ఏమిటీ ముంబయి మోడల్‌.. కరోనా వేళ ఏం చేసింది?

కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజూ వేలాది ప్రాణాలను బలితీసుకుంటోంది. తొలిదశ వ్యాప్తి కంటే రెండో దశ మరింత ప్రాణాంతకంగా మారుతోంది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ప్రజలు భయపడుతూనే ఉన్నారు. రెండోదశ ప్రారంభంలోనూ మహమ్మారి ముంబయి నగరాన్ని గజగజ వణికించింది. కానీ, కొద్ది రోజుల్లోనే కేసుల సంఖ్య అనూహ్యంగా తగ్గిపోయింది...

Published : 10 May 2021 01:04 IST

పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్న ముంబయి నగర కమిషనర్‌

అందరికీ ఆదర్శమని సుప్రీం కితాబు

కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజూ వేలాది ప్రాణాలను బలితీసుకుంటోంది. తొలిదశ వ్యాప్తి కంటే రెండో దశ మరింత ప్రాణాంతకంగా మారుతోంది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ప్రజలు భయపడుతూనే ఉన్నారు. రెండోదశ ప్రారంభంలోనూ మహమ్మారి ముంబయి నగరాన్ని గజగజ వణికించింది. కానీ, కొద్ది రోజుల్లోనే కేసుల సంఖ్య అనూహ్యంగా తగ్గిపోయింది. దిల్లీ, గుజరాత్‌,ఉత్తర్‌ ప్రదేశ్‌లలో మరణ మృదంగం కొనసాగుతున్నప్పటికీ ముంబయి మహానగరం మాత్రం సులభంగా కట్టడి చేయగలిగింది. కారణం ఏంటి? వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు  ఎలాంటి వ్యూహం అనుసరించింది? వాటిని మిగతా నగరాలు ముంబయిని ఆదర్శంగా తీసుకోవచ్చా..!

ముంబయి.. దేశానికి వాణిజ్య పరంగా ఆయువుపట్టు. తొలిదశ వ్యాప్తి సమయంలో చిగురుటాకులా వణికిపోయిన ఈసారి మాత్రం కరోనాను ఎదిరించి పోరాడింది.. ఏప్రిల్‌ మొదట్లో కేసులు భారీగా నమోదైనా.. స్వల్ప కాలంలోనే అదుపులోకి వచ్చాయి.. అదెలా? ‘కచ్చితమైన ప్రణాళిక, సత్వర చర్యలు, స్మార్ట్‌ పద్ధతిలో సమాచార మార్పిడి, అవసరమైన చోట ఎంతైనా ఖర్చుపెట్టేందుకు ముందుకు రావడం’ వీటివల్లే ముంబయి మహానగరంలో కొవిడ్‌ అదుపులోకి వచ్చిందని ఆ నగర కమిషనర్ ఇక్బాల్‌ సింగ్‌ చాహల్‌ అంటున్నారు. వీటన్నింటికీ అధికార, ప్రతిపక్షాల మద్దతు కూడా తోడవ్వడం వల్లే మంచి ఫలితాలు సాధించామని చెబుతున్నారు.

దిల్లీ, గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్ తదితర చోట్ల ఇప్పటికీ ఆక్సిజన్‌ కొరత, బెడ్ల కొరత తీవ్రంగా వేదిస్తోంది. కానీ, గత కొద్ది రోజులుగా ముంబయిలో  ఆ మాటలే వినిపించడం లేదు. ఈ విపత్కర పరిస్థితులను చాకచక్యంగా ఎదుర్కొంటున్న బృహన్‌ ముంబయి మహానగర పాలక సంస్థను దేశ అత్యున్నత న్యాయస్థానమే ప్రశంసించింది. ముంబయి మున్సిపల్‌ కమిషనర్‌తో మాట్లాడి తగిన సలహాలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శిని ఆదేశించింది. మరోవైపు  నాగపూర్‌ బెంచ్‌ కూడా బృహన్‌ ముంబయి పని తీరును కొనియాడింది. ముంబయి తరహాలో 24×7 కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా నాగపూర్‌ నగరకమిషన్‌ను ఆదేశించింది.

వికేంద్రీకృత పోరాటమే ముంబయి వ్యూహం

కొవిడ్‌ మహమ్మారిపై వికేంద్రీకృత పోరాటం చేయడంవల్లే విజయం సాధించామని కమిషన్‌ చాహల్‌ చెబుతున్నారు. తాజా పరిస్థితుల్లో రిటైర్డ్‌ జనరల్‌ స్థాయి వ్యక్తులను కూడా కొవిడ్‌ సేవల్లో భాస్వాములను చేయవచ్చని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేయడం చాహల్‌కు మరింత కలిసొచ్చింది. డిఫెన్స్‌ సర్వీస్‌ అనుభవమున్న మరో ఇద్దరితో కలిసి తన ప్రణాళికను అమలు చేశారు చాహల్‌. ఆయన గత ఏడాది మేలో ముంబయి నగర కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటికి కరోనా ఉద్ధృతంగా ఉంది. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నప్పటికీ  కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. చెత్త కుండీల్లో మృతదేహాలు, రోడ్డపైనే అనాథశవాలు ఇలా భయంకరమైన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. మరోవైపు దాదాపు ప్రతిదానికీ కొరతే.. ఫేస్‌ మాస్కులు, పీపీఈ కిట్లు, శానిటైజర్లు, ఆక్సిజన్‌ ఇలా ప్రతిదీ సమస్యే.  ఈ పరిస్థితుల నుంచి ముంబయిని గట్టెక్కించడానికి చాహల్‌ ఎంతో ప్రణాళికా బద్ధంగా శ్రమించారు.

 ప్రజల్లో భయాన్ని తొలగించడం

భయం వల్లనే కొవిడ్‌ మరింత విస్తృతంగా వ్యాప్తి చెందుతోందని వివిధ సర్వేలు చెబుతున్నాయి. వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించి వారిలోని భయాన్ని పోగొట్టాలి. కరోనా పరీక్ష రిపోర్టులు నేరుగా బాధితులకు చేరడం వల్ల వారిలో భయాందోళనలు రేగి ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారని, దీనివల్ల అత్యవసర చికిత్స అవసరమైన వారికి వైద్యం అందడం లేదని చాహల్‌ గుర్తించారు. సాధారణంగా  కొవిడ్‌ టెస్టింగ్ ల్యాబులు సాయంత్రం 6 గంటల సమయంలో పరీక్ష రిపోర్టులను బాధితులకు మెసేజ్‌ రూపంలో చేరవేసేవి.  దీంతో ఒక్కసారిగా వేలాది మంది ఆస్పత్రుల్లో బెడ్ల కోసం బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్లు చేసేవాళ్లు. అర్ధరాత్రి వరకూ ఇదే వరస. దీంతో చాహల్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై టెస్టింగ్‌ ల్యాబులు నేరుగా బాధితులకు కాకుండా బీఎంసీ కంట్రోల్‌ రూమ్‌కే టెస్టు వివరాలను అందించాలని ఆదేశించారు. దీంతో ఎన్నికేసులు నమోదవుతున్నాయో కచ్చితమైన లెక్కలు ఉంటాయి.

వార్‌ రూమ్‌ల ఏర్పాటు

కంట్రోల్‌ రూమ్‌కి బాధితుల వివరాలు వస్తున్నాయి బాగానే ఉంది. కానీ, పాజిటివ్‌ వచ్చిన వారికి సకాలంలో వైద్యసేవలు అందించాలి కదా.. దీనికోసం 24×7 పని చేసేలా వార్‌ రూంలను ఏర్పాటు చేశారు చాహల్‌. బీఎంసీ వ్యాప్తంగా 24 వార్‌రూంలను నెల కొల్పారు.  ఆయా వార్‌రూమ్‌ల పరిధిలో ఎవరికైనా పాజిటివ్‌ వస్తే ప్రతి రోజూ ఉదయం 6 గంటల సమయంలో వార్‌ రూమ్‌ సిబ్బంది సంబంధిత వ్యక్తులకు తెలియబరుస్తారు.  ఒక్కో వార్‌ రూంలో 30 టెలిఫోన్లు, 10 మంది టెలిఫోన్‌ ఆపరేటర్లు, 10 మంది డాక్టర్లు, 10 మంది సహాయక సిబ్బంది, 10అంబులెన్స్‌లు నిత్యం అందుబాటులో ఉంటాయి.  ప్రతి వార్‌ రూమ్‌ పరిధిలో ఇంకో 10 డాష్‌బోర్డులు చొప్పున మొత్తం 240 డాష్‌బోర్డులు ఏర్పాటు చేశారు. ఆయా వార్డుల్లోని ఆస్పత్రుల్లో ఎన్ని పడకలు ఉన్నాయి? ఎన్ని నిండాయి? తదితర వివరాలు వీరి దగ్గర ఉంటాయి. దీంతో పడకల గురించి సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు ఏర్పడింది.

నగరంలో దాదాపు 55 టెస్టింగ్‌ ల్యాబ్స్‌ ఉన్నాయి. వీటి నుంచి రోజుకు 10,000 రిపోర్టులు వస్తుంటాయి. వీటిని బీఎంసీ కేంద్ర కార్యాలయంలోని కంట్రోల్‌ రూమ్‌ సిబ్బంది వార్‌రూంల వారీగా వేరు చేసి ఉదయం 6 గంటలకల్లా సంబంధిత వ్యక్తులకు సమాచారమిచ్చేవాళ్లు. ఆ వార్‌రూమ్‌ పరిధిలోని వైద్యసిబ్బంది నేరుగా బాధితుల ఇళ్లకు వెళ్లి పరీక్షిస్తారు.  ఒక వేళ అత్యవసరమైతే వాళ్లే దగ్గరుండి ఆస్పత్రికి తీసుకెళ్తారు. దీంతో ఆస్పత్రుల వద్ద రద్దీ అనూహ్యంగా తగ్గిపోయింది. పూర్తిగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పడకల కేటాయింపు జరుగుతున్నందువల్ల ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండాపోయింది.

ఉన్నపళంగా వైద్య సిబ్బంది

ఈ ప్రణాళికను అమలు చేయడానికి భారీ స్థాయిలో వైద్య సిబ్బంది అవసరమైంది. దీంతో వార్‌ రూమ్‌లలో పని చేసేందుకు ఒప్పంద ప్రాతిపదికన వైద్యులను నియమించాలని చాహల్‌  నిర్ణయించారు.  నెలకు రూ. 50,000లతోపాటు వార్‌రూమ్‌కు దగ్గర్లోనే వసతి సదుపాయం కల్పించి 900 మంది డాక్టర్లను, 600 మంది నర్సులను నియమించారు. దాదాపు 800 కొత్త అంబులెన్స్‌లను, ప్రత్యేక శిక్షణ కలిగిన డ్రైవర్లను యుద్ధప్రాతిపదికన నియమించారు. అవసరమైన చోట్ల ఉబర్‌ సేవలను కూడా వినియోగించుకునేందుకు ఆ సంస్థతో ఒప్పందం కూడా చేసుకున్నారు.

ఆసుపత్రుల్నీ బీఎంసీ ఆధీనంలోనే

మహారాష్ట్రలో కరోనా కేసులు పెరిగిపోవడంతో ఆస్పత్రులన్నీ బాధితులతో కిక్కిరిసి పోతున్నాయి. ఇదే అదనుగా ప్రైవేటు ఆస్పత్రులు అందినకాడికి దోచుకుంటున్నాయి. ముంబయి నగరమూ దీనికి మినహాయింపేమీ కాదు. ఇదే విషయం చాహల్‌ దృష్టికి వచ్చింది. వెంటనే ముంబయి మహానగర పరిధిలోని ఆస్పత్రులన్నింటినీ నగరపాలిక అధీనంలోకి తెచ్చేశారు. వైద్య సేవలకు కచ్చితమైన రేట్లు నిర్ణయించారు. అంతేకాకుండా ఆస్పత్రిలో  బాధితుడిని చేర్చుకోవాలన్నా, డిశ్ఛార్జి చెయ్యాలన్నా బీఎంసీ అనుమతి తప్పని సరి. ఈ ప్రక్రియ అంతా వార్‌రూమ్‌ల ద్వారానే జరగాలి. అందువల్ల ఎలాంటి అవకతవకలు జరిగే అవకాశమే లేదు. పడకలను బ్లాక్‌ చేసి ప్రైవేటుగా అమ్ముకునే ప్రసక్తే లేదు. అవసరమైన ప్రతి ఒక్కరికీ వైద్యమందే అవకాశం ఏర్పడింది. ఏ ఆస్పత్రిలో ఉన్నా ఆ పరిధిలోని వార్‌రూమ్‌ సిబ్బంది బాధితుడిని ప్రతిరోజూ పరీక్షించి ఫర్వాలేదనుకుంటే వెంటనే డిశ్చార్జి చేసి, మరొకరికి ఆ పడకను కేటాయిస్తారు.

దహన సంస్కారాలకూ ప్రణాళికే

కరోనా బాధితులకు  వైద్యసేవల పరిస్థితి అటుంచితే.. దేశంలో చాలాచోట్ల ప్రస్తుతం గౌరవ ప్రదంగా అంతిమ సంస్కారాలు జరగడం లేదు. రోజుల తరబడి శ్మశానాల్లో వేచి చూడాల్సిన పరిస్థితి. కానీ, ముంబయిలో అలాంటిదేం కనిపించడం లేదు. ఎందుకో తెలుసా? అది కూడా ఓ పద్ధతి ప్రకారం జరిగేటట్లు చాహల్‌ ప్రణాళిక రూపొందించారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీతో సంప్రదించి ప్రత్యేక డాష్‌ బోర్డును ఏర్పాటు చేశారు. ముంబయిలోని 47 శ్మశానవాటికల్లో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో ఇందులో తెలుసుకోవచ్చు. అవసరమైన వారు ఇందులో నమోదు చేసుకుంటే సిబ్బంది వచ్చి మృతదేహాలను తరలించి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. దీంతో శ్మశానవాటికల వద్ద రద్దీ దాదాపు తగ్గిపోయింది.

భవిష్యత్‌ ప్రమాదం ఊహించి..

ప్రస్తుతం దేశంలో సెకెండ్‌ వేవ్‌ కొనసాగుతోంది. మరోవైపు మూడో దశ వ్యాప్తి కూడా పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబయిలో కొత్తగా 5,500 పడకలను సిద్ధం చేసి ఉంచినట్లు చాహల్‌ తెలిపారు.వీటిలో 3,000 బెడ్లకు ఆక్సిజన్‌ సదుపాయముండగా.. 2,000 ఐసీయూ బెడ్లు ఉన్నాయి. అత్యవసర సమయాల్లో వినియోగానికి  మరో 2000 పడకలను సిద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ముంబయిలో ప్రస్తుతం 22,000 బెడ్లు అందుబాటులో ఉన్నాయని, మరో మూడు వారాల్లో దీనిని 30,000 పెంచేలా ఏర్పాట్లు ముమ్మరం చేశామని ఆయన చెబుతున్నారు.

ఇలాంటి పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్న బీఎంసీ కమిషన్‌ చాహల్‌ సేవలు శ్లాఘనీయమే కదా.. దేశంలో వైరస్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో  ఇలాంటి ప్రణాళికను తూచాతప్పకుండా పాటిస్తే కరోనా వ్యాప్తిని సులువుగా అరికట్టగలమనే ధైర్యం కలుగుతుంది..!

-ఇంటర్నెట్‌డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని