ఈ యాప్స్‌.. కాలర్‌ట్యూన్స్‌ కోసమే

ఇప్పుడు ఎవరికి ఫోన్‌ చేసిన రింగింగ్‌కు బదులు‘‘గుర్తుంచుకోండి మనం పోరాడాల్సింది వ్యాధితో కానీ రోగితో కాదు అంటూ’’కరోనాపై అవగాహన కల్పించే ఓ వాయిస్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం కాలర్‌ ట్యూన్‌ పెట్టుకోని వారందరికి ఈ కరోనా ట్యూనే వినిస్తోంది. కరోనా వ్యాప్తి విస్తృతమవుతున్న నేపథ్యంలో

Updated : 28 Aug 2020 12:41 IST

‘‘గుర్తుంచుకోండి మనం పోరాడాల్సింది వ్యాధితో కానీ రోగితో కాదు’’

ఇప్పుడు ఎవరికి ఫోన్‌ చేసినా రింగ్‌టోన్‌కు బదులు ఈ కరోనాపై అవగాహన వాయిసే‌ వినిపిస్తోంది. కాలర్‌ ట్యూన్‌ పెట్టుకోని వారికి ఫోన్ చేస్తే ఈ మాటలు వినాల్సిందే. కరోనా వ్యాప్తి విస్తృతమవుతున్న నేపథ్యంలో అవగాహన కోసం ఇలా చేయడం మంచిదే కానీ తరచూ ఇది వినపడతుంటే విసుగొచ్చేస్తుంది. దీంతో కొత్తగా కాలర్‌ ట్యూన్‌ పెట్టుకోవాలని చాలా మంది భావిస్తున్నారు. మీరూ అలానే అనుకుంటున్నారా? అయితే ఈ కథనం చదివేయండి... కాలర్‌ ట్యూన్‌ పెట్టేసుకోండి. అదీ ఉచితంగానే!

ఒకప్పుడు మొబైల్‌ నెట్‌వర్క్‌ సంస్థే కాల్‌ చేసి ఈ పాట కావాలా? ఆ పాట కావాలా? అంటూ వినిపించి.. నచ్చిన దాన్ని కాలర్‌ ట్యూన్‌గా సెట్‌ చేసేది. ఇప్పుడు అలాంటి కాల్స్ ‌రావడం దాదాపుగా తగ్గిపోయాయి. డిజిటల్‌ యుగంలో మొబైల్‌ నెటవర్క్స్‌ సంస్థలు సొంతంగా మ్యూజిక్‌ యాప్స్‌ను తీసుకొచ్చి.. ఆ యాప్‌లో నచ్చిన పాటను కాలర్‌ట్యూన్స్‌గా సెట్‌ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఆ యాప్స్‌ ఇవీ..


జియో సావన్‌

నచ్చిన పాటని స్వయంగా యూజరే కాలర్ ‌ట్యూన్‌గా సెట్‌ చేసుకునేలా జియో సావన్‌ ఉపయోగపడుతుంది. ఇందులో దేశీయ, విదేశీ పాటలతో సహా సుమారు ఐదు కోట్లకుపైగా పాటలున్నాయి. అలాగే జియో ట్యూన్స్‌ విభాగంలో వినియోగదారుల కోసం ప్రత్యేకంగా లిస్ట్‌లు ఉంటాయి. వాటిలో నచ్చిన పాటని కాలర్‌ట్యూన్‌గా మార్చుకోవచ్చు. ఆ లిస్ట్‌లోనివే కాదు.. యాప్‌లోని చాలా పాటలను కాలర్‌ట్యూన్‌గా మార్చుకోవచ్చు. సెట్‌ చేసిన వెంటనే కాలర్‌ట్యూన్‌గా మారిపోతుంది. జియో యూజర్లకు ఈ సేవలు పూర్తిగా ఉచితం. ఈ యాప్‌ను ప్రస్తుతం 10 కోట్లకు మందికిపైగా యూజర్లు వాడుతున్నారు.


వింక్‌ మ్యూజిక్‌

ఎయిర్‌టెల్‌కు చెందిన వింక్‌ యాప్‌ కూడా మ్యూజిక్‌ యాపే. ఇందులో 60 లక్షలకుపైగా పాటలున్నాయి. వాటిలో నచ్చిన పాటని ఎయిర్‌టెల్‌ కాలర్‌ట్యూన్‌గా మార్చుకోవచ్చు. ఇందుకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఉచితంగానే ఈ కాలర్‌ ట్యూన్‌సేవల్ని పొందొచ్చు. ఈ యాప్‌కి సైతం 10 కోట్లమందికిపైగానే యూజర్లు ఉన్నారు. 


ఐడియా డయలర్‌ ట్యూన్స్‌

ఐడియా డయలర్‌ ట్యూన్స్.. ఐడియా-వొడాఫోన్‌ రూపొందించిన యాప్‌ ఇది. ఈ యాప్‌లో 14 లక్షల కాలర్‌ ట్యూన్స్‌ ఉన్నాయి. వీటిలో దేన్నైనా యూజర్‌ కాలర్‌ ట్యూన్‌గా సెట్‌ చేసుకోవచ్చు. ఒక్కో కాంటాక్ట్‌కి ఒక్కో కాలర్‌ట్యూన్‌ని కూడా పెట్టుకోవచ్చు. మీ పేరుతో కాలర్‌ట్యూన్‌ను పెట్టుకునే సదుపాయం ఉండటం ఈ యాప్‌ ప్రత్యేకత. ఉదాహరణకు కాలర్‌ ట్యూన్‌ సెట్టింగ్‌లో ఆనంద్‌ అని పేరును చేరిస్తే.. ఎవరైనా కాల్‌ చేసినప్పుడు ‘‘ఆనంద్‌కు కాల్‌ చేసినందుకు ధన్యవాదాలు. కాల్‌ లిఫ్ట్‌ చేసే వరకు దయచేసి వేచి ఉండండి’’ అనే వాయిస్‌ వస్తుంది. ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా కాల్‌ చేస్తే వారికి వెయిటింగ్‌ సమయంలోనూ మీకు నచ్చిన పాటను వినిపించొచ్చు. ఈ యాప్‌ను 10లక్షలకుపైగా యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 


వొడాఫోన్‌ కాలర్‌ట్యూన్స్‌

వొడాఫోన్‌ వినియోగదారుల కోసం ఆ సంస్థ తీసుకొచ్చిన యాప్ వొడాఫోన్‌ కాలర్‌ ట్యూన్స్‌‌. ఈ యాప్‌లో ఉన్న లక్షలాది పాటల్లో నచ్చిన పాటని వొడాఫోన్‌ యూజర్లు తమ కాలర్‌ట్యూన్‌గా సెట్‌ చేసుకోవచ్చు. మీ పేరును జత చేసి కూడా కాలర్ ‌ట్యూన్‌గా మార్చుకోవచ్చు. అంతేకాదు.. జోక్స్‌, సినిమా డైలాగ్స్‌, క్లాసికల్‌ సంగీతాన్ని కూడా కాలర్‌ట్యూన్‌గా సెట్‌చేసుకోవచ్చు. మీరు ఆఫీస్‌ పనిలో ఉన్నా.. మీటింగ్‌, ప్రయాణం తదితర పనుల్లో బిజీగా ఉన్నా వాటికి తగ్గ కాలర్‌ట్యూన్స్‌ ఈ యాప్‌లో ఉన్నాయి. మీ పనిని బట్టి ఆ ట్యూన్‌ పెట్టుకుంటే కాలర్‌కు మీరు కాల్‌ లిఫ్ట్‌ చేయకపోవడానికి కారణాన్ని ఈ కాలర్‌ట్యూన్‌ తెలుపుతుందన్నమాట. ముందుగానే మొబైల్‌ క్యాలెండర్‌లో షెడ్యూల్‌ పెట్టుకొని ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చు. ప్రస్తుతం ఈ యాప్‌కి 50 లక్షలకుపైగా యూజర్లు ఉన్నారు. 


మై బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్యూన్స్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారుల కోసం మై బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్యూన్స్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ ద్వారా యూజర్లు ఎక్కడైనా.. ఎప్పుడైనా.. ఎన్ని కాలర్ ‌ట్యూన్స్‌నైనా మార్చుకోవచ్చు. సినిమా డైలాగులు, మీ పేరును కూడా కాలర్‌ట్యూన్‌గా పెట్టుకోవచ్చు. ఒక్కో కాంటాక్ట్‌కి ఒక్కో కాలర్‌ ట్యూన్‌ కేటాయించుకోవచ్చు. అలాగే ఈ యాప్‌ను మ్యూజిక్‌ యాప్‌గానూ ఉపయోగించుకోవచ్చు. 14 లక్షలకుపైగా పాటలు ఈ యాప్‌లో ఉన్నాయి. ఈ యాప్‌ కేవలం కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, బిహార్‌, ఝార్ఖండ్‌, ఒడిశా, అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌, నాగాలాండ్‌, మిజోరం, మణిపూర్‌, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, అండమాన్‌ నికోబార్‌, లక్షద్వీప్‌లలో బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. 


- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని