Reverse Death: అంత్యక్రియలొద్దు.. మాకివ్వండి.. ఏదో ఒక రోజు ప్రాణం పోస్తాం..!

వైద్య రంగం సాంకేతికంగా ఎంతో వృద్ధి చెందుతోన్న నేపథ్యంలో చనిపోయిన వారికి భవిష్యత్తులో ప్రాణం పోసే (Resurrect Humans) అవకాశాలు లేకపోలేదని జర్మనీకి చెందిన ఓ సంస్థ చెబుతోంది. ఈ క్రమంలో క్రయోప్రిజర్వేషన్‌ (Cryopreservation) పద్ధతిలో ఇప్పటికే పది మృతదేహాలను భద్రపరచినట్లు పేర్కొంది.

Published : 09 Feb 2023 18:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చనిపోయిన వారికి పునర్జన్మ అనే మాట వింటూనే ఉంటాం. కానీ, శాస్త్రీయంగా అది సాధ్యం కాదని వైద్యరంగం శాస్త్రీయ ఆధారాలతో రుజువు చేస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో చనిపోయిన వారికి పునర్జన్మ (Resurrect Humans) కల్పించడంపై ఓ జర్మన్‌ వైద్య బృందం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం కొన్ని మృతదేహాలను అత్యంత శీతల వాతావరణంలో (Cryopreservation) భద్రపరుస్తోంది. భవిష్యత్‌లో వైద్య విజ్ఞానం మరింత అభివృద్ధి చెంది వ్యక్తుల మరణానికి గల కారణం తెలుసుకొని, చికిత్స చేస్తే  వారిని మళ్లీ బతికించవచ్చని చెప్పడంతో వందల సంఖ్యలో దాతలు క్యూ కడుతున్నట్లు సమాచారం.

వైద్యరంగంపై ఆశలు..

ప్రాణం పోయిన తర్వాత అవయవాలను తిరిగి పునరుద్ధరించడం వంటి పరిశోధనలు అమెరికా, ఐరోపా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఇందుకోసం మృతదేహాలను దానం చేయడం ఐరోపాలో క్రమంగా పెరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. జర్మనీలోని బెర్లిన్‌కు చెందిన టుమారో బయోస్టాసిస్‌ (Tomorrow Biostasis) స్టార్టప్‌ సంస్థ కూడా ఇదే చేస్తోంది. వైద్య రంగంలో సాంకేతికత అభివృద్ధి చెందుతోన్న నేపథ్యంలో భవిష్యత్తులో పరిశోధనలు ఫలిస్తే.. ఇలా భద్రపరచిన మృతదేహాలకు ఏదో ఒకరోజు పునర్జన్మ కల్పించడం సాధ్యమని చెబుతోంది. ఈ క్రమంలో వైద్య రంగంలో పురోగతి సాధించిన తర్వాత వారి మరణానికి కారణాలకు అనుగుణంగా చికిత్స చేసి తిరిగి మునుపటిలా జీవించేలా చేయాలన్నది తమ ప్రయత్నమని పేర్కొంది. ఇందుకోసం మృతదేహాలను అత్యంత శీతల వాతావరణం ఉండే క్రయోప్రిజర్వేషన్‌ పద్ధతిలో భద్రపరుస్తోంది.

పెరుగుతోన్న దాతలు..

సుదీర్ఘ కాలం నిల్వ చేసేందుకు స్విట్జర్లాండ్‌లోని రాఫ్జ్‌ పట్టణంలోని ఉన్న యూరోపియన్‌ బయోస్టాసిస్‌ ఫౌండేషన్‌కు తరలిస్తోంది. శిక్షణ, పరిశోధన కోసం ఇప్పటికే పది మృతదేహాలను క్రయోప్రిజర్వేషన్‌ విధానంలో భద్రపరచినట్లు సంస్థ ప్రతినిధి కెండ్‌జయోరా పేర్కొన్నారు. ఇంకా వందల మంది వెయిటింగ్‌ లిస్టులో ఉన్నారని.. తమ క్లయింట్లలో సరాసరి 36ఏళ్ల వయసున్న వారే ఎక్కువని చెప్పారు. వీరిలో మెదడును భద్రపరచుకోవాలనుకునే వారి సంఖ్య అధికంగా ఉంటోందని.. భవిష్యత్తులో 3డీ ప్రింటెడ్‌ శరీరాన్ని రూపొందించడంలో ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు వెల్లడించారు.

ఏమిటీ క్రయోప్రిజర్వేషన్‌..?

శరీర అవయవాలను తిరిగి ఉపయోగించేందుకు వీలుగా అతిశీతల ఉష్ణోగ్రతల వద్ద భద్రపరిచే విధానాన్ని క్రయోప్రిజర్వేషన్‌గా వ్యవహరిస్తారు. క్రయోప్రిజర్వేషన్‌ విధానంలో కణాలు, కణజాలంతోపాటు మెదడును కూడా భద్రపరచడం సాధ్యమే. అవయవాలను తొలుత మైనస్‌ 196 డిగ్రీల సెల్సియస్‌ వద్ద చల్లబరుస్తారు. అనంతరం ద్రవ నైట్రోజెన్‌తో కూడిన ఇన్సులేటెడ్‌ ట్యాంకులో ఉంచి భద్రపరుస్తారు. అవసరమైనప్పుడు వాటిని వినియోగించడం లేదా పరిశోధనకు ఉపయోగిస్తారు. అయితే, ఈ విధానంలో శరీర అవయవాలను భద్రపరచడం సాధ్యమే అయినప్పటికీ.. జీవంలేని అవయవాలను ఎలా పునరుద్ధరిస్తారనే విషయంపై స్పష్టత లేదు. అంతేకాకుండా మృతదేహానికి తిరిగి ప్రాణం పోయడమనే విషయంపైనా సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు