Disaster Balloonfest : 15 లక్షల బెలూన్లతో ప్రపంచ రికార్డుకు యత్నం.. డామిట్‌ కథ అడ్డం తిరిగింది!

ప్రపంచ రికార్డు (World record) నెలకొల్పేందుకు చేసే ప్రయత్నాలు కొన్నిసార్లు వికటిస్తుంటాయి. గతంలో అమెరికాలో (America) నిర్వహించిన ఓ భారీ బెలూన్‌ఫెస్ట్‌ (Balloonfest) అల్లకల్లోలం సృష్టించింది. ఆ సంగతేంటో తెలుసుకోండి.

Updated : 19 May 2023 15:21 IST

అమెరికాలోని (America) క్లీవ్‌లాండ్‌లో 1986 సంవత్సరంలో ఓ భారీ బెలూన్‌ ఫెస్ట్‌కు (Balloonfest) ప్రణాళిక రచించారు. ఒకేసారి 15 లక్షల హీలియం బెలూన్లను గాల్లోకి వదిలి యునైటెడ్ వే ఆఫ్‌ క్లీవ్‌ల్యాండ్‌ అనే స్వచ్ఛంద సంస్థకు నిధులు సేకరించాలని అనుకున్నారు. ఈ బెలూన్‌ ఫెస్ట్‌ను లాస్‌ ఏంజెలెస్‌కు చెందిన ఓ కంపెనీ సమన్వయం చేసింది. ఇది విజయవంతం అయితే క్లీవ్‌లాండ్‌కు మంచి గుర్తింపు లభిస్తుందని అంతా భావించారు. కానీ, ఆ ప్రయత్నం ఫలించలేదు. చివరికి అదో విపత్తుగా చరిత్రలో మిగిలిపోయింది.

భారీ ప్రణాళిక

బెలూన్‌ ఫెస్ట్‌ నిర్వహించేందుకు ఆరు నెలల ముందే అద్భుతమైన ప్రణాళిక రచించారు. అధికారుల నుంచి అనుమతులు తీసుకున్నారు. కార్యక్రమం ఎలా సాగాలో పరిశోధన చేశారు. ఇందులో ప్రజల్ని భాగస్వాములను చేశారు. త్వరలో భారీ బెలూన్‌ ఫెస్ట్‌ జరగబోతోందని ప్రచారం నిర్వహించారు. 

అసలు రోజు రానే వచ్చింది. బెలూన్‌ ఫెస్ట్‌లో పాల్గొనేందుకు 2500 మంది వాలంటీర్లు వచ్చారు. వారంతా హీలియం బెలూన్లను తయారు చేసే పనిలో పడ్డారు. స్థానిక, జాతీయ మీడియా ప్రతినిధులు ఆ కార్యక్రమాన్ని కవర్‌ చేసేందుకు పెద్ద ఎత్తున గుమికూడారు. బెలూన్లను విడుదల చేసేందుకు క్లీవ్‌లాండ్‌ పబ్లిక్‌ స్క్వేర్‌ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ప్రేక్షకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. బెలూన్లను ఆకాశంలోకి ఎగుర వేశారు. వెంటనే ఆ కార్యక్రమాన్ని కవర్‌ చేస్తున్న స్థానిక రేడియో డీజే ‘క్లీవ్‌లాండ్‌ గిన్నిస్‌ రికార్డు నెలకొల్పింది. ఆకాశంలో 15 లక్షల బెలూన్లు ఎగురుతున్నాయి’ అని బిగ్గరగా ప్రకటించాడు. 

ఊహించని పరిణామం

అయితే ఆ రోజు వాతావరణం అనుకూలించలేదు. వర్షం పడటంతో పైకి ఎగిరి వెళ్లిన బెలూన్లు తిరిగి భూమి పైకి రావడం మొదలుపెట్టాయి. అవి నగరంలోని రోడ్లన్నింటినీ నింపేశాయి. దాంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. వాహనాలు పరస్పరం ఢీకొని పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కింద పడ్డ బెలూన్లను తొలగించే మార్గం లేక కొన్ని చోట్ల బుల్డోజర్లు వాడారు. విమానాశ్రయంలోని రన్‌వే పై కూడా బెలూన్లు పడ్డాయి. దాంతో బర్క్‌ లేక్‌ఫ్రంట్ విమానాశ్రయాన్ని అరగంట సేపు మూసివేశారు.

32 లక్షల డాలర్లకు దావా

ఇక్కడ మరో విషాదం ఏమిటంటే అదే రోజున ఇద్దరు మత్స్యకారులు వేటకు వెళ్లారు. వారు కనిపించడం లేదనే సమాచారంతో కోస్ట్‌ గార్డులు రంగంలోకి దిగారు. అయితే, వారి వెతుకులాట ఫలించలేదు. ఎందుకంటే నీటిలో కూడా చాలా బెలూన్లు పడిపోయాయి. దాంతో మత్సకారుల ఆచూకీ కనుగొనటం గడ్డివాములో సూదిని వెతికినట్లే అయ్యింది. కొద్ది రోజుల తరువాత వారి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. ఈ ఘటనకు బెలూన్‌ ఫెస్ట్ నిర్వాహకులే కారణమని మృతిచెందిన మత్స్యకారుడి భార్య 32 లక్షల డాలర్లకు దావా వేసింది. తరువాత ఆ వివాదాన్ని కోర్టు వెలుపల పరిష్కరించుకున్నారు. 

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని