
అతికించాల్సిన దానితో కుట్టేసింది!
డక్ట్ టేప్ తెలుసుగా.. కార్టన్ బాక్స్‌లు, వస్తువులను ప్యాకింగ్ చేయడానికి వాడుతుంటాం. అతికించేటప్పుడు పర్ పర్ అని సౌండ్... చేతికి అతుక్కుపోయి ఒక్కోసారి చిరాకు కూడా పెడుతుంటుంది. అయితే ఇది అందరూ చేసే పని, అందరికీ జరిగే విషయం. మరి క్రియేటివిటీ పీక్స్‌లో ఉన్నవాళ్లు ఏం చేస్తారంటే.. ఇలా చేస్తారు!
అమెరికాలోని ఇల్లినాయిస్కు చెందిన ఈ 18 ఏళ్ల పీటన్ మాంకర్ తన సృజనకు పని చెప్పింది. 16 రోజులు కష్టపడి 41 డక్ట్ టేప్‌లను ఉపయోగించి ఆకర్షణీయమైన డ్రెస్ కుట్టింది. ఇటీవల ఆ డ్రెస్ వేసుకొని ఆమె దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ డ్రెస్‌పై ప్రస్తుత కరోనా పరిస్థితులకు అద్దం పట్టేలా పీటన్ పెయింటింగ్ వేయడం విశేషం. ఫ్రంట్ లైన్ వారియర్స్, మాస్క్ ధరించిన వ్యక్తి, ప్రజలు వైరస్ నుంచి తప్పించుకొని పారిపోతున్నట్లు, ఓ వ్యక్తికి ఏం చేయాలో తెలియక అయోమయంలో పడినట్లుగా ఉండే పెయింటింగ్స్ మనల్ని ఆలోచింపజేస్తాయి. డ్రెస్‌పై తన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో విద్యార్థులంతా పాల్గొన్నట్టుగా ఉన్న పెయింటింగ్ కూడా ఉంది.
పీటన్ చదువుకుంటున్న కాలేజీ యాజమాన్యం గ్రాడ్యుయేషన్ కార్యక్రమం కోసం జనవరిలో డ్రెస్ పోటీలు పెట్టారు. గెలిచిన వారికి 10 వేల డాలర్ల స్కాలర్షిప్ ఇస్తామని ప్రకటించారు. దీంతో ఆమె లియొనార్డో డావిన్సీని ప్రతిబింబించే దుస్తులు రూపొందించాలని భావించిందట. ఆ తర్వాత నిర్ణయం మార్చుకుంది. అమెరికాకూ కరోనా వైరస్ వ్యాపించి.. పరిస్థితులు తలకిందులైన నేపథ్యంలో కరోనా థీమ్‌తోనే డ్రెస్‌లను రూపొందించాలని నిర్ణయించుకుంది. కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా కాలేజీ యాజమాన్యం ఫ్యాషన్ డ్రెస్ పోటీలనీ, గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్నీ రద్దు చేసింది.
కార్యక్రమం రద్దైనా పీటన్ ఆగిపోలేదు. పోటీ కోసం కాకపోయినా, ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించొచ్చనే ఉద్దేశంతో ఆ థీమ్‌లోనే డ్రెస్ కుట్టడం పూర్తి చేసింది. ఒకవేళ మళ్లీ పోటీ నిర్వహిస్తే.. అందులో తను నగదు గెలుచుకుంటే చదువుకే ఖర్చు చేస్తానని పీటన్ చెబుతోంది. ఇటీవల పీటన్ తల్లి ఆ డ్రెస్‌ను సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో ఆ ఫొటోలు, డ్రెస్ వైరలయ్యాయి. ఇప్పటికే ఆ డ్రెస్ ఫొటోల పోస్టును 2.5 లక్షల మంది షేర్ చేశారు.
- ఇంటర్నెట్ డెస్క్