Hail rain : వడగళ్లు ఎలా ఏర్పడతాయో తెలుసా!

అకాల వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో గురువారం భారీ వడగళ్లు పడ్డాయి. అసలు వడగళ్ల వాన ఎందుకు పడుతుందో తెలుసుకోండి.

Updated : 17 Mar 2023 14:59 IST

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో గురువారం వడగళ్ల(Hail) వాన బీభత్సం సృష్టించింది. రోడ్లు, పొలాలు తెల్లటి మంచుపొరలతో నిండి కశ్మీర్‌ను తలపించాయి. శుక్ర, శనివారాల్లోనూ వర్షాలు(Rain), వడగళ్లు కురిసే సూచనలు ఉన్నాయని, ఆదివారం కూడా వర్ష సూచన ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో వడగళ్లు ఎలా కురుస్తాయో తెలుసుకోండి.

వర్షం ఇలా..

ఆకాశంలోని మేఘాల్లోకి నీటి బిందువులు ఎక్కువగా చేరితే అవి భారీ పరిమాణంలోకి మారతాయి. మేఘం కరగడంతో భూమిపై వర్షం పడుతుంది. ఇలా పడే వర్షం కొన్ని సార్లు ప్రారంభంలో మంచు తునకలుగా ఉంటుంది. ఆ మంచు తునకలు భూమిని చేరే క్రమంలో వాతావరణ రాపిడికి గురై ప్రయాణించాల్సి వస్తుంది. దాంతో గడ్డలు కాస్తా కరిగి వర్షపు చినుకులుగా మారి నేలను తాకుతాయి. దీన్నే వర్షం అని పిలుస్తుంటాం.

వడగళ్లు ఏర్పడాలంటే..

వడగళ్లు ఏర్పడాలంటే ముందు ఉరుములు, మెరుపులు రప్పించే మేఘం ఉండాలి. ఆ మేఘం ఎత్తు కూడా ఎక్కువగా ఉంటేనే వడగళ్లు ఏర్పడటానికి అనుకూలంగా ఉంటుంది . మేఘాన్ని రెండు భాగాలుగా విభజిస్తే.. పై భాగం తప్పని సరిగా గడ్డ కట్టి ఉండాలి. కింది భాగంలో సూపర్‌ కూల్డ్‌ వాటర్‌ ఉండాలి. వాతావరణానికి పై భాగంలో నీరు ప్రత్యేకమైన స్థితికి చేరడాన్ని సూపర్‌ కూల్డ్‌ వాటర్‌ అంటారు. ఈ స్థితిలో నీరు 0 డిగ్రీ సెల్సియస్‌ వద్ద ఉన్నా ద్రవరూపంలోనే ఉంటుంది. ఇది మంచు గడ్డలు, దుమ్మురేణువు, వర్షపు బిందువులతో కలిసినప్పుడు గడ్డకడతాయి.  ఈ మేఘానికి సమీపంలో పైకి వీచే గాలులు (అప్‌డ్రాఫ్ట్స్‌) తప్పనిసరి. పైకి వీచే గాలులే మేఘం కింది భాగంలోకి చేరిన మంచు ముక్కలను తిరిగి పైకి తీసుకెళ్తాయి.

ఉల్లిపాయలా.. వడగళ్లు!

వడగళ్లు అనేవి మంచు ముద్దలు. చాలాసార్లు ఉరుములతో కూడిన వర్షం పడటం వల్ల వడగళ్లు కన్పిస్తాయి. వడగళ్లు ఎక్కువగా ఎత్తయిన, నిలువుగా ఉండే క్యుములోనింబస్ మేఘాలతో సంబంధం కలిగి ఉంటాయి. వీటినే తీవ్రమైన ఉరుములతో కూడిన మేఘాలుగా పిలుస్తారు. క్యుములోనింబస్ మేఘంలోని సూపర్‌కూల్డ్ నీటితో ముందుగా చిన్న మంచు ముక్కలు తయారవుతాయి. ఆ ముక్కలను పైకి పంపించేలా వాయువు(అప్‌డ్రాఫ్ట్స్‌) సహకారం అందించడంతో అవి కింద పడకుండా తిరిగి మేఘం పైకి వెళతాయి. ఈ క్రమంలో ఆ ఐస్‌ ముక్కలకు మరింత సూపర్‌ కూల్డ్ వాటర్‌ తోడవుతుంది. పై స్థానంలోని కొన్ని మంచు ముక్కలు కూడా అతుక్కుంటాయి. దాంతో అవి మరింత బలంగా, దృఢంగా మారతాయి. ఈ చర్య పునరావృతమయ్యే కొద్దీ ఐస్‌ ముక్కలు పెద్ద పెద్దగా రూపాంతరం చెందుతుంటాయి. అవే వడగళ్లు. ఈ వడగళ్లు ఒక ఉల్లిపాయ వలే పొరలుగా ఏర్పడతాయి. క్రమంగా వడగళ్ల పరిమాణం భారీగా మారడంతో అప్‌డ్రాఫ్ట్స్‌ శక్తి సరిపోదు. దాంతో గురుత్వాకర్షణకు లోనై అవి భూమి దిశగా పయనిస్తాయి. అప్పుడే వడగళ్ల వాన పడుతుంది. అది కొన్నిసార్లు భారీ ఉరుములు, పిడుగులతో కూడి ఉంటుంది.

వేగం 160 కిలోమీటర్లు!

వడగళ్లు మొదట ఎలా మేఘం నుంచి ప్రారంభమయ్యాయో అలాగే భూమిని చేరవు. వాతావరణంలోని వేడి వాటికి జత కావడంతో వడగళ్లు మధ్యలోనే చాలా వరకు కరిగిపోతాయి. అందుకే వడగళ్ల వాన ఎక్కువ సార్లు కురవడం సాధ్యం కాదు. టోర్నడోలు, అస్థిర వాతావరణ పరిస్థితులున్నప్పుడు వడగళ్లు పడుతుంటాయి. అమెరికాలోని నేషనల్ వెదర్‌ సర్వీస్‌ 2.5 సెంటీమీటర్ల వ్యాసం ఉండే మంచు ముక్కలను వడగళ్లుగా పేర్కొంది. భారీ పరిమాణంలో ఉండే వడగళ్లు పడితే ఆస్తి, ప్రాణ నష్టం తీవ్రంగా ఉంటుంది. నివాసాలు, కార్లు, పంటలు దెబ్బతింటాయి. మేఘాల నుండి వడగళ్లు పడే వేగం ఎంతో తెలుసుకోవడం చాలా కష్టం. అవి దాదాపు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో పయనిస్తాయని ఒక అంచనా. అందుకే వడగళ్లు పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు. పశువులు, పెంపుడు జంతువులను సురక్షితమైన ప్రదేశాల్లోకి తరలించాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు