జున్‌ విషయంలోనూ ఇదే జరిగింది. మాస్టర్‌ కొడుకైనంత మాత్రాన అతడికేమీ ఆయాచితంగా లభించలేదు. టీమ్‌ఇండియాతో యాక్సెస్‌ సైతం సులువుగా దొరకలేదు. ఎంతో కష్టపడితేనే దొరికింది. భారత అండర్‌-19 జట్టులోనూ ఉపయోగం లేని ఎంపికలు ఉండవు’ అని అన్నారు. అయితే సామర్థ్యం లేనప్పటికీ ఓ రాష్ట్ర క్రికెట్‌ సంఘం ప్రతినిధి కుమారుడు జట్టుకు సారథ్యం వహించాడని ఆయన పేర్కొన్నారు. తక్కువ స్థాయి క్రికెట్లో ఆశ్రిత పక్షపాతం బహుశా ఉండే అవకాశం ఉందన్నారు. అత్యున్నత స్థాయిలో మాత్రం ఆస్కారం లేదన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు