Published : 15/11/2021 18:55 IST

Isolation: నెలల తరబడి ఐసొలేషన్‌ వాళ్లకు అలవాటే!

కరోనా పెట్టిన కష్టాల నుంచి ప్రజలంతా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కొవిడ్ ఆంక్షలు ఒక్కొక్కటిగా ఎత్తివేస్తుండటంతో మునపటి జీవితంలోకి అడుగులు వేస్తున్నారు. అయితే, కరోనా కాలపు జ్ఞాపకాలు, అనుభవించిన క్షోభ ఇప్పటికీ ప్రజలను వెంటాడుతోంది. ముఖ్యంగా కరోనా సోకినా.. లక్షణాలు కనిపించినా 14 రోజులపాటు క్వారంటైన్‌/ఐసోలేషన్‌లో ఉండాలన్న నిబంధన.. ప్రజలను తీవ్ర మానసిక ఒతిళ్లకు గురిచేసింది. ఉరుకుల పరుగుల జీవితంలో ఇంట్లో కంటే బయటే ఎక్కువ సమయం గడిపే ప్రజలు.. ఒక గదిలో ఎవరితోనూ కలవకుండా ఏకాంతంగా 14 రోజులు ఉండటానికి చాలా కష్టపడ్డారు. ఐసొలేషన్‌లో ఉండలేక మానసికంగా కుంగిపోయారు. కానీ జపాన్‌లో వేలాది మంది రోజులు కాదు.. నెలలు, సంవత్సరాల తరబడి ఐసొలేషన్‌లో ఉండేందుకు ఇష్టపడుతుంటారు. ఇలా రోజుల తరబడి ఐసోలేషన్‌లో ఉండటాన్ని జపాన్‌లో ‘హికికోమోరి’ అంటారు.

జపాన్‌కు చెందిన నిటో సౌజీ గత పదేళ్లుగా హోం ఐసోలేషన్‌లోనే ఉంటున్నాడు. ప్రతి రెండుమూడు నెలలకోసారి బయటకు వెళ్లి జుట్టు కత్తిరించుకుని, ఇతర వ్యక్తిగత అవసరాలు తీర్చుకొని, తిరిగి తన గదిలోకి వచ్చేస్తాడు. ఆహారాన్ని ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసుకుంటున్నాడు. ఇటీవల అతడి గురించి వార్తలు రావడంతో ‘హికికోమోరి’ మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది.

హికికోమోరి అంటే..

హికికోమోరి అంటే.. సమాజానికి, మనుషులకు దూరంగా.. ఎవరితో మాట్లాడకుండా ఏకాంతంగా ఓ గదిలో ఉండిపోవడం. జపాన్‌లో చాలామంది, ముఖ్యంగా యువకులు అంతర్ముఖులుగానే ఉంటారు. దీంతో బయటకు వెళ్లాలన్నా, ఇతరులతో కలివిడిగా ఉండాలన్నా ఇబ్బంది పడుతుంటారు. అందుకే విద్యాలయాలకు, ఉద్యోగాలకు వెళ్లడానికి భయపడి ఇంట్లోనే ఒక గదిలో ఐసొలేషన్‌లో ఉండిపోతున్నారు. నెలలు, సంవత్సరాలపాటు ఏకాంతంగా గడిపేస్తున్నారు. 

ఆందోళనకరంగా మారుతోన్న పరిస్థితి

జపాన్‌ వ్యాప్తంగా ఇలా హికికోమోరిలో ఉన్న యువత సంఖ్య 5 లక్షల పైనే ఉంటుందని ప్రభుత్వం అంచనా. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాల్లోని అబ్బాయిలు ఇల్లు విడిచి బయటకు వెళ్లడానికి నిరాకరిస్తున్నారు. ఒకట్రెండు సార్లు బయటకు వెళ్లినప్పుడు వారికెదురైన అనుభవాలు మరోసారి బయటకి వెళ్లకుండా చేస్తున్నాయట. దీంతో ఎవరినీ కలవకుండా ఒక గదిలో కనీసం ఆరు నెలలపాటు ఉండిపోతున్నారట.

ఐసొలేషన్‌తో మానసిక రుగ్మతలు

ప్రజలు ఇలాగే ఐసొలేషన్‌లో ఉండిపోతే వారిలో మానసిక రుగ్మతలు తలెత్తే ప్రమాదం ఉందని మనస్తత్వ శాస్త్రజ్ఞులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే హికికోమోరి విధానాన్ని పాటిస్తున్న కొంతమందిని పరీక్షించగా.. వారిలో మానసిక వ్యాధులు ఉన్నట్లు గుర్తించారు. ఇదో సామాజిక సమస్యగా మారిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అమ్మానాన్నలకు భారం.. ఆర్థిక సంక్షోభం!

తల్లిదండ్రులు సంపాదిస్తుండటంతో యువత ఎలాంటి ఇబ్బంది లేకుండా ఐసొలేషన్‌లో ఉంటున్నారు. గది వద్దకే ఆహారం.. అవసరమైన వస్తువులు వచ్చేస్తున్నాయి. బోర్‌ కొట్టకుండా వీడియోగేమ్స్‌, సినిమాలు చూస్తూ కాలం గడుపుతున్నారు. గేమ్స్‌ కొనుగోళ్లు, ఆన్‌లైన్‌ సబ్‌స్క్రిప్షన్స్‌ కోసం కన్నవాళ్ల నుంచే డబ్బులు తీసుకుంటున్నారు. దీంతో ప్రయోజకులై తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తారనుకుంటే.. వారికే భారంగా మారిపోతున్నారు. రాబోయే తరం ఉద్యోగాలు చేయక.. దేశంలో వ్యాపారాలు సాగక.. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

కరోనాతో తీవ్రమైన సమస్య

కరోనా కాలంలో ఈ సమస్య మరింత పెరిగింది. కుటుంబసభ్యులు ఉద్యోగాలు కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో పడటం, కరోనా వ్యాప్తి, మరణాలు తదితర అంశాలు యువతలో మరింత మానసిక ఒత్తిడిని పెంచాయని నిపుణులు చెబుతున్నారు. మానసిక రుగ్మతలు తలెత్తినా వైద్యులను సంప్రదించడం అవమానంగా భావించి ఎవరూ ముందుకు రావట్లేదని, దీంతో ప్రజల్లో మానసిక ఆరోగ్యం దెబ్బ తింటోందని చెబుతున్నారు.

చికిత్సకు ప్రయత్నాలు

హికికోమోరిని పాటించేవారిని సరైన దారిలో పెట్టే చికిత్సలు ఏమీ ప్రస్తుతం లేవు. అయినా అక్కడి ప్రభుత్వం వారిని పలు విధాలుగా దాని బారనుంచి బయటపడవేసేందుకు కృషి చేస్తోంది. ఇందుకోసం మానసిక ఆరోగ్యం గురించి పలు కార్యక్రమాల్లో వారిని భాగస్వాముల్ని చేసి, ఆత్మవిశ్వాసాన్ని, సానుకూల దృక్పథాన్ని కలిగిస్తోంది.

ఇంటర్నెట్‌ డెస్క్‌

Read latest Explained News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని