Twins : కవలలు పుట్టడం వెనుక జరిగే కథ ఇది!

తల్లి గర్భంలో కవలలు (Twins) ఎలా జీవం పోసుకుంటారు..? అవిభక్త కవలలు ఎలా పుడతారు..? ఇతర దేశాల్లో కవలల శాతం ఎలా ఉంది.. ఇలాంటి ఆసక్తికర విషయాలు మీ కోసం..

Updated : 16 Jan 2023 15:11 IST

ఒకేసారి ఇద్దరు జన్మించడం అరుదు. తమకు కవలలు (Twins) పుడతారని తెలియగానే దంపతులు(couples) ఎంత ఆనందపడతారో.. ఫలానా వారికి కవలలు జన్మించారనే వార్త చెవిన పడితే విన్నవారూ ఆశ్చర్య పోతుంటారు.
ఇటీవల ఎక్కువ మంది సెలెబ్రిటీలకు కవలలు పుట్టారు(birth). అయితే, తల్లి గర్భంలో కవలలు ఎలా జీవం పోసుకొంటారో తెలుసుకోవాలనే కుతూహలం అందరిలోనూ ఉంటుంది. అదెలా సాధ్యమో చదివేయండి మరి..  

తల్లి గర్భంలో ఏక కాలంలో రెండు పిండాలు ఏర్పడితే కవలలు పుట్టబోతున్నట్లు డాక్టర్లు నిర్ధారిస్తారు. కవలల్లో రెండు రకాలు ఉంటారు. ఒకటి మోనోజైగోట్‌. దీనినే ఐడెంటికల్‌ అంటారు. ఏక అండంతో రెండు శుక్ర కణాలు కలిసినప్పుడు ఇలా జరుగుతుంది. జైగోట్‌ రెండు పిండాలుగా అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి సందర్భాల్లో మాత్రమే పుట్టబోయే పిల్లలు ఒకటే జెండర్‌గా పుడతారు. వారు ఆడ కావచ్చు.. మగ కావచ్చన్నమాట. ఇక రెండోది డై జైగోట్‌. దీనినే నాన్‌ ఐడెంటికల్‌ లేక ప్రేటర్నర్‌ అంటారు. అంటే రెండు అండాలు.. రెండు శుక్రకణాలను కలిశాయని అర్థం. అప్పుడు కవలల్లో ఒకరు ఆడ, ఒకరు మగ లేదా ఇద్దరూ ఆడ, ఇద్దరూ మగ కూడా పుట్టవచ్చు.

అవిభక్త కవలలు ఎలా పుడతారంటే?

మోనోజైగోట్‌ ట్విన్స్‌ అవిభక్త కవలలుగా పుట్టే అవకాశం ఉంటుంది. ఫలదీకరణం చెందిన తర్వాత 12 రోజులకు వేర్వేరు శరీరాలు ఏర్పడటంలో వైఫల్యం చెందితే ఇలా జరుగుతుంది. ప్రసవం అనంతరం కొన్ని రోజులు లేదా సంవత్సరాలకు.. అవిభక్త కవలలుగా పుట్టిన వారిని వేరు చేసే శస్త్ర చికిత్సలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అయితే అలా చేయడానికి ఇద్దరు కవలల గుండె, మెదడు, కాలేయం, ఊపిరితిత్తులు వంటి ముఖ్యమైన అవయవాలు వేర్వేరుగా ఏర్పడి ఉండాలి. కొన్ని సంక్లిష్టమైన కేసుల్లో మాత్రమే శస్త్రచికిత్స చేయడం మంచిది కాదని వైద్యులు చెబుతుంటారు. మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వీణ-వాణి ఇలా జన్మించిన అవిభక్త కవలలే.

ఐవీఎఫ్‌ ద్వారా కవల పిల్లల్ని పొందొచ్చా!

సంతానలేమితో బాధపడే వారి కోసం ఇప్పుడు సంతాన సాఫల్య కేంద్రాలు(ivf centre) అందుబాటులోకి వచ్చాయి. వీర్యంలో నాణ్యత, అండం ఏర్పడటంలో సమస్యలను గుర్తించి ఇక్కడ చికిత్స ఇస్తుంటారు. సంతాన లేమితో బాధపడేవారికి చాలా ఐవీఎఫ్‌ సెంటర్లలో రెండు పిండాలు(embryo) గర్భంలో ప్రవేశ పెడతారు. ఎందుకంటే ఒకటి వైఫల్యం చెందినా రెండో దానితో శిశువు ఏర్పడుతుందనేది వారి ప్రయత్నం. అలాంటి సందర్భాల్లో రెండు పిండాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే కవలలు పుడతారు.

కవలల గురించి మరిన్ని విశేషాలు..

👶 మొరాకోకు చెందిన హలీమా అనే మహిళ 9 మందికి జన్మనిచ్చి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. ఆమెకు ఒకే కాన్పులో ఐదుగురు ఆడ, నలుగురు మగ పిల్లలు(baby) పుట్టారు.

👶 చిన్న వయసులో.. లేదా పెద్ద వయసులో గర్భం దాల్చిన మహిళలకు కవలలు పుట్టే అవకాశం ఎక్కువ.

👶 ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 16 లక్షల మంది కవలలు జన్మిస్తున్నారు.

👶 అమెరికాలో(america) 1980-2009 మధ్యకాలంలో కవలల జనన రేటు గణనీయంగా పెరిగింది. అక్కడ వెయ్యి మందికిగానూ 18.8 మంది కవలలు ఉన్న రేటు.. 33.3 మంది కవలలుగా అభివృద్ధి చెందింది.

👶 ఆఫ్రికాలోని యోరుబా జాతిలో కవలలు ఎక్కువగా పుడతారు. ప్రతి వెయ్యిమందిలో 90-100 మంది కవలలకు జన్మనిస్తారు. వారు ‘యామ్‌’ అనే మొక్కకు కాసిన కూరగాయలను తినడం వల్లనే అలా జరుగుతోందని కొన్ని పరిశోధనల్లో తేలింది. 

👶 ప్రస్తుతం మనం తీసుకుంటున్న డెయిరీ ప్రాడక్ట్‌ల మూలంగా కవలలు పుట్టే అవకాశాలు పెరుగుతున్నట్లు 2006లో నిర్వహించిన ఒక పరిశోధనలో తేలింది. పశువులకు ఇచ్చే పెరుగుదల హార్మోన్‌ ఇందుకు దోహదం చేస్తున్నట్లు వెల్లడైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని