Cable rail bridge : ఇంజినీరింగ్‌ అద్భుతం.. ఈ మొట్టమొదటి రైల్వే తీగల వంతెన!

జమ్మూ (Jammu), కశ్మీర్‌ (Kashmir), దేశంలోని ఇతర భూభాగాలను కలిపే రైల్వే ప్రాజెక్టులోని (Railway project) అతి ముఖ్యమైన ఘట్టం త్వరలో పూర్తి కాబోతోంది. అదే అంజి ఖాద్‌ వంతెన  (Anji Khad bridge). దేశంలో నిర్మిస్తున్న మొట్ట మొదటి రైల్వే తీగల వంతెన (cable stayed rail bridge) ఇది. మేలో దీన్ని అందుబాటులోకి తీసుకొస్తామని భారతీయ రైల్వే (Indian railway) ఇదివరకే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ వంతెన విశేషాలివి..

Published : 01 Apr 2023 10:08 IST

(Image : Twitter)

జమ్మూలోని (Jammu) రైసీ జిల్లాలో నిర్మిస్తున్న ఈ తీగల వంతెన జమ్మూ-బారాముల్లా మార్గంలోని కాంట్రా-రైసీ సెక్షన్లను కలుపుతుంది. జమ్మూ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఈ బ్రిడ్జి  ఉంది. అద్భుతమైన హిమాలయ పర్వతాల మధ్య సుమారు రూ.400 కోట్ల వ్యయంతో నిర్మించారు. కొంకణ్‌ రైల్వే కార్పొరేషన్‌ లిమిటెడ్ దీన్ని అభివృద్ధి చేస్తోంది. ఈ బ్రిడ్జి మొత్తం పొడవు 725 మీటర్లు. అందులో 473.25 మీటర్ల మేర కేబుళ్లుంటాయి. ఈ బ్రిడ్జికి మధ్యలో ఒక పైలాన్‌ మాత్రమే ఉంది. ఒక టవర్‌ లాంటి ఈ నిర్మాణం అంజి ఖాద్‌ (Anji Khad) రివర్‌ బెడ్ నుంచి 1086 అడుగుల ఎత్తు ఉంది. అది 77 అంతస్తుల భవనం ఎత్తుతో సమానం. బ్రిడ్జి మొత్తాన్ని 96 తీగలతో అనుసంధానం చేశారు. అవి స్లోవేకియాలో తయారయ్యాయి. ఈ బ్రిడ్జి 216 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను కూడా తట్టుకుంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం దీనిపై రైలు 100 కిలోమీటర్ల స్పీడుతో సునాయాసంగా వెళ్తుందని అంటున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల 30 కిలోమీటర్ల వేగంతో మాత్రమే నడపనున్నట్లు సమాచారం. అంజి ఖాద్‌ బ్రిడ్జిని తొలుత చీనాబ్‌ నదిపై నిర్మించిన ఆర్చ్‌ బ్రిడ్జి తరహాలో నిర్మించాలనుకున్నారు. భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని చివరికి తీగల వంతెనను ఖరారు చేశారు.

అనేక అడ్డంకులు

అంజి ఖాద్‌ నది ప్రతి వర్షాకాలంలో ఉప్పొంగుతుంది. దాంతో నిర్మాణ పనులు నెమ్మదించాయి. పుల్వామాలో ముష్కరుల దాడి, కొవిడ్‌ కారణంగానూ పనులు నత్తనడకన సాగాయి. సొరంగ నిర్మాణాల కోసం కొండను తొలుస్తున్న సమయంలో మీథేన్‌ గ్యాస్‌ లీకయింది. రెండేళ్లపాటు సమీప ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలను నిలిపివేశారు. దాంతో ప్రాజెక్టుకు కావాల్సిన ముడిసరకు దొరకడం కష్టతరంగా మారింది. పైగా ఇక్కడ వాతావరణం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎత్తయిన ప్రదేశం కావడంతో బలమైన గాలులు వీస్తుంటాయి. చలికాలంలో పొగమంచు తీవ్రత అధికంగా ఉండటంతో పనిచేయడం కుదరదు. దాంతో చాలా సార్లు నిర్మాణ పనులను నిలిపివేశారు. 

చీనాబ్‌ బ్రిడ్జి ఈ ప్రాజెక్టులోనే..

ఉధంపుర్‌-శ్రీనగర్‌-బారాముల్లా రైల్‌ లింక్‌ ప్రాజెక్టు రూ.37 వేల కోట్ల వ్యయంతో చేపట్టారు. మొత్తం 326 కిలోమీటర్ల దూరాన్ని ఇది కవర్‌ చేస్తుంది. ఇందులో 215 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయింది. జమ్మూ ప్రాంతంలోని జమ్మూ-ఉధంపుర్‌-కాట్రా మార్గం 79 కిలోమీటర్లు, కశ్మీర్‌ లోయలో బనిహల్-కజిగుంద్‌-బారాముల్లా మార్గం 136 కిలోమీటర్లు ఉంది. కాట్రా-బనిహాల్‌ మధ్య 111 కిలోమీటర్ల మేర పనులు ఇంకా జరుగుతున్నాయి. ఎక్కువగా సొరంగాలు, బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉండటంతో పనులు ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. 2024 నాటికి మొత్తం పనులు పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగానే ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జిని చీనాబ్‌ వంతెనపై నిర్మించారు. వంతెన కోసం 1315 మీటర్ల పొడవైన ఆర్చ్‌ ఏర్పాటు చేశారు. నదీ మట్టానికి 359 మీటర్ల ఎత్తులో దీన్ని కట్టారు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని