Indian Railway: క్యూ లైన్లకు చెక్‌ పెట్టండి.. జనరల్‌ టికెట్లు ఇలా సులువుగా తీసుకోండి

మన దేశంలో రైళ్లకు ఎప్పుడూ డిమాండే. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రయాణికులకు అందుబాటులో ఉండే జనరల్‌ బోగీలు కిటకిటలాడుతూనే కనిపిస్తాయి. అయితే, వీటిలో టికెట్‌ సంపాదించడం మాత్రం కొన్నిచోట్ల చాలా కష్టం! రైలు బయలుదేరడానికి ముందే స్టేషన్‌కి చేరుకోవడం...

Published : 29 Apr 2022 11:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మన దేశంలో రైళ్లకు ఎప్పుడూ డిమాండే. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రయాణికులకు అందుబాటులో ఉండే జనరల్‌ బోగీలు కిటకిటలాడుతూనే కనిపిస్తాయి. అయితే, వీటిలో టికెట్‌ సంపాదించడం మాత్రం కొన్నిచోట్ల చాలా కష్టం! రైలు బయలుదేరడానికి ముందే స్టేషన్‌కి చేరుకోవడం.. గంటల తరబడి క్యూలో నిలబడటం వంటి తిప్పలు తప్పవు. ఈ ఇక్కట్లను తొలగించేందుకే భారతీయ రైల్వే.. యూటీఎస్(అన్‌ రిజర్వ్‌డ్‌ టికెటింగ్‌ సిస్టమ్‌) అనే మొబైల్‌ యాప్‌ను తీసుకొచ్చింది. ఈ అప్లికేషన్‌ సాయంతో ఫోన్‌లోనే జనరల్‌ టికెట్లు, నెలవారీ సీజనల్‌ టికెట్లు, ప్లాట్‌ఫాం టికెట్లు బుక్‌ చేయొచ్చు.

ఇదీ బుకింగ్ ప్రక్రియ..

ఆండ్రాయిడ్‌ వినియోగదారులైతే గూగుల్‌ ప్లేస్టోర్‌, ఐఫోన్‌ వినియోగదారులు యాప్‌ స్టోర్‌, విండోస్‌ ఫోన్‌లు వాడేవారు విండోస్‌ యాప్‌ స్టోర్‌ నుంచి యూటీఎస్(UTS) అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అనంతరం ఫోన్‌ నంబర్‌, పేరు, పాస్‌వర్డ్‌, పుట్టిన తేదీ తదితర వివరాలతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఆ వెంటనే వన్‌టైం పాస్‌వర్డ్‌ (ఓటీపీ) వస్తుంది. దాన్ని నమోదు చేయడంతో ఈ ప్రక్రియ ముగుస్తుంది.

* రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయ్యాక ఫోన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌తో మన అకౌంట్‌లోకి లాగిన్‌ కావాల్సి ఉంటుంది.

ఆ తర్వాత టికెట్‌ బుకింగ్‌ కోసం ‘నార్మల్‌ బుకింగ్‌’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. ఆన్‌లైన్‌ టికెట్‌ కావాలనుకుంటే బుక్‌ అండ్‌ ట్రావెల్‌ (పేపర్‌లెస్‌), ప్రింటెడ్‌ టికెట్‌ కావాలనుకుంటే బుక్‌ అండ్‌ ప్రింట్(పేపర్‌) ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. అనంతరం మనం ఎక్కాల్సిన, దిగాల్సిన స్టేషన్‌ల వివరాలు నమోదు చేయాలి. ఆపై ప్రయాణికుల (పెద్దలు, చిన్నారులు) సంఖ్య, ట్రైన్‌ టైప్‌, ఏ క్లాస్‌(రెండో క్లాస్‌, అన్‌రిజర్వ్‌డ్‌) వివరాలు పొందుపర్చాలి.

తర్వాత నగదు చెల్లింపు కోసం ‘పేమెంట్‌ టైప్‌’లో ఆర్‌-వ్యాలెట్‌ లేదా ఇతర ఆన్‌లైన్‌ పేమెంట్‌ వ్యవస్థ(క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, డిజిటల్‌ పేమెంట్‌ యాప్స్‌)లను ఎంచుకోవాలి. టికెట్‌లకు ఎంతవుతుందో (గెట్‌ ఫేర్‌) తెలుసుకుని, చివరకు ‘బుక్‌ టికెట్‌’పై క్లిక్‌ చేయాలి. దీంతో టికెట్‌ బుక్‌ అవుతుంది.

టికెట్‌ చూడాలనుకుంటే ‘షో టికెట్‌’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. వెంటనే మీరు బుక్‌ చేసుకున్న టికెట్‌ వివరాలు కనిపిస్తాయి. ‘వ్యూ టికెట్‌’పై క్లిక్‌ చేస్తే.. టికెట్‌ కనిపిస్తుంది.

* ‘క్విక్‌ బుకింగ్‌’ ఆప్షన్‌ ద్వారా ఇదివరకు బుక్‌ చేసుకున్న టికెట్‌ల వివరాలు కనిపిస్తాయి. ‘ప్లాట్‌ఫాం బుకింగ్‌’ ద్వారా ప్లాట్‌ఫాం టికెట్‌ తీసుకోవచ్చు. ‘సీజనల్‌ టికెట్స్‌’తో కొత్తగా నెలవారీ టికెట్‌ తీసుకోవచ్చు. రెన్యూవల్‌ కూడా చేసుకోవచ్చు. ‘క్యూఆర్‌ బుకింగ్‌’ ఆప్షన్‌ ద్వారా.. స్టేషన్‌లోని టికెట్‌ కౌంటర్ల వద్ద క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా టికెట్‌ పొందవచ్చు.

ఇవి పాటించాల్సిందే..

టికెట్‌ కోసం చెల్లింపులకు ఆర్‌-వ్యాలెట్‌ ఆప్షన్‌ను ఎంచుకునే వారు ముందుగా.. దాన్ని రీఛార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. రూ.100 ఆపై మాత్రమే రీఛార్జ్‌ సాధ్యపడుతుంది. ఆన్‌లైన్‌లో లేదా, స్టేషన్‌లోని యూటీఎస్‌ కౌంటర్‌ వద్ద రీఛార్జ్‌ చేసుకోవచ్చు.

ఫోన్‌లో టికెట్‌ బుకింగ్‌ కోసం ఇంటర్నెట్‌ సదుపాయం తప్పనిసరి. జీపీఎస్‌ను యాక్టివేట్‌ చేసుకోవాలి. ప్రయాణించే రోజు మాత్రమే టికెట్‌ బుక్‌ చేసుకోగలం. టికెట్‌ తీసుకున్న గంటలోపు రైలెక్కాలి.

ఎంపిక చేసిన స్టేషన్‌లలో మాత్రమే ప్లాట్‌ఫాం టికెట్‌ తీసుకోగలం.

పేపర్‌లెస్‌ టికెట్‌ రద్దు చేయడం కుదరదు. స్టేషన్‌ వెలుపల 5 కి.మీల పరిధిలో మాత్రమే టికెట్‌ తీసుకోవచ్చు. స్టేషన్‌ లోపల, రైల్లో ఉన్నప్పుడు కుదరదు.

పేపర్‌ టికెట్‌ బుక్‌ చేసుకున్నవారు స్టేషన్‌కు వెళ్లి అక్కడి ఏటీవీఎం/ కో-టీవీఎం, ఓసీఆర్‌ యంత్రాలు, ఓటీఎస్‌ బుకింగ్‌ కౌంటర్‌ నుంచి టికెట్‌ ప్రింట్‌ తీసుకోవచ్చు. ఇందుకోసం ఫోన్‌ నంబర్‌, బుకింగ్‌ ఐడీ నంబర్‌ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. టికెట్‌ రద్దూ చేసుకోవచ్చు. ఈ విధానంలో టికెట్‌ బుక్‌ చేసుకున్నవారు కచ్చితంగా చేతిలో టికెట్‌ కలిగి ఉండాలి. లేనిపక్షంలో జరిమానా పడుతుంది.

టికెట్‌ పొందడంలో సమస్యలు, ఇతర ఇబ్బందులపై ఫిర్యాదు చేసేందుకు ఈ యాప్‌లోనే రైల్వే కస్టమర్‌ కేర్‌ నంబర్లు, ఫిర్యాదుల స్వీకరణ అప్షన్‌ కూడా ఉన్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు